నెల రోజులకే నశించిన సహనం..!

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పరిపాలనకు నెలరోజులు నిండాయి. నెలరోజుల పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తుతోంది టీడీపీ ఒక్కటే కనబడుతోంది. ఇతర పార్టీలేవీ ఇప్పటివరకు పెద్దగా ఏమీ మాట్లాడలేదు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజావేదిక…

ఏపీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పరిపాలనకు నెలరోజులు నిండాయి. నెలరోజుల పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తుతోంది టీడీపీ ఒక్కటే కనబడుతోంది. ఇతర పార్టీలేవీ ఇప్పటివరకు పెద్దగా ఏమీ మాట్లాడలేదు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజావేదిక కూల్చివేతను సమర్థించి, దీంతో ఆగకూడదని, ఇతర అక్రమ నిర్మాణాలనూ కూల్చాలని అన్నాడు. 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రయివేటు విద్యా సంస్థలకూ వర్తింపచేయడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని పార్టీలే కాదు, ఉపాధ్యాయ సంఘాలూ విమర్శలు చేస్తున్నాయి. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలను దెబ్బ తీస్తుందని చెబుతున్నాయి. ఇదిలావుంటే, ఎక్కువగా సంచలనం కలిగించిందీ, ఇంకా కలిగించబోయేది అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్న నిర్ణయం. అందుకు ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వం నాంది పలికింది. దీనిపై మండిపడుతున్న పార్టీ టీడీపీ ఒక్కటే.

టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా అక్రమ నిర్మాణాలను కూల్చాలన్న నిర్ణయాన్ని 'కక్ష సాధింపు' చర్యగా ముద్ర వేసింది. జగన్‌కు దూకుడు ఎక్కువైందని, అంత పనికిరాదని, దీనివల్ల ఆయనకే నష్టమని టీడీపీ అనుకూల పత్రిక అభిప్రాయపడింది. ఇందుకు తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు (జయలలిత, కరుణానిధి పరిపాలన) వ్యవహరించిన తీరును, తద్వారా కలిగిన నష్టాన్ని ఉదహరించింది. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనివేనని, ఆయన కారణంగానే అవి పుట్టుకొచ్చాయని తేల్చిపారేసింది. మొత్తం మీద వైఎస్‌ఆర్‌, జగన్‌ ఇద్దరిదీ కక్ష సాధింపు మనస్తత్వమని ముక్తాయించింది. ప్రజావేదికను చంద్రబాబు తనకు ఇవ్వాలని అడిగినందుకే జగన్‌ ఆగ్రహించి కూలగొట్టించారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు లింగమనేని ఎట్టేట్‌ కూడా కూలగొట్టేందుకు వారు వ్యతిరేకిస్తున్నారు. అది బాబు సొంతం కాకపోయినా నేతలు అలాగే ఫీలవుతున్నారు. జగన్‌ అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంపై  వెంటనే విమర్శలు చేయవద్దని, దూకుడుగా మాట్లాడవద్దని, ఆరు నెలలు పరిశీలించి ఆ తరువాత మాట్లాడదామని చెప్పారు. కాని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరికీ నెల రోజులకే సహనం నశించిపోయింది. వాస్తవానికి నెల రోజులు కూడా ఓపిక పట్టలేదు. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నేతలు టీవీ చర్చా కార్యక్రమాల్లో, మీడియా సమావేశాల్లో, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ప్రారంభించారు.

వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ సంబంధిత ఫైలుపై జగన్‌ తొలి సంతకం చేశారు. దాంతోనే విమర్శలు మొదలయ్యాయి. జగన్‌ వాగ్దానం ఉల్లంఘించారని రెండువేల పింఛన్‌ను మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చిన ఆయన 250 రూపాయలు మాత్రమే పెంచారంటూ మండిపడ్డారు. పింఛన్‌ మొత్తాన్ని క్రమంగా పెంచుతామని చెప్పారుగాని ఒకేసారి పెంచుతామని చెప్పలేదని వైకాపా నాయకులు ఎదురుదాడి చేశారు. ఈ గోల జరుగుతుండగానే అక్రమ నిర్మాణాల కూల్చివేత తెర మీదికి వచ్చింది. ఈ రచ్చ ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేం. ఇక టీడీపీ జగన్‌ ప్రభుత్వంపై పోరాటానికి సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారట..!

ఇప్పటివరకు ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌ మొదలైన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న మాటల యుద్ధం ఇక చేతల్లో జరిగేలా ఉంది. ఈమధ్య అసెంబ్లీలో కూడా ఇరు పార్టీల నాయకులు నోరు పారేసుకున్నారు. తొందరలోనే బడ్జెటు సమావేశాలు జరుగుతాయి. అసలు యుద్ధం అప్పుడు మొదలవుతుంది. ఇప్పటివరకు గమ్మున ఉన్న పార్టీలు కూడా బడ్జెట్‌పై విమర్శలు చేయక మానవు. ఇక టీడీపీ నాయకులు డీజీపీని కలవబోతున్నారు. వైకాపా నేతలు అప్పుడే భారీగా 'దందాలు' మొదలుపెట్టారని, చేతివాటం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అనుకూల పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే జగన్‌ కఠిన చర్యలు తీసుకోవల్సిందే.

బాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చాలా అక్రమాలు చేశారు. వీరి అక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అధికారులపై దాడులకూ తెగబడ్డారు. అయినప్పటికీ బాబు గమ్మున ఉండిపోయారు. వారిపై ఉన్న క్రిమినల్‌ కేసులూ ఎత్తేయించారు. టీడీపీ ఓటమికి ఇది కూడా కారణమే. 'ఎమ్మెల్యేలు చెప్పినట్లు మీరు వినక్కర్లేదు' అని అధికారులకు చెప్పిన జగన్‌ దందాలు చేస్తున్నవారిపట్ల ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పార్టీ ప్రజాప్రతినిధుల్లో కొందరు దందాలు చేయడం మామూలే. కాని ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యవహారాలు పెద్దగా పట్టించుకోరు. ఇప్పటివరకు జగన్‌ అడుగులు సజావుగానే పడుతున్నాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం బాగానే ఉందిగాని అవి అనాలోచిత నిర్ణయాలు కాకూడదు. 

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!