‘గోదావరి పుష్కరాల్లో ఏం తప్పు జరిగింది. ఓకే, దురదృష్టంతో చనిపోయారు. కుంభమేళాలో చనిపోలేదా? జగన్నాథ రథచక్రాల కింద చనిపోలేదా? బస్సు ప్రమాదాల్లో చనిపోరా? జరుగుతాయి. జరిగినప్పుడే ఆ రోజే నేను చెప్పాను. చెప్పిన తర్వాత కమిటీ కూడా వేశా’…ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి చంద్రబాబు పలికారు.
2015, జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో మొదటి రోజు జరిగిన తొక్కిసలాటలో దాదాపు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్ లో కాకుండా పుష్కర ఘాట్‌లో నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కుటుంబ సమేతంగా స్నానం చేస్తుండటం, ఓ దర్శకుడి నేతృత్వంలో చిత్రీకరిస్తుండటం, చుట్టూ మంత్రులు, అధికారులందరూ అక్కడే నిలబడి వేడుక చూస్తుండి పోయారు. రెండు గంటల తర్వాత గేట్లు ఒక్కసారిగా తెరవడంతో జనం తోసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు. రిటైర్డ్ జడ్జి సోమయాజులు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఈ దుర్ఘటనపై విచారణకు నియమించారు. ఏ ఒక్కరినీ బాధ్యుల్ని చేయకుండా…నిజాల్ని గోదావరి పుష్కరాల్లో మనుషుల్ని చంపినట్టే చంపేశారు.
మృతుల కుటుంబాలకు నాటి చంద్రబాబు ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాతో సరిపెట్టింది. ఆ తర్వాత బాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాటిపై బాబు స్పందిస్తూ…ఏం కుంభమేళాలో చనిపోలేదా? జగన్నాథ రథచక్రాల కింద చనిపోలేదా అంటూ దబాయించారు.
కానీ నేడు అదే చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో విశాఖ ఘటనపై ఏం మాట్లాడుతున్నారు? కనీసం నవ్వుతారని కూడా భావించకుండా నోటికొచ్చినట్టు ఇష్టానుసారం బాబు అవాకులు చెవాకులు పేలుతున్నారు.
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై చిన్నచిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారించడం ఎంత వరకు సబబని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆయన జూమ్ వీడియో ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే…
“గురువారం విశాఖపట్నానికి వెళ్లిన జగన్ …చనిపోయిన వారికి రూ.కోటి ఇస్తాం. ఎల్జీ సంస్థ డబ్బులిస్తే తీసుకుంటాం. లేదంటే మేమే ఇస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చేలా చూస్తాం. పరిశ్రమను తరలించే అంశాన్ని పరిశీలిస్తామంటూ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని మాట్లాడటం సరికాదు. రూ.కోటి ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?’
అసలు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా? గోదావరి పుష్కరాల్లో తన ప్రచార యావ వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారనే వాస్తవాన్ని బాబు ఎలా విస్మరించారు? ఆ రోజు మృతుల కుటుంబాలకు తానిచ్చిన ఎక్స్‌గ్రేషియా కేవలం రూ.10 లక్షలు. అందులోనూ రూ2 వేల కోట్లు ఖర్చుతో చేపట్టిన గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల చోటు చేసుకున్న దుర్ఘటన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలవి.
ఇక్కడే చంద్రబాబు, జగన్‌కు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నాడు తన వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు మొక్కుబడి సాయంతో బాబు సరిపెట్టారు. పైగా ఇలాంటి మరణాలు సర్వసాధారణమన్నట్టు బాబు మాట్లాడిన మాటలు కుటుంబ సభ్యులకు తీవ్ర మనో వేదన మిగిల్చాయి. ఇదే జగన్ విషయానికి వస్తే…సంఘటన జరిగిన రోజే బాధితుల్ని పరామర్శించడం, తానున్నానంటూ మనో ధైర్యం కల్పించేలా ఆర్థిక, హార్థిక సాయాన్ని అందించారు.
ప్రజల్ని నిజంగా ప్రేమించే నాయకుడు పాలకుడైతే ఎలా ఉంటుందో జగన్ ఆచరణలో చేసి చూపించారు. ప్రజలపై దయలేని నాయకుడు పాలకుడైతే ఎలాగుంటుందో గోదావరి పుష్కరాల్లో మృతుల విషయంలో బాబు అనుసరించిన విధానాలు కళ్లకు కట్టాయి. ప్రజలకు సేవ చేయడానికి నాయకులకు కావాల్సింది రాజకీయ, పాలనానుభవం కాదు. గుండెల నిండా ప్రేమ. అది జగన్‌లో పుష్కలంగా ఉంది. మన ప్రతిపక్ష నేత గుండెల నిండా ప్రేమ మినహాయించి…మిగిలిన అంశాలు ఏమున్నాయో, ఆయన్ను గద్దె దించిన ప్రజలకు బాగా తెలుసు.
-సొదుం