ఎంపీ రఘురామకృష్ణంరాజు పై నమోదైన కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సంచలన అఫిడవిట్ దాఖలు చేసింది. టీవీ 5 బాస్ నుంచి రఘురామకృష్ణంరాజుకు ఏకంగా 10 లక్షల యూరోలు ట్రాన్స్ ఫర్ అయ్యాయని పేర్కొనడంతో పాటు, రఘురామకృష్ణం రాజు – తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు- ఆయన తనయుడు లోకేష్ ల మధ్యన జరిగిన వాట్సాప్ సంభాషణ గురించి కూడా ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది.
రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన సమయంలో ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకుని, సేకరించిన వివరాల ప్రకారం… అఫిడవిట్ లో సంచలన అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఒక పథకం ప్రకారం ఏపీ ప్రభుత్వంపై బురదజల్లే పనిని రఘురామకృష్ణం రాజు, చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా జాయింటుగా నిర్వహించినట్టుగా ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఈ విషయంలో వారి మధ్యన ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా వివరించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ ఇమేజ్ తో ప్రభుత్వంపై బురద జల్లుతున్నందుకు టీవీ ఫైవ్ యజమాని నాయుడు నుంచి ఏకంగా పది లక్షల యూరోలు కూడా ఆర్ఆర్ఆర్ అకౌంట్ కు జమ అయినట్టుగా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. అలాగే రఘురామకృష్ణంరాజు ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రతిసారీ ఆయనను అభినందిస్తూ.. చంద్రబాబు, టీవీ ఫైవ్, ఏబీఎన్ వర్గాల నుంచి వాట్సాప్ మెసేజ్ లు వెళ్లిన వైనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొనడం గమనార్హం.
ఒక వ్యూహం ప్రకారం.. ఇదంతా జరిగిందని, రఘురామకు ఇన్ పుట్స్ ను అందిస్తూ, ఆ తర్వాత ఆయన వీడియోలకు వచ్చిన వ్యూస్ ను సైతం ప్రస్తావించి అభినందించినట్టుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
దర్యాప్తు సమయంలో రఘురామ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్‌ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆయన సెల్ ఫోన్ నుంచి వచ్చిన మొత్తం వివరాలను కోర్టు ముందు ఉంచింది ఏపీ ప్రభుత్వం.
సింహమే సింగిల్ గా వస్తుంది, మీ దారి రహదారి, సింహం కూర్చున్నదే సింహాసనం.. వంటి సినిమా డైలాగులతో పాటు, యూట్యూబ్ లో రఘురామ వీడియోలకు పది వేల వ్యూస్ కు పైగా వచ్చినప్పుడు టీడీపీ వర్గాల నుంచి రఘురామకు అభినందనలు వెళ్లాయట.
ఈ కేసులో ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే.. పిటిషనర్లు (ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5) ఒక వర్గం ప్రజలను మరో వర్గంపైకి రెచ్చగొట్టే కుట్రలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కుట్ర పన్నాయని.. ఈ కుట్రలో రఘురామకృష్ణంరాజు భాగస్వామి అయ్యాడని ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ గుట్టునంతా రఘురామకృష్ణంరాజు ఫోన్ విప్పినట్టుగా తెలుస్తోంది.