టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెచ్చతగ్గ పని చేశారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక సంఘటన జరిగితే, వెంటనే దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి టీడీపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఇదే పని చేస్తుంది. అయితే డిస్మిస్కు గురైన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికే టీడీపీ పరిమితం కాకపోవడం విశేషం.
ప్రభుత్వాన్ని నిలదీసిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను సర్వీస్ నుంచి తొలగించడం దారుణమని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ తొలగింపును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అక్రమ కేసులు ఉపసంహరించుకుని, వెంటనే సర్వీ స్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఏఆర్ కానిస్టేబుల్‌కు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశ్‌పై సానుభూతి వ్యక్తం చేయడానికే పరిమితం కాకుండా అండగా ఉంటామనే భరోసా చంద్రబాబు నుంచి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
గతంలో డాక్టర్ సుధాకర్‌ను టీడీపీ రాజకీయంగా బాగా వాడుకుంది. చివరికి ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు. టీడీపీ రాజకీయ లక్ష్యం నెరవేరింది. డాక్టర్ సుధాకర్ కుటుంబ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. ఒక్క డాక్టర్ సుధాకరే కాదు, ఈ మూడేళ్లలో టీడీపీ రాజకీయంగా వాడుకున్న వాళ్లెందరో.
తాజాగా ఏఆర్ కానిస్టేబుల్ వ్యవహారం పోలీస్ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతోంది. ఏఆర్ కానిస్టేబుల్‌కు ఆ శాఖలో గట్టి మద్దతు వుంది. ఇది రాజకీయంగా వైసీపీకి నష్టమే. అలాగని ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్‌ను విడిచి పెడితే, రేపు ఇంకొకరు ఇట్లే మాట్లాడ్తారనేది ప్రభుత్వ భావన. అందుకే అతన్ని వెంటాడి ప్రభుత్వం వేటు వేసింది.
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ వ్యవహారంలో టీడీపీ తీసుకున్న నిర్ణయంపై పోలీస్ వర్గాల్లో సానుకూలత కనిపిస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రకాశ్ కుటుంబానికి ఆదరువు లభిస్తే… అంతకంటే కావాల్సింది ఏముంటుంది?