టీఆర్ఎస్ మంత్రులు, నేతలపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రత్యర్థులపై ఆయన మాటల తూటాలు పేల్చారు. అరె కొడుకుల్లారా ఖబడ్దార్…అంటూ టీఆర్ఎస్ నేతలను ఆయన హెచ్చరించడం గమనార్హం.
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా సోమవారం శనిగరంలో ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘అరె కొడుకుల్లారా ఖబడ్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది’ అని ఆవేశంతో ఊగిపోయారు.
పాదయాత్ర ప్రారంభం రోజే ఈటల తనలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మున్ముందు హుజూరాబాద్‌లో రాజకీయం ఎంత దుమారం రేపుతుందో నేటి ఈటల సంచలన వ్యాఖ్యలే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈటల ఘాటు వ్యాఖ్యలపై ప్రత్యర్థుల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హుజూరాబాద్‌లో ప్రతిదీ ఎత్తుకు పైఎత్తులతో రాజకీయం నడుస్తోందని చెప్పక తప్పదు. టీఆర్ఎస్‌ను ఓ వ్యూహం ప్రకారం రెచ్చగొట్టే పనిలో బీజేపీ వుందనేందుకు ఈటల తాజా కామెంట్సే ఉదాహరణ.