జనసేనాని పవన్‌కల్యాణ్‌పై రామోజీరావుకు చెందిన “ఈనాడు” పత్రిక సాధారణంగా ఈగ కూడా వాలనివ్వదు. పవన్‌కల్యాణ్‌పై ఆ ఎల్లో పత్రికకు ఎందుకంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామోజీరావును రాజగురువుగా ఆరాధించే చంద్రబాబు సారథ్యం వహిస్తున్న టీడీపీ పల్లకీని పవన్ మోస్తుండడంతో, అందుకు కృతజ్ఞతగా ఆయన గౌరవాన్ని కాపాడే బాధ్యతను ఈనాడు మీడియా భుజానెత్తుకుంది.
ఈ నేపథ్యంలో పవన్‌పై అభిమానాన్ని సైతం పక్కన పెట్టి, ఆయనపై మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శకు ఈనాడు పత్రిక ముచ్చటపడింది. అందుకే పవన్‌పై ప్రత్యర్థుల విమర్శలను ప్రచురించొద్దనే నిబంధనను సైతం పక్కన పెట్టి, మరీ అందరికీ తెలిసేలా ప్రచురించిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈనాడు మీడియాకు బాగా నచ్చిన అంబటి రాంబాబు విమర్శ ఏంటంటే… “నిన్ను మోసం చేసిన వాడు…ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మోసం చేయరా అమ్మా?”
మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ను ఉద్దేశించి పైన పేర్కొన్న విధంగా అంబటి అన్నారు. ఇటీవల రేణు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒక్క తన విషయంలో మాత్రం పవన్‌కల్యాణ్ మోసం చేశారని, మిగిలిన వాటిలో పవన్ మంచోడని రేణు వెనకేసుకొచ్చారు. రాజకీయాల్లో ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు.
రేణు తనకు మోసం చేశారనే మాటల్ని తీసుకుని పవన్‌పై అంబటి మండిపడ్డారు. తాళికట్టి, ప్రమాణాలు చేసి ఏడడుగులు నడిచిన భార్యనే మోసగిస్తే, ఇక సమాజం ఒక్క లెక్కా అనేది అంబటి లాజిక్. ఆ కోణంలోనే పవన్‌పై సెటైర్స్ విసిరారు. పవన్‌ను మోసగాడిగా అంబటి అభివర్ణించారు. తనకు అన్యాయం చేసినా.. హిందూ మహిళగా విశాల దృక్పథంతో తన కుమారుడి తండ్రి సీఎం కావాలని రేణు దేశాయ్ కోరుకోవడంలో తప్పులేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
పవన్‌పై రేణు మాటల్ని అడ్డుపెట్టుకుని అంబటి చేసిