నజీర్ తప్పించుకున్నాడు, అతని అనుచరులు యిద్దరు చనిపోయారు అని తెలియగానే సాల్, క్యారీ వెంటనే ఫాతిమా యింటికి కారులో వెళ్లారు. స్థానిక ప్రజలంతా అమెరికన్లంటే మండిపడుతున్నారు కాబట్టి వాళ్ల రాళ్ల దెబ్బల నుంచి తప్పించుకుంటూ సందులో వున్న ఆ యింటికి వెళ్లాల్సి వచ్చింది. ఫాతిమా యింటి గుమ్మం ముందే నిలబడి వుంది. వెంటనే కారు ఎక్కింది. ‘‘మీ ఆయన తాలూకు ముఖ్యమైన కాగితాలు ఫ్లాట్‌లో ఏమైనా పడివున్నాయా?’’ అని అడిగింది క్యారీ. ‘‘ఏమో’’ అంది ఫాతిమా. ‘‘పోతే పోనీ, మనం యిక్కణ్నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు’’ అన్నాడు సాల్.
కానీ సాహసానికి మారుపేరైన క్యారీ ఆ సలహా వినలేదు. ఫాతిమా నుంచి ఫ్లాట్ తాళం చెవి గుంజుకుని మూడో అంతస్తులో వున్న ఫ్లాట్‌కు పరిగెట్టింది. గబగబా ముఖ్యమైనవని తోచిన కొన్ని కాగితాలను, ఫైళ్లను పోగేసింది. ఈ లోపుగానే బిల్డింగులో వున్నవాళ్లంతా ఫ్లాట్ తలుపు బాదసాగారు. పక్క బిల్డింగు నుంచి జనం తుపాకులు, కఱ్ఱలు చేతబట్టి క్యారీని చుట్టుముట్టబోతున్నారు. చేతిలో ఎక్కువ సమయం లేదని గ్రహించిన క్యారీ వెతకడం చాలించి, బయలుదేరబోయింది. ఈ కాగితాలను ఎక్కడ పెట్టాలా అని చూసి ఒక గుడ్డసంచి కనబడితే దానిలో కుక్కింది. అది భుజాన తగిలించుకుని, ఫ్లాట్‌లోంచి రివ్వున బయటకు ఉరికింది.
ఈ లోపున సందులో సాల్, ఫాతిమా వగైరాలు వున్న కారుపై జనం దాడి చేస్తున్నారు. క్యారీ చెప్పినమాట వినలేదని సాల్ విసుక్కుంటూ కాస్సేపు చూశాడు కానీ యింకా ఆగితే మొదటికే మోసం వస్తుందని, క్యారీ కర్మానికి క్యారీని వదిలేసి కారును పోనివ్వమన్నాడు. అది సందుల్లో తిరుగుతూ సురక్షిత ప్రాంతం వైపు వెళుతోంది. ఈలోగా క్యారీ తన వెంటపడిన వారిని తప్పించుకోవడానికి యిళ్ల కప్పుల మీదుగా పరిగెత్తుతూ, దూకుతూ, తుపాకీగుళ్లు తప్పించుకుంటూ పోతోంది.
చివరకు ఓ సందులో కిందకు దూకింది. అదృష్టవశాత్తూ సాల్ కారు సరిగ్గా అప్పటికి చేరింది. ఈమెను చూస్తూనే వాళ్లు పట్టుకుని కారులో కుదేశారు. సాల్ నోరారా తిట్టిపోశాడు. సారీ, సారీ అంటూ క్యారీ బ్యాగ్ అతని చేతిలో పెట్టింది. ఆ రాత్రే క్యారీని, ఫాతిమాను అక్కణ్నుంచి అమెరికాకు క్షేమంగా పంపించివేశారు. ఫాతిమాకు సిఐఏ అమెరికాలో ఆశ్రయం ఏర్పాటు చేసింది. తనకు అప్పగించిన పని పూర్తి చేసిన సంతోషంతో క్యారీ తన సోదరి యింటికి వెళ్లిపోయింది.
బ్రాడీ తన మెరీన్ స్నేహితులతో కూర్చుని డ్రింకు తీసుకుంటున్నాడు. అంతకు ముందు రోజు వాల్డెన్ను కలవడానికి వెళుతూండగానే మైక్ వచ్చి ‘టామ్ మరణం గురించి, అతను టెర్రరిస్టుగా మారడం గురించి మనవాళ్లందరికీ అనుమానంగా వుంది. నువ్వు కాంగ్రెస్మన్వి కాబట్టి దానికి సంబంధించిన కాగితాలు ఏమున్నాయో చూసి కాస్త చెప్పు. రేపు సాయంత్రం అందరం కలుద్దాం.’ అన్నాడు. బ్రాడీ సరేననడం, వాల్డెన్‌తో బాటు గదిలో చేరడం, నజీర్‌ను హెచ్చరించి కాపాడడం జరిగిపోయాయి. నజీర్‌కు ఎవరు, ఎలా సమాచారం అందించారో తెలియక ఆ గదిలోని వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరూ బ్రాడీని శంకించలేదు.
ఇక్కడ మెరీన్స్ మాత్రం అతన్ని నిలదీశారు, ముఖ్యంగా లాడర్ అనే తాగుబోతు మెరీన్. ‘‘టామ్ బెస్ట్ షూటరని మనందరికీ తెలుసు. మూడు సార్లు అతను లక్ష్యాన్ని తప్పాడంటే ఎవరం నమ్మం. ఆనాటి కుట్రలో అతనొక్కడే కాదు, మరొకడు కూడా వుండి వుండాలి. ఎవడు వాడు? దృష్టి మరల్చడానికే టామ్‌ను వాడుకున్నారా? పైగా టామ్ అనామకంగా చచ్చిపోవడమేమిటి?’’ ఇలా అనేకం అడిగారు. బ్రాడీ వేటికీ సమాధానం చెప్పలేదు. ‘‘ఫైళ్లలో ఏమీ లేదు. టామ్ దేశద్రోహి, చచ్చిపోయాడు, దట్సాల్’’ అన్నాడు.
మర్నాడు మహిళా జర్నలిస్టు రోయా వచ్చి బ్రాడీని కలిసి ‘‘నజీర్ నీకు థాంక్స్ చెప్పమన్నాడు.’’ అంది. అతనికి చికాకేసింది. ‘‘నేనేమీ మీ మనిషిని కాను’’ అన్నాడు ఉక్రోషంగా. ‘‘నీకు భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్ర వుంది. నజీర్‌కు నీ అవసరం ఎంతో వుంది.’’ అంది. బ్రాడీ ఏమీ సంతోషించలేదు. ఇంటికి వచ్చి వాల్డెన్ భార్య, జెసికా కలిసి ఏర్పాటు చేసిన వార్ వెటరన్స్ సమావేశంలో యివ్వవలసిన ఉపన్యాసం రాసుకున్నాడు. దానిలో బందీగా వుండగా తను కుటుంబం గురించి ఎంత బెంగపడ్డాడో వివరించాడు. అది చదివి జెసికా చలించింది. భర్త తన కార్యక్రమానికి అంత విలువ నివ్వడం చూసి పొంగిపోయింది.
