పచ్చ మీడియా అతి ఇంతింత కాదయా

మామూలుగానే జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద బురద చల్లడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకోవడానికి పచ్చ మీడియా సదా సంసిద్ధంగా ఉంటుంది. అలాంటిది అసలే మహా వివాదాస్పదంగా మారిన గోరంట్ల మాధవ్…

మామూలుగానే జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద బురద చల్లడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని అందిపుచ్చుకోవడానికి పచ్చ మీడియా సదా సంసిద్ధంగా ఉంటుంది. అలాంటిది అసలే మహా వివాదాస్పదంగా మారిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో, ఒక చిన్న అప్డేట్ ఉంటే దానిని వాడుకోకుండా వదిలిపెడుతుందా? ఏమాత్రం వదలదు. గోరంతలని కొండంతలుగా భూతద్దంలో చూపించి, బ్రహ్మాండం బద్దలైపోయినట్లుగా నానా హడావుడి చేయడానికి ప్రయత్నిస్తుంది.

తాజాగా అదే జరుగుతోంది. గోరంట్ల మాధవ్ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని ఒక కొత్త వార్తను పచ్చ మీడియా ప్రముఖంగా అందిస్తోంది.  అంటే గోరంట్ల మాధవ్ విషయంలో ఏకంగా రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుంటున్నారని.. చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పురమాయిస్తున్నారని ఈ వార్త కథనాలు ప్రజలకు నివేదిస్తున్నాయి. 

‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్నట్టుగా అటు అబద్ధము కాకుండా.. అలాగని నిజమూ చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టి జగన్ ప్రభుత్వం పట్ల ఏవగింపును కలిగించడానికి చేసే ప్రయత్నం తప్ప ఇది మరొక లాగా కనిపించడం లేదు. ఈ వార్తకు ఫాలో అప్ గా కొన్ని రోజుల తర్వాత మరొక వార్త వస్తుంది. రాష్ట్రపతి స్వయంగా ఆదేశించినా సరే రాష్ట్ర ప్రభుత్వపు ప్రధాన కార్యదర్శి ఎలాంటి చర్య తీసుకోలేదు పట్టించుకోలేదు అందుకు ఆయన మీద ఎలాంటి ఒత్తిడిలు పనిచేశాయో ఏమో అనేది ఆ రాబోయే కథనం సారాంశంగా ఉంటుంది. ఇలాంటి వక్ర పూరిత విష ప్రచారాలతో పచ్చ మీడియా పెట్రేగిపోతోంది.

గోరంట్ల మాధవ్ చేసిన పనికి సంబంధించి,  ఆయనను సమర్ధించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. అలాగని రాష్ట్రపతి పేరుతో కూడా వక్ర పూరిత ప్రచారాలకు తెరలేపుతున్న పచ్చ మీడియా సాహసాన్ని గురించి చెప్పడం మాత్రమే ఉద్దేశం. 

ఇంతకూ ఏం జరిగిందంటే… గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం తరువాత రాష్ట్రానికి చెందిన కొంతమంది మహిళా నాయకులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ లతోపాటు జాతీయ మహిళా కమిషన్ ను అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి గోరంట్ల మాధవ్ వ్యవహారం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన మీద చర్య తీసుకోవాలని కోరారు.
వారు కలిసి వెళ్లిన ఐదు రోజుల తర్వాత.. రాష్ట్రపతి కార్యాలయం వారు ఇచ్చిన లేఖను ఏపీ సిఎస్ కు ఫార్వర్డ్ చేసింది. వ్యవహారం అంతే. 

కానీ, రాష్ట్రపతి స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని రకరకాల పెద్ద మాటలను వాడుతూ వక్రీకరించిన సత్యాలతో కథనాలు ఇవ్వడమే శోచనీయం. రాష్ట్రపతి కార్యాలయానికి ఒక ఫిర్యాదు వస్తే టేక్ నెసెసరీ యాక్షన్ అనే మాట రాసి సంబంధిత ప్రభుత్వాలకు పంపేయడం ఆనవాయితీ. 

ఎవరు ఏ ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదు కాపీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి వచ్చేస్తుంది. టేక్ నెసెసరీ యాక్షన్ అనేది చాలా రొటీన్ సాధారణమైన సంగతి. దానికే మురిసిపోతూ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రాష్ట్రపతి ఆదేశించారు అనే అంత స్థాయిలో బిల్డప్ ఇస్తూ పచ్చ మీడియా చేస్తున్న ప్రచారం హేయంగా ఉంది. ఆయన తప్పు చేశారనేది నిజమే కావచ్చు కానీ… ఆ తప్పే తమకు అంది వచ్చిన సువర్ణావకాశంగా పచ్చ మీడియా చెలరేగిపోవడం ప్రజలు గమనిస్తున్నారు.