జగన్ ముందున్న అతి పెద్ద సవాలు

ఆంధ్ర ప్రదేశ్ సిఎమ్ జగన్ గురించి జనాలకు తెలియాల్సిన కొత్త విషయాలు ఏమీలేవు. పట్టుదల..మొండితనం..విజయకాంక్ష..మెటీరియలిస్టిక్… తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని వ్యవహారశైలి. ఇలా జగన్ కు వున్న ప్రతి గుణగణం అందరికీ తెలిసిందే. అయితే…

ఆంధ్ర ప్రదేశ్ సిఎమ్ జగన్ గురించి జనాలకు తెలియాల్సిన కొత్త విషయాలు ఏమీలేవు. పట్టుదల..మొండితనం..విజయకాంక్ష..మెటీరియలిస్టిక్… తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని వ్యవహారశైలి. ఇలా జగన్ కు వున్న ప్రతి గుణగణం అందరికీ తెలిసిందే. అయితే అన్నింటికి మించి జగన్ మంచి బిజినెస్ మన్.

ఇప్పటి వరకు వ్యాపారపరంగా జగన్ అన్నీ విజయాలే సాధించారు. ప్రత్యర్ధుల ఆరోపణలు విమర్శలు ఎలా వున్నా, రాజకీయాల్లోకి రాకుండా వుండి వుంటే, జగన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి వుండేవారు అన్నది వాస్తవం.

ఒక వ్యక్తి బిజినెస్ పరంగా సక్సెస్ సాధించారు అంటే ఆ వ్యక్తి ప్లానింగ్ ఇంకా ఎగ్జిక్యూషన్ అనే రెండు కీలక అంశాలపై గట్టి పట్టు సాధించినట్లే. ఏ వ్యాపారానికైనా ఇవే కీలక సూత్రాలు. సరైన ప్లానింగ్…సక్రమంగా అమలు చేయగలగడం.

వాస్తవానికి ఓ రాష్ట్రాన్ని పాలించాలన్నా కావాల్సిన లక్షణాలు ఈ రెండే. మరి సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్ అనిపించుకున్న జగన్, సక్సెస్ ఫుల్ రూలర్ అని అనిపించుకోగలుగుతున్నారా?  

2024 ఇక ఎంతో దూరంలో లేదు. అయిదేళ్ల పాలన కోర్సు పూర్తి చేసి 'పబ్లిక్' ముందు పరిక్ష రాయాల్సిన సమయం దగ్గరకు వచ్చేస్తోంది. జగన్ ఈ పరిక్షను డిస్టింక్షన్ లో పాస్ అవుతారా? డింకీ కొడతారా? ఇదే జగన్ ముందున్న అతి పెద్ద సవాలు.

ఓ కొత్త యువనాయకత్వం కళ్ల ముందు కనిపించింది. జనం ఉవ్వెత్తున దాని వెంట నడిచారు. ఇలా నడవడానికి రెండు కారణాలు. ఒకటి అప్పటి వరకు వున్న చంద్రబాబు పాలనా శైలిని దశాబ్దకాలం పైగా చూసి వుండడం. ఆ కొత్త యువనాయకత్వం వెనుక వైఎస్ మూలాలు వుండడం. వైఎస్ పాలన కూడా చిరకాలంగా చూసి వుంటే ఎలా వుండేదో? అతి కొద్ది కాలంలోనే వైఎస్ తిరిగి రాని లోకాలకు పయనమై వెళ్లిపోయారు. 

జగన్ పాలన దానికి కొనసాగింపుగా వుంటుందని చాలా మంది విశ్వసించారు. అలాగే ఇప్పటి వరకు యువఓటర్లను ఆకట్టుకునే యువ నాయకత్వం కళ్ల ముందుకు రాలేదు. జగన్ రూపంలో అది వచ్చింది. దాంతో అన్నీ కలిసి వచ్చాయి. జగన్ లో బలమైన నాయకుడిని చూసారు. పోరాటాన్ని చూసారు. అందుకే కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చి మరీ జగన్ ను గెలిపించారు.

అక్కడితో ఒక అంకం ముగిసింది. జగన్ ప్లానింగ్ సక్సెస్ అయింది. ఇక మిగిలింది పాలన. అదే ఎగ్జిక్యూషన్. రాష్ట్రాన్ని పాలించడం అంటే. మంచి, సముచితమైన, సరైన నిర్ణయాలు. సకాలంలో తీసుకోవడం. అభివృద్దిని సాధించడం. జనాల ఆశలు నిజం చేయడం. ఇక్కడ మొదటి విషయం సముచితమైన నిర్ణయాలు తీసుకోవడం. ఇక్కడి వరకు జగన్ బాగానే మార్కులు సంపాదిస్తున్నారు. జనాలకు నచ్చే విధంగా సంక్షేమ నిర్ణయాలు చకచకా తీసుకుంటున్నారు. ప్రతి వర్గానికి పనికి వచ్చేలా సంక్షేమ పథకాలను బాగానే డిజైన్ చేస్తున్నారు.

కిట్టని వాళ్లు ఫ్రీగా డబ్బులు పంచేస్తున్నారు అని అంటే అనుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా చేసేది అదే. చంద్రబాబు పప్పు బెల్లాల్లా సరుకుల రూపంలో పంచినా, 70 రూపాయల భోజనం అయిదు రూపాయలకే ఇచ్చేసినా, పసుపు కుంకుమ అంటూ పదేసి వేలు పందేరం చేసేసినా, వాటి వెనుక కూడా డబ్బులు ధారాదత్తం చేసేయడమే దాగి వుంది. ఎవరి స్కీమువారిది. ఎవరి స్టయిల్ వారిది.

సో జగన్ ను వాటి విషయంలో తప్ప పట్టలేం. అయితే అదే సమయంలో అభివృద్ది మీద కూడా దృష్టి పెట్టారా? లేదా అన్నది చూడాలి. స్కూళ్లు, ఆసుపత్రులు బాగు చేయించడం అన్నది కూడా అభివృద్ది కిందకే వస్తుంది. ఇంకా ప్లానింగ్ దశలోనే వున్న కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు కూడా అభివృద్ది కిందకే వస్తుంది. కానీ ఇది చాలదు. జనం దృష్టిలో అభివృద్ది అంటే ఇంకా చాలా..అంటే చాలా వుంది.

కేవలం సంక్షేమంతో జనపరిక్ష పాస్ కాలేరు. ఎందుకంటే సంక్షేమ ఫలాలు అందేది ఎంతో కొంత శాతం మందికి మాత్రమే. అభివృద్ది అంటే అలాకాదు. అందరి కళ్లకూ కనిపిస్తుంది. ఓ ఆసుపత్రి కట్టినా, ఓ ఫ్యాక్టరీ వచ్చినా, ఓ కొత్త రోడ్ నిర్మించినా ఇలా ప్రగతి అనేది సాధించిపెట్టే ఆదరణ వేరు. పాలనా రథానికి ఒక్క గుర్రం సరిపోదు. సంక్షేమం, ప్రగతి అనే రెండు గుర్రాలు కావాల్సిందే. ఈ జోడు గుర్రాల స్వారీ చేయడం మాత్రం జగన్ కు అంతగా సాధ్యం కావడం లేదు.

ఎందుకు సాధ్యం కావడం లేదు అంటే సమాధానం కోసం మరీ బుర్ర బద్దలు కొట్టుకోనక్కరలేదు. ఖజానాలో డబ్బులు ఓ గుర్రాన్ని మేపడానికే చాలడం లేదు. సంక్షేమ గుర్రానికే మొత్తం గుగ్గిళ్లు వేసి, ప్రగతి గుర్రాన్ని ఎండగట్డడం అన్నది సరైనది కాదు. ఈ ఆంచనా, లెక్కలు తెలియక జగన్ ముందుగానే సంక్షేమ గుర్రానికి భయంకరంగా మేత అలవాటు చేసేసారు. అయిదేళ్ల పాటు సంక్షేమ క్యాలండర్ ను ప్రకటించేసారు. ఇక అది అలా కొనసాగాల్సిందే.