ఫాతిమా యింటి నుంచి క్యారీ తెచ్చిన బ్యాగ్‌లోని డాక్యుమెంట్లను సాల్ తన అసిస్టెంటుకి యిచ్చి వాటిలో విలువైనవి ఏవైనా ఉన్నాయేమో చూడమన్నాడు. వాటిని కట్టకట్టి హెడ్‌క్వార్టర్స్‌కి పంపే ఏర్పాట్లు చేస్తూ, పట్టుకుని వచ్చిన గుడ్డసంచీని బయట పారవేయబోతూ అనుకోకుండా దాన్ని తడిమాడు. ఒక చోట గట్టిగా తగిలింది. ఆ బ్యాగ్ లైనింగ్లో దేన్నో దాచినట్లు తెలిసింది. చింపి చూస్తే కెమెరా మెమరీ కార్డు వుంది. కంప్యూటర్లో పెట్టి చూస్తే అది ‘ఆత్మాహుతి’కి ముందు బ్రాడీ చేసిన వీడియో. అతని యింటి దగ్గరున్న రాతిగోడ నుంచి మాయమై పోయింది కదా, అల్‌ఖైదా మనుషులు తీసుకుని వచ్చి, కాపీ చేసి, ఫాతిమా భర్తకు యిచ్చారన్నమాట. అతను బాగ్‌లో కుట్టి దాచాడు. అది అనుకోకుండా సాల్ చేతపడింది.
వీడియో చూడగానే బ్రాడీ గురించి క్యారీ అనుమానమే కరక్టని, అతను దేశద్రోహి అని సాల్‌కు అర్థమైంది. వెంటనే అమెరికాకు వెళ్లి సిఐఏలో అందరికీ చూపించాలని నిశ్చయించుకుని, అది తన సూట్‌కేసులో దాచుకుని, విమానమెక్కాడు. ఫాతిమా యింట్లోంచి బ్యాగ్ మిస్సయిందని తెలియగానే అల్‌ఖైదా ఎలర్టయింది. ఆ వీడియో బయటకు వస్తే బ్రాడీ జీవితం బట్టబయలవుతుంది. తాము కష్టపడి నిలబెట్టిన మనిషికి వ్యతిరేకంగా వున్న ఆధారం లేకుండా చేయాలని హిజ్బొల్లాకు చెప్పి సాల్‌ను ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయించింది. చెకింగ్ చేసే అధికారి పక్కనే నిలబడిన హిజ్బొల్లా మనిషి సాల్‌ను పక్కకు తీసుకెళ్లి పెట్టె తెరవమన్నాడు.
నేను రాయబార కార్యాలయం మనిషిని. నాకు డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ వుంది అని సాల్ వాదించినా లాభం లేకపోయింది. పెట్టె మొత్తం వెతికి, ఏమీ కనబడక, చివరకు లోపలి లైనింగ్ చింపి చూశారు. దానిలో మెమరీ కార్డు కనబడింది. అది తీసి జేబులో పెట్టుకుని, ‘‘ఇంకెప్పుడూ లెబనాన్ రావద్దు.’’ అని సాల్‌ను హెచ్చరించి వదిలారు. ఆ ఆధారం లేకపోతే బ్రాడీ నిజస్వరూపం నిరూపించడం కష్టమని, అల్‌ఖైదా యిలాటిది ఏదో చేస్తుందని ముందే ఊహించిన సాల్ దాని కాపీని సూట్‌కేసు హేండిల్లో దాచాడు. ఇది దొరకడంతో వాళ్లు దాన్ని వదిలేశారు. విమానం ఎక్కగానే అది బయటకు లాగి జేబులో పెట్టుకున్నాడు.
ఈ వీడియో సంగతి ఏమీ తెలియని క్యారీని యిక్కడ సిఐఏ వాళ్లు అవమానాల పాలు చేస్తున్నారు. లెబనాన్ నుంచి రాగానే నిద్ర మానుకుని రిపోర్టు తయారుచేసింది. సిఐఏ నుంచి గాల్వెజ్ వచ్చి దాన్ని పట్టుకెళ్లి, సాయంత్రం సమావేశానికి రమ్మనమని పిలిచాడు. తీరా సాయంత్రం వెళితే ఆమె వచ్చేందుకు ముందే డేవిడ్ సమావేశం ప్రారంభించేశాడు. క్యారీ మధ్యలో వస్తే పక్కకు తీసుకెళ్లి ‘‘నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్. ఇక వెళ్లిరా’’ అన్నాడు. సిఐఏ తనను మళ్లీ పిలుస్తుందేమోనని ఆశించిన క్యారీకి తీవ్ర ఆశాభంగం కలిగింది. ఎందుకీ జీవితం, ఆత్మహత్య చేసుకుంటే పోలేదా అనిపించింది.
