భర్తతో కలిసి వైజాగ్ బీచ్‌కి వెళ్లి… చెప్పా పెట్టకుండా ప్రియుడితో పరారైన సాయిప్రియ కేసులో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రెండురోజుల క్రితం భర్తను మోసగించిన నేరానికి సాయిప్రియ, అలాగే ఆమె ప్రియుడు రవితేజపై వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. తాజాగా సాయిప్రియ తండ్రి అప్పలరాజుపై కూడా వైజాగ్ త్రిటౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
పెళ్లి రోజు పురస్కరించుకుని భర్తతో కలిసి సాయిప్రియ వైజాగ్ బీచ్‌కు వెళ్లింది. సెల్ఫోన్లో మాట్లాడుతున్న భర్త కన్నుగప్పి సాయిప్రియ అదృశ్యమైంది. అప్పటి వరకూ అక్కడే ఉన్న భార్య కనిపించకపోవడంతో భర్త ఆందోళనకు గురయ్యారు. చుట్టూ వెతికినా కనిపించలేదు. దీంతో సాయిప్రియ అదృశ్య విషయాన్ని కుటుంబ సభ్యులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
సముద్ర అలలబారిన పడిందని భావించారు. అయితే తాను ప్రియుడు రవితేజతో కలిసి క్షేమంగా ఉన్నానని, అతన్ని పెళ్లి చేసుకున్నానంటూ తండ్రికి వాయిస్ మెసేజ్ పంపింది. మరోవైపు సాయిప్రియ ఆచూకీ కోసం సముద్రంలో నేవీ జల్లెడ పట్టింది. ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చైంది. కూతురు క్షేమంగా ఉందనే సమాచారాన్ని తమకు తెలియజేయకపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.
ఈ నేపథ్యంలో సాయిప్రియ తండ్రి కూతురికి సంబంధించిన ప్రేమ, బెంగళూరులో ప్రియుడితో కలిసి ఉన్న వాస్తవాలను దాచి పెట్టి, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాడని పోలీసులు చట్టపరమైన చర్యలకు దిగారు. ఇందులో భాగంగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే జిల్లా అధికార యంత్రాంగాన్ని, పోలీసులను, కోస్ట్‌గార్డ్‌ను తప్పుదోవ పట్టించాడనేది సాయిప్రియ తండ్రిపై అభియోగాలు. మొత్తానికి సాయిప్రియ తప్పిదంతో కుటుంబ సభ్యులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.