మరి ప్రగతికి పైసలు ఎక్కడి నుంచి తెస్తారు. రాష్ట్రానికి ఆదాయం అంతంత మాత్రం. పైగా జిఎస్టీ వచ్చిన తరువాత లిక్కర్, పెట్రోలు మినహా మరే విధమైన ఆదాయం రావడం లేదు. కేంద్రం గతంలో మాదిరిగా డబ్బులు ఇచ్చేసి ఊరుకోవడం లేదు. మోడీ పాలన వచ్చిన దగ్గర నుంచి ఏ పద్దుకు ఇచ్చిన డబ్బులు ఆ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. చేసిన ఖర్చుకు లెక్కాపత్రం చూపించాల్సి వస్తోంది. 

కాంగ్రెస్ హయాంలో ఇలా వుండేది కాదు. రాష్ట్రానికి వచ్చిన డబ్బులు తమ చిత్తానికి అటు ఇటు మళ్లించేసినా పెద్దగా సమస్య వుండేది కాదు. మోడీ తో చంద్రబాబుకు వచ్చిన తకరారు ఇక్కడే. ఇప్పుడు జగన్ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతోంది ఈ విధానంతోనే.  నిజానికి మోడీ ఇలా తాళాలు వేయకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధులు మొత్తం అన్న క్యాంటీన్లలో, సంక్షేమం పంపిణీలకో సరిపోయేవి.

ఎప్పుడయితే నిధుల నిబంధనలతో సమస్య వచ్చిందో? వచ్చిన ఆదాయం అంతా జీత భత్యాలకు, ఖర్చులకు సరిపోతోందో, సంక్షేమ పథకాల కోసం అందినకాడికి అప్పలు చేయాల్సి వస్తోంది. ఆ అప్పుల కోసమే తిప్పలు పడుతుంటే ఇక ప్రగతి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?

ఆ విధంగా జగన్ తన పాలనలో తొలి తప్పటడుగు వేసారు. మరీ ఆవేశానికి పోయి తొలి ఏడాదే ఎడా పెడా సంక్షేమ పంపిణీ పథకాలు అన్నీ చకచకా ప్రకటించకుండా వుండాల్సింది. ఖజానా ఆనుపాను అన్నీ చూసుకుని, లెక్కలు వేసుకుని, రెండో ఏడాది నుంచి ముందుకు వెళ్లి వుండాల్సింది. అప్పుడు ఇప్పుడు జల్లేస్తున్న నగదు పథకాల్లో కొన్ని అయినా తగ్గి వుండేవి. డబ్బులకోసం ఇంత తపన పడాల్సిన పని వుండేది కాదు.

ఇప్పుడేమయింది. సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు కనిపించడం లేదు. కానీ ప్రగతి విషయంలో మాత్రం గోడ మీద రేపు అని రాసుకున్నట్లు అవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది అలా పక్కన పడి వుంది. కొత్త మెడికల్ కాలేజీలు అన్నది కాగితాల మీద మిగిలింది. రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది.

ఇళ్ల నిర్మాణం అన్నది మరో ప్రహసనం. మంచి ఉద్దేశంతో స్థలాలు సేకరించి జనాలకు ఇచ్చారు. బాగానేవుంది. ఇంటి ప్లాన్ వేసారు. చూపించారు. ప్రభుత్వమే సకల సదుపాయాలతో కట్టి ఇస్తుందన్నారు. ఆ తరువాత తెలిసివచ్చింది అది ఎంత కష్టమైన వ్యవహారమో. అందుకే మీరే కట్టేసుకోండి అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే మెటీరియల్ ఇతరత్ర వాటితో ఇల్లు కాదు కాదా కనీసం గోడలు కూడా లేవవు. 

కనీసం ఆపైన తలో రెండు నుంచి మూడు లక్షలు వేసుకుంటే తప్పపని జరగదు. దాంతో ఎక్కడి స్థలాలు అక్కడే అలా వున్నాయి. సున్నం వేసిన హద్దు రాళ్లు తప్ప, సున్నం వేసిన గోడలు ఇప్పట్లో కనిపించే దాఖలాలు లేవు. పైగా అధికారులు తమకు వస్తున్న వత్తిడితో ఇళ్లు కట్టుకుంటే పట్టాలు క్యాన్సిల్ చేస్తామనే బెదిరింపులు. ఆ విధంగా ఆ పథకమూ వికటిస్తోంది.

దీనికి తోడు రాజధాని విషయంలో ఆదిలో చూపించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. కోర్టు కేసుల సంగతి అలా వుంచితే సిఎమ్ క్యాంప్ ఆఫీసు కూడా విశాఖలో ప్రారంభించలేకపోయారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినందుకు అయినా కనీసం రెండు నెలలకు ఓసారి అయినా రెండు రోజులు అయినా అక్కడకు వెళ్లి వున్న దాఖలా లేదు. ఇక న్యాయ రాజధాని కర్నూలు సంగతి సరేసరి.

జగన్ గెలవడానికి కారణమైన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వున్నారు. వారు జగన్ మీద గంపెడాశలు పెట్టుకుని గెలిపించారు. ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. డిఎ లు ఫలానా ఫలానా తేదీల్లో ఇస్తానని ప్రకటించిన జగన్ ఆ విషయమే మరిచిపోయారు. డిఎ ల పరిస్థితే ఇలా వుంటే వేజ్ రివిజన్ సంగతి? ప్రభుత్వ ఉద్యోగులు మౌనంగా వున్నారు అంటే అర్థం జగన్ ను అంగీకరించారని కాదు. ఓటు అనుకూలంగా వేస్తారనే ఆశ పెట్టుకోవడం కూడా సరి కాదు.

ఒకప్పుడు పాద యాత్రతో తమకు దగ్గరగా వచ్చిన జగన్ తమకు దూరం అయిపోయినట్లు జనం భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ ను జనం లో చూసి ఎన్నాళ్లయిందో? ఆయన ఇల్లు..ఆఫీసు తప్ప మరోచోటికి వెళ్లడం లేదు. పట్టుమని 13 జిల్లాలు లేవు. నెలకు ఓ జిల్లా పర్యటనకు వెళ్లి వచ్చినా, ఇప్పటికి ప్రతి జిల్లాకు రెండేసి సార్లు వెళ్లి వచ్చినట్లు అయ్యేది. కానీ అలా చేయడం అన్నదే కనిపించడం లేదు. ఆఖరికి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కూడా కరోనా కారణంగా డుమ్మా కొట్టాల్సి వచ్చింది. దాంతో జనాలు చాలా గ్యాప్ ఫీలవుతున్నారు అన్నది వాస్తవం.

పోనీ మంత్రులు వున్నారు. ఎమ్మెల్యేలు వున్నారు. ప్రజలకు కావాల్సిన పనులు చేసిపెడతారు అని అనుకుందాం. కానీ అక్కడా అదే పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వ విదిల్చే అవకాశం లేదు. ఓ ఫర్లాంగు మేర రోడ్ కూడా వేయించలేని పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులది. ఎంత సేపూ కాన్వాయ్ వేసుకుని, సమావేశాలు నిర్వహించడం మినహా చేయగలిగిందీ లేదు. చేసేదీ లేదు. నిజానికి ఈ పరిస్థితి వారికీ మింగుడుపడడం లేదు. కానీ పెదవి విప్పితే పదవికి చేటు అన్నట్లు వుంటుంది.

