మొన్నటివరకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగి, వాళ్ళను వీళ్ళను కలిసి మంతనాలు జరిపి హడావుడి చేసిన తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతు ప్రభుత్వం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నప్పుడు కూడా దానికి సరైన నిర్వచనం ఇవ్వలేదు.
దేశంలో గుణాత్మక మార్పు తేవడం కోసం బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నారు. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే అది బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటముల ప్రభుత్వాల కంటే ఎలా భిన్నంగా ఉంటుందో వివరించలేదు. గుణాత్మక మార్పు అంటే సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? కారణాలు ఏమైనా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కల సాకారం కాలేదు.
ఇక కేసీఆర్ గత రెండు రోజులుగా ప్రగతి భవన్ లో దేశంలోని రైతుసంఘాల నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. కేసీఆర్ పెద్దపల్లిలో మాట్లాడుతూ ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని తనను కోరుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. '' వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని పారదోలి రైతు ప్రభుత్వం రాబోతోంది. దేశంలో రైతులు సాగుకు వాడే విద్యుత్ కేవలం 20.8 శాతమే. దీనికి అయ్యే ఖర్చు రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే. ఇది కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదు.
మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్ పెట్టాలి. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. మీటర్లు లేని విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12లక్షల కోట్లు దోచిపెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలి'' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 26 రాష్ట్రాల నుంచి నన్ను కలిసేందుకు అనేకమంది రైతు నేతలు వచ్చారు. కేసీఆర్.. రాష్ట్రమంతా మేం తిరిగాం.. చూశాం.. రైతులతో మాట్లాడాం. ఈ రాష్ట్రంలో అమలవుతున్న ఏ కార్యక్రమమూ మా వద్ద లేదు. మీరు దయచేసి జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని వారంతా నన్ను అడుగుతున్నారు. పోదామా.. జాతీయ రాజకీయాల్లోకి.. పోదామా..? అని ప్రజలను ప్రశ్నించారు.
తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం తమ వద్ద లేదని, తమ వడ్లు కొనరని, ప్రధానికి ధాన్యం కొనమంటే కొనడం చేతకాదని రైతులు తనకు చెప్పారని కేసీఆర్ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు.. నూకలకు, గోధుమ పిండికి కొరత వస్తోంది. ఈ తెలివి తక్కువ కేంద్రం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేసే పరిస్థితి వస్తోందన్నారు. ఈ పెద్దపల్లి నుంచే నేను ప్రకటిస్తున్నా.. .. రేపు దేశంలో బీజేపీని పారదోలి రైతు ప్రభుత్వం రాబోతోంది. '' అని కేసీఆర్ అన్నారు. మొత్తం మీద కేసీఆర్ కు జాతీయ రాజకీయాల యావ చావలేదు. ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని కుర్చీలో కూర్చోవాలా అని చూస్తున్నారు. రైతులతో సమావేశాల తరువాత ఆయనకు మళ్ళీ ఊపొచ్చింది.
Ithanu government vunnappudu government hospitals anni nasanam chesadu telangana ni dopidi chesadu
Agricultural trs government vasthe bagupaduthundhi