ఎన్నికలొస్తున్నాయంటే చాలు నాయకులకు పాదయాత్ర గుర్తుకొస్తుంది. పాదయాత్రలో ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ, వాళ్లలో ఒకరిలా మమేకం కావచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణలోని చేవెళ్ల నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆయన్ను అధికారానికి చేరువ చేసింది. దీంతో ఎన్నికల్లో విజయం సాధించాలంటే పాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సెంట్‌మెంట్ అయ్యింది.
వైఎస్సార్ తర్వాత చంద్రబాబు, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పాదయాత్ర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది.
ఇంకా ఈ ఎన్నికపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన రాక ముందే పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున బరిలో నిలవనున్న ఈటల రాజేందర్ మరో అడుగు ముందుకేశారు.
‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో బీజేపీ నేత ఈటల రాజేందర్ నేటి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి ముహూర్తం ఖరారు చేశారు. హుజూరాబాద్ నియోజక వర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లిలో ఉదయం 9.30 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఈటల వేసే ప్రతి అడుగు కేసీఆర్‌ను ఓడించడమే ధ్యేయమని చెప్పక తప్పదు. మొత్తం 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర సాగుతుంది. నియోజకవర్గంలోని 107 గ్రామపంచాయతీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
అసలే దుబ్బాక ఇచ్చిన షాక్‌తో టీఆర్ఎస్ పార్టీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ దఫా దుబ్బాక ఫలితం పునరావృతం కాకూడదనే తలంపుతో అన్ని రకాల వనరులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు టీఆర్ఎస్ సమాయత్తం అవుతోంది. అధికార పార్టీని ఎదుర్కోనేందుకు ఈటల చేపట్టిన పాదయాత్ర ఎంత మాత్రం గెలుపు తీరం చేరుస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.