ప్రభుత్వపాలన ఇలా వుంటే పార్టీ పరంగా కూడా జగన్ మంచి మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. ఏ సమస్య అయినా జగన్ కు చెప్పుకునే అవకాశం తక్కువ. నేరుగా జగన్ కు విన్నవించే అవకాశమూ తక్కువే. ఆదిలో చకచకా పదవులు పంచేసారు. జీతాలు పెట్టేసారు. అంతకు మించి సదుపాయమూ లేదు. చేసేది లేదు. చాలా మంది సైలంట్ గావుండిపోయారు. చాలా మందికి ఆ గౌరవ జీతాలు కూడా రావడం లేదు. పైగా స్వంత ఖర్చుతో తిరగడం ఒకటి.

మంత్రి వర్గాన్ని విస్తరిస్తా, రెండున్నరేళ్ల తరువాత కొత్తవారికి అవకాశం ఇస్తా అన్న జగన్ ఇప్పుడు ఆ మాటను గుర్తు చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇదో తేనెతుట్ట అని కదపడం అంత వీజీ కాదని ఇప్పుడు ఆయనకు తెలిసి వస్తోంది. ఇలా పాలనా పరంగా కూడా జగన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

అన్నింటికి మించి చిత్రమైన విషయం ఒకటి వుంది. ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా వారి దగ్గరకు ఏదైనా విషయం తీసుకెళ్లాలి అంటే ఓ ఛానెల్ అంటూ వుండేది. ఓ మంత్రి లేదా ఓ సీనియర్ నాయకుడు ఇలా ఏదో ఒక దారి వుండేది. జగన్ విషయంలో ఆయన ను నేరుగా సంప్రదించాలి తప్ప మరోదారి లేదు. కానీ అలా నేరుగా సంప్రదించడం అందరికీ సాధ్యమయ్యే పనేనా? అంటే అదీ కాదు.

రెండున్నరేళ్ల తరువాత హాఫ్ ఇయర్లీ పరిక్షలు వచ్చాయి అనుకుంటే జగన్ సాధించినవి అత్తెసరు మార్కులే. సంక్షేమ ఫథకాలు అన్నీ కలిసి జగన్ కు నూటికి నూరు మార్కులు తెచ్చేస్తాయని అనడానికి కూడా లేదు. జనాలు తమకు జగన్ డబ్బులు ఇవ్వడాన్ని తమ హక్కుగా భావిస్తున్నారు. అంతే తప్ప జగన్ పట్ల కృతజ్ఞతగా ఏమీ లేరు. ఇది గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తున్న వాస్తవం. జగన్ ఇస్తున్న డబ్బులు సెల్ ఫోన్ షాపులను, ఎలక్ట్రానిక్ దుకాణాలకు పనికి వస్తున్నాయి తప్ప, జనం ఏమీ తమ బతుకులు బాగు చేసుకోవడానికి వాడడం లేదు. ఇది పచ్చినిజం.

అందువల్ల ఇటు పార్టీలో అసంతృప్తి..అటు జనంలో అత్తెసరు మార్కులు, పాలనా పరంగా భయంకరమైన తలకాయనొప్పులు. ఏ నిర్ణయం తీసుకున్నా పడుతున్న కోర్టు కేసులు. అక్కడ వస్తున్న వ్యతిరేక నిర్ణయాలు. అన్నీ కలిసి జగన్ కు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. అయితే అదృష్టం ఒక్కటే ఇంకా రెండున్నరేళ్ల సమయం వుంది. పాలనను, పార్టీని, తన వ్యవహారశైలిని చక్కదిద్దుకోవడానికి. ఆ దిశగా జగన్ కృషి చేస్తే ఫైనల్ పరిక్ష పాస్ అవుతారు. లేదూ అంటే జనం జగన్ పరిక్ష పత్రాన్ని కాస్త భూతద్దం పెట్టి మరీతప్పులు వెదికి మార్కులు తగ్గించే ప్రమాదం వుంది.

చాణక్య