ఈట‌ల‌ను ఎదుర్కోడానికి అన్ని వంద‌ల కోట్లా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. ఈట‌ల ఎంత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థో టీఆర్ఎస్ అక్క‌డ చేయ‌నున్న ఖ‌ర్చే…

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. ఈట‌ల ఎంత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థో టీఆర్ఎస్ అక్క‌డ చేయ‌నున్న ఖ‌ర్చే తెలియ‌జేస్తోంది. పేరుకు తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌క‌మే కానీ, ఉప ఎన్నిక‌లో గెలుపే ల‌క్ష్యంగా అధికార పార్టీ చేసిన ప‌థ‌క ర‌చ‌న‌గా రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఎన్నిక‌లొస్తే త‌ప్ప ఉద్యోగ ప్ర‌క‌ట‌నో, ఇత‌ర‌త్రా ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి క‌లిగించే ప‌థ‌కాల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ అమ‌లు చేయ‌ర‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ‌లో ద‌ళిత సాధికార‌త ప‌థ‌కానికి  ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించనుండ‌డం విశేషం. రూ.1,200 కోట్లతో ఈ ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది.  

అయితే పైలట్‌ ప్రాజెక్టు కావ‌డంతో హుజూరాబాద్‌కు అదనంగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి వ్యాపార నిమిత్తం రూ.పది లక్షల ఆర్థిక సాయం అంద‌జేస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు సాయం చేయాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

అయితే ఒక్క హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాష్ట్రం మొత్తంపై పెట్టే ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం వెనుక ప‌క్కాగా ఎన్నిక‌ల వ్యూహం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హుజూరాబాద్‌లో ప్ర‌ధాన పోటీ బీజేపీ , టీఆర్ఎస్ మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది.

దీంతో ఈట‌ల‌ను ఓడించాలంటే ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌నేందుకు ద‌ళిత బంధు ప‌థ‌క‌మే నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ఇక మిగిలిన సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను రాబ‌ట్టేందుకు ఎలాంటి ప‌థ‌క ర‌చ‌న చేస్తారో చూడాల్సిందే.