మూడు రోజుల క్రితం అలిపిరి నడక దారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితను బలిగొన్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. బాలికను బలిగొన్న ప్రాంతంలోనే అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో బందీ అయ్యింది.
తిరుమల నడక దారిలో వరుస దుర్ఘటనల నేపథ్యంలో టీటీడీ, అటవీశాఖ సంయుక్తంగా ఆపరేషన్ చిరుత చేపట్టాయి. ఇందులో భాగంగా మూడు బోన్లు, పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. క్రూర మృగాల కదలికలపై గట్టి నిఘా పెట్టారు.
సోమవారం అర్ధరాత్రి బోనులో చిరుత దొరికింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత భయంతో 15 ఏళ్ల లోపు పిల్లలు కొండకు నడిచి వెళ్లడంపై ఆంక్షలు కూడా విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం రెండు గంటలోపు మాత్రమే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో భక్తులు నడిచి వెళ్లేలా టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా అలిపిరి కాలి నడక మార్గంలో ఏడోమైలు వద్ద ఏర్పాటు చేసిన మొదటి బోనులో చిరుత చిక్కింది. ఇక్కడే బాలికపై దాడి చేసి ప్రాణాలు తీసింది. పట్టుబడిన చిరుతను ఇతర ప్రాంతాల్లోని అడవిలో విడిచి పెట్టడమా? లేక జూలో సంరక్షణ చర్యలు చేపట్టాలా? అనే విషయమై అటవీ, టీడీపీ అధికారులు చర్చిస్తున్నారు.
అడవిలో విడిచిపెడితే మళ్లీ జనసంచారంపై దాడికి దిగుతుందనే ఆందోళన అధికారుల్లో వుంది. ఈ నేపథ్యంలో చిరుతను ఎక్కడ వదిలిపెడతారనేది చర్చనీయాంశమైంది.