తన అక్క యింటి నుంచి సొంత యింటికి వచ్చేసింది. మంచి బట్టలువేసుకుని, వైన్ తాగి, అనేక నిద్రమాత్రలు కలుపుకుని తాగేసి, నిద్రకు ఉపక్రమించింది. కాస్సేపు పోయాక ‘నేనెందుకు చావాలి?’ అని అనిపించింది. లేచి కష్టపడి ఆ మాత్రలన్నీ కక్కింది. ఇక ఒళ్లు తెలియకుండా పడి నిద్రపోయింది.
వెటరన్స్ ఫంక్షన్ ఉన్న రోజు ఉదయం బ్రాడీకి రోయా ఫోన్ చేసి ‘‘క్యారీ లెబనాన్ నుంచి పట్టుకుని వచ్చిన కాగితాల్లో గెట్టీస్బర్గ్లో నీకు జాకెట్ కుట్టి యిచ్చిన ముసలి టైలర్ గురించి సమాచారం వుంది. సిఐఏ అతన్ని పట్టుకోబోతోంది. నువ్వు వెంటనే వెళ్లి అతన్ని ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చి రావాలి అని చెప్పింది. ‘నాకెలా కుదురుతుంది? నాకు యివాళ పెద్ద ఫంక్షన్ వుంది’ అన్నాడు బ్రాడీ. ‘ఆ టైలర్‌కు తెలిసున్నవాడివి నువ్వే. నువ్వు వెళితేనే అతను కదులుతాడు. లేకపోతే మొండికేస్తాడు. అతను పట్టుబడితే మన వివరాలు పోలీసులకు తెలిసిపోతాయి’ అంది రోయా.
బ్రాడీకి గత్యంతరం లేకపోయింది. వెంటనే కారేసుకుని వెళ్లాడు. గెట్టీస్‌బర్గ్ వెళ్లి టైలర్‌తో మాట్లాడితే అతను ‘నేను వేరే చోటకి ఎందుకెళ్లాలి? వెళ్లాక అక్కడేం జరుగుతుంది? అసలు నా సంగతి వీళ్లు వేరేవాళ్లకి ఎందుకు చెప్పారు?’ అంటూ ప్రశ్నలు గుప్పించాడు. ‘నా కవన్నీ తెలియవు. నిన్ను ఆ చోటికి చేర్చడం నా బాధ్యత, కారెక్కు’ అన్నాడు బ్రాడీ. అతను మొరాయిస్తూండగానే షాపు ముందు ఒక ట్రక్కు కనబడింది. పోలీసులు నిఘా వేస్తున్నారని గ్రహించిన బ్రాడీ అతన్ని నెట్టుకుంటూ కారులోకి తోసి, బయుదేర తీశాడు. ఆ ట్రక్కు వీళ్లని వెంటాడడంతో బ్రాడీ వాళ్లను ఏమార్చడానికి దూరపు దారైనా నిర్మానుష్యమైన అడవి త్రోవ పట్టాడు.
