కారణాలేవైనా జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరిస్తున్నారు. నూతన పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు, వేతనాలు ఆలస్యంగా వేయడం, బయో మెట్రిక్ తదితర అంశాలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి కారణమయ్యాయి. తాజాగా సీపీఎస్ ఉద్యోగులు సీఎం ముట్టడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో కోపాన్ని చల్లార్చడానికి అన్నట్టు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పది వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేల మందికిపైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా, హెచ్ఎంలుగా, ఎంఈవోలుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆచరణకు శ్రీకారం చుట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్టు సమాచారం.
విద్యాశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎస్జీటీలలో అర్హులైన వారికి ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించనున్నారు. దీంతో 7 వేల మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. అలాగే రాష్ట్రంలో 500 స్కూళ్లలో ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయనున్నారు. అలాగే కొన్నేళ్లుగా ఎంఈవో పోస్టులు భర్తీకి నోచుకోని సంగతి తెలిసిందే.
ఎంఈవో పోస్టుల విషయమై ప్రభుత్వ టీచర్లు, స్థానిక సంస్థల టీచర్ల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి ముగింపు పలుకుతూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈవోలు చొప్పుల ఉండేలా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. దీనివల్ల 666 ఎంఈవో పోస్టులు రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం 421 మంది ఎంఈవోలున్నారు. తాజా నిర్ణయంతో 666 ఎంఈవో పోస్టులు జెడ్పీ స్కూళ్ల టీచర్లకు కేటాయించారు. దీంతో అర్హులైన ఉపాధ్యాయులు ఎంఈవోలుగా పదోన్నతి పొందుతారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 53 డిప్యూటీ డీఈవో పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో ఈ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వాలు చొరవ చూపలేదు. సీఎం జగన్ చొరవతో సమస్యకు సానుకూల నిర్ణయం వెలువడింది. మరో 36 డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 89 డిప్యూటీ డీఈవో పోస్టులను పదోన్నతులపై భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 2,300 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కనీసం లబ్ధి పొందుతున్న ఉపాధ్యాయులైనా హర్షిస్తారా? ఇది శుభవార్తగా ఫీల్ అవుతారా? అనేది చర్చనీయాంశమైంది.