బుల్లితెరపై వకీల్ సాబ్ ప్రభంజనం.. నిజమేనా?

థియేటర్లలో వకీల్ సాబ్ ఏ మేరకు ప్రభావం చూపించాడో అందరం చూశాం. పవన్ కమ్-బ్యాక్ సినిమా అంటూ భారీగా ప్రచారం కల్పించినప్పటికీ.. సినిమా ప్రభావం 3 రోజుల ముచ్చటగా మారిందంతే. నాలుగో రోజు నుంచి…

థియేటర్లలో వకీల్ సాబ్ ఏ మేరకు ప్రభావం చూపించాడో అందరం చూశాం. పవన్ కమ్-బ్యాక్ సినిమా అంటూ భారీగా ప్రచారం కల్పించినప్పటికీ.. సినిమా ప్రభావం 3 రోజుల ముచ్చటగా మారిందంతే. నాలుగో రోజు నుంచి ఆక్యుపెన్సీ ధడేల్ మని పడిపోయింది. ఫ్యాన్స్ కాబట్టి మొదటి 3 రోజులు చూశారు. 

కరోనా వల్ల మిగతా ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యారు. దీంతో అసలు వకీల్ సాబ్ బ్రేక్-ఈవెన్ అయిందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ.. రెండో వారం నుంచి వకీల్ సాబ్ థియేటర్లన్నీ ఖాళీగా కనిపించాయనేది కఠోర నిజం.

అలా థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెరవలేకపోయిన వకీల్ సాబ్.. ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకే వచ్చేశాడు. నిన్న ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేశారు. నిన్నంతా పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేశారు. వకీల్ వస్తున్నాడు, టీవీలకు అతుక్కుపోండండూ ఊదరగొట్టారు. అటు ఆ ఛానెల్ కూడా కాస్త గట్టిగానే ప్రమోషన్ చేసి పెట్టింది. మరి వెండితెరపై మేజిక్ చేయలేకపోయిన వకీల్ సాబ్, కనీసం స్మాల్ స్క్రీన్ పైన అయినా ఆకట్టుకుంటాడా..?

టీఆర్పీ పరంగా బుల్లితెరపై ప్రస్తుతానికి అల వైకుంఠపురములో సినిమాదే హవా. బాహుబలి-2ను అధిగమించి అత్యథికంగా 29.4 టీఆర్పీ సాధించింది బన్నీ-త్రివిక్రమ్ సినిమా. ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో నిలిచింది సరిలేరు నీకెవ్వరు సినిమా. మహేష్ నటించిన ఈ మూవీకి 23.4 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో స్థానంలో బాహుబలి-2 (22.7), నాలుగో స్థానంలో శ్రీమంతుడు (22.5), ఐదో స్థానంలో దువ్వాడ జగన్నాథమ్ (21.7) సినిమాలున్నాయి. మరి వకీల్ సాబ్ సినిమా టాప్-5లోకి ఎంటర్ అవుతుందా అనేది ప్రశ్న?

బుల్లితెరపై వినోదానికే పెద్ద పీట. ఏ సినిమా ఎక్కువగా అలరిస్తుందో దానికే బ్రహ్మరథం పడతారు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు ఆ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయంటే కారణం అందులో ఉన్న వినోదం, ఆ సినిమాలో పాటలు. మరి ఈ రెండు సినిమాల స్థాయిలో వకీల్ సాబ్ లో వినోదం ఉందా అంటే లేదనే చెప్పాలి. పోనీ ఈ రెండు సినిమాల స్థాయిలో వకీల్ సాబ్ సాంగ్స్ హిట్టయ్యాయా అంటే దానికి కూడా 'నో' అనే సమాధానం వస్తుంది.

కానీ పవన్ అభిమానులు మాత్రం తమ సినిమా టీఆర్పీల చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందని చెబుతున్నారు. బన్నీ, మహేష్ సినిమాల్ని దాటి భారీ రేటింగ్ సాధిస్తుందంటూ ఎవరి విశ్లేషణలు వాళ్లు ఇస్తున్నారు. అదే కనుక జరిగితే జీ తెలుగు పంట పండినట్టే. ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ విభాగంలో నంబర్-2 స్థానంలో కొనసాగుతున్న ఈ ఛానెల్.. వకీల్ సాబ్ చలవతో నంబర్ వన్ స్థానానికి ఎగబాకడం ఖాయం.