కార్లో టైలర్ సతాయించడం మొదలుపెట్టాడు. వీలైతే పారిపోదామని చూస్తున్నాడు. బ్రాడీకి సంకటంగా వుంది. ఈ లోపుగా జెసికా ఫోన్ల మీద ఫోన్లు. ‘ఫంక్షన్ ప్రారంభమవుతోంది, ఎక్కడున్నావ్?’ అంటూ. ‘నా నియోజకవర్గంలో ఏదో పనిబడితే వెళ్లి వస్తున్నాను. మధ్యలో టైరు పంచరైంది. వచ్చేస్తా, వచ్చేస్తా’ అని నచ్చచెపుతున్నాడు బ్రాడీ. నిజంగానే అతని కారు పంక్చరైంది. డిక్కీలో జాకీ లేదు. నాలుగు దుంగలు ఏరుకుని వచ్చి అమర్చి, టైరు మారుస్తూ వుంటే ఈ ఫోన్. టైలర్ గోల వినబడకూడదని, బ్రాడీ కాస్త దూరంగా వెళ్లి భార్యతో మాట్లాడుతూ వుంటే టైలర్‌కు అనుమానం – అల్‌ఖైదా వాళ్లతో మాట్లాడుతున్నాడని, వచ్చి తనను చంపేస్తాడనీ.
ఓ పెద్ద రాయి పట్టుకుని వచ్చి బ్రాడీ తల పగలకొడదామని చూశాడు కానీ కుదరలేదు. బ్రాడీ తన భార్యకు ఏదోలా నచ్చచెప్పుకుని. టైలర్‌ను దొరకపుచ్చుకుని, కారులో కుదేశాడు. కాస్సేపటికి కారులో పెట్రోలయిపోయింది. దిగి పెట్రోలు నింపుకుంటూ వుంటే టైలర్ కారు దిగి, బ్రాడీని రాయితో కొట్టి దగ్గర్లో ఉన్న అడవిలోకి పారిపోయాడు. ఇవతల వైస్ ప్రెసిడెంటు వాల్డెన్, అతని భార్య, జెసికా అందరూ సభలో బ్రాడీ గురించి వేచి వున్నారు. వచ్చినవారందరూ ఎందుకు ఆలస్యమైందని అడుగుతున్నారు. జెసికాకు పిచ్చెక్కిపోతోంది. మొగుడిమీద ఉవ్వెత్తున కోపం వస్తోంది. తనను యిక్కడ వదిలేసి క్యారీతో కులుకుతున్నాడన్న అనుమానం ఒకటి వేధిస్తోంది.
కానీ నిజానికి బ్రాడీ యిక్కడ అడవిలో టైలర్ కోసం వెతుకులాడుతున్నాడు. చివరకు దొరికాడు. కానీ బ్రాడీని తప్పించుకునే ప్రయత్నంలో అతను భూమిలోంచి పొడుచుకు వచ్చిన ఒక చెట్టు కాండం మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం కారిపోతోంది. బ్రాడీ ప్రథమ చికిత్స చేయబోయాడు. తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని టైలర్ మొత్తుకున్నాడు. ఆసుపత్రికి వెళితే సిఐఏకు తెలుస్తుందని బ్రాడీ భయం. ఎలాగోలా అల్‌ఖైదా చెప్పిన స్థలానికి తీసుకెళ్లి పడేస్తే తన బాధ్యత తప్పుతుంది కదాని ఆతని ఆలోచన. ఈ లోగా జెసికా ఫోన్ – ‘ఏం చేస్తున్నావు? ఎవరితో ఉన్నావ్? నేనంటే లక్ష్యం లేదా? నా పరువు తీస్తావా?’ అంటూ.
బ్రాడీ సంజాయిషీ చెప్పుకోలేక సతమతమవుతూ వుంటే మధ్యలో టైలర్ మూలగడం మొదలెట్టాడు. ఈ మూలుగు వింటే జెసికాకు మరింత అనుమానం వస్తుందనే భయంతో బ్రాడీ టైలర్ గొంతు నొక్కాడు. ఆ నొక్కడంలో టైలర్ ప్రాణాలు పోయాయి. అక్కడ ఏదో జరుగుతోందని జెసికాకు అర్థమై పోయింది. బ్రాడీ వంతు వచ్చినపుడు తనే వెళ్లి ఉపన్యాసం యిచ్చింది. సైనికులు యుద్ధభూమికి వెళ్లినపుడు వారి కుటుంబాలు ఎమోషనల్‌గా కూడా ఎంత యిబ్బంది పడతాయో, వాళ్లు తిరిగి వచ్చాక సర్దుకోవడానికి ఎంత కష్టమౌతుందో అద్భుతంగా మాట్లాడింది. చివరిలో వార్ వెటరన్స్ ఫండ్‌లో వారి కుటుంబాలను ఎమోషనల్‌గా కూడా డీల్ చేసే వెసులుబాటు వుండాలని సూచన చేసింది. అంతా అద్భుతం అన్నారు.
ఇక్కడ బ్రాడీ టైలర్ మృతదేహాన్ని కప్పిపెట్టడానికి పెద్ద గొయ్యి తవ్వాడు. ఇంతలో వర్షం పట్టుకుంది. శరీరమంతా మట్టి, బురద. చివరకు తన వూరు చేరేందుకు ముందు ఆటోమెటిక్‌గా కారు వాష్ చేసే షాపుకి వెళ్లి, అక్కడ కారుతో బాటు తనూ తలస్నానం చేసి బురద వదుల్చుకుని యిల్లు చేరాడు. ఆ పాటికి జెసికా, మైక్ వచ్చి కొంతసేపైంది. ఫంక్షన్ అయిపోయాక మైక్ దగ్గరుండి, తన కారులో జెసికాను యింటికి తీసుకుని వచ్చాడు. దారిలో జెసికా తన బాధంతా చెప్పుకుంది. బ్రాడీకి, క్యారీకి గతంలో వున్న ఎఫైర్ గురించి చెప్పింది. మళ్లీ మొదలుపెట్టి వుంటాడని అనుమానమంది.
ఇంటికి వచ్చాక మైక్‌ను లోపలికి పిల్చి డ్రింక్ తీసుకోమంది. అతను సంశయిస్తూనే లోపలికి వచ్చాడు. అప్పుడు బ్రాడీ దిగడ్డాడు. జెసికా అతన్ని చూస్తూనే మండిపడింది. మైక్ ను పంపేసి ‘‘ఎన్నాళ్లీ కల్లబొల్లి కబుర్ల కాపురం?’’ అని భర్తను నిలదీసింది. ‘‘నేను నిజమే చెప్తున్నా’’ అని బ్రాడీ చెప్పినా నమ్మలేదు. ‘‘మన మధ్య బంధం నిలవాలంటే నువ్వు మొత్తం నిజం చెప్పాలి. లేకపోతే నీ దారి నీది, నా దారి నాది’’ అని చెప్పేసింది. ఆ రోజు వరుస సంఘటనలతో విసిగిపోయి వున్న బ్రాడీ నోరెత్తలేక పోయాడు.
సాల్ క్యారీ యింటికి వచ్చి తలుపు తట్టేసరికి ఆమె యింకా గాఢంగా నిద్రపోతోంది. నిద్రమాత్రల ప్రభావం వదుల్చుకుంటూ తలుపు తీసింది. సాల్ ఆమెను చూస్తూనే ఉత్సాహంగా ‘‘లెబనాన్ నుంచి వస్తూ ఎయిర్‌పోర్టు నుంచి డైరక్టుగా మీ యింటికే వస్తున్నాను. ఈ వీడియో చూడు. నీ అంచనా రైటు, మాది తప్పని నీకే తెలుస్తుంది.’’ అంటూ బ్రాడీ ‘ఆత్మాహుతి’ వీడియో చూపించాడు. అది చూడగానే క్యారీ వెక్కివెక్కి ఏడ్చింది. తను అనుకున్నది నిజమైనందుకు సంతోషం, తను మనసారా ప్రేమించినవాడు టెర్రరిస్టా అనే దుఃఖం ఆమెను పెనవేసుకున్నాయి. (ఫోటో- బ్రాడీని ప్రశ్నలతో యిబ్బంది పెట్టే మెరీన్ లాండర్, టైలర్, భర్తకు బదులు సమావేశంలో ప్రసంగించిన జెసికా) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)
[email protected]