కుప్పంలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌!

కుప్పంలో చిల్ల‌ర చేష్ట‌లు కొన‌సాగుతూనే వున్నాయి. ఇటీవ‌ల కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కుప్పం ఆర్టీసీ బ‌స్టాండ్ సెంట‌ర్‌కు స‌మీపంలో అన్న క్యాంటీన్‌ను ఆయ‌న ప్రారంభించారు.…

కుప్పంలో చిల్ల‌ర చేష్ట‌లు కొన‌సాగుతూనే వున్నాయి. ఇటీవ‌ల కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కుప్పం ఆర్టీసీ బ‌స్టాండ్ సెంట‌ర్‌కు స‌మీపంలో అన్న క్యాంటీన్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఆ సంద‌ర్భంలో కూడా తీవ్ర వివాదం చెల‌రేగింది. అన్న క్యాంటీన్ ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను చించేశారు. చంద్ర‌బాబు కాసేప‌ట్లో ప్రారంభించే సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హావేశానికి లోన‌య్యారు. ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్‌, అటు వైపు నుంచి ప్ర‌తిస‌వాల్ చూశాం. తాజాగా మ‌రోసారి అదే అన్న క్యాంటీన్ వివాదానికి కార‌ణ‌మైంది. గ‌త రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులెవ‌రో అన్న క్యాంటీన్‌పై దాడికి పాల్ప‌డ్డారు. అక్క‌డున్న చంద్ర‌బాబు ఫ్లెక్సీల‌ను, తాత్కాలిక షెడ్ల‌ను ధ్వంసం చేశారు. ఇవాళ లోకేశ్ చిత్తూరు, తిరుప‌తి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం వెనుక అధికార పార్టీ హ‌స్తం వుంద‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది.

మ‌రోసారి కుప్పంలో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టి నుంచే కుప్పంలో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డ్డం స్థానికుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ ద‌ఫా కుప్పంలో ఎలాగైనా పాగా వేయాల‌ని వైసీపీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కుప్పంలో ప‌ట్టు స‌డ‌ల‌కూడ‌ద‌ని టీడీపీ పంతం ప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు ప‌ర‌స్ప‌రం క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాయి.

ఎన్నిక‌లు స‌మీపించే నాటికి కుప్పంలో రాజ‌కీయం తీవ్రంగా వేడెక్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదిలా వుండ‌గా కుప్పంలో అన్న క్యాంటీన్‌పై దాడిని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని లోకేశ్ ధ్వ‌జ‌మెత్తారు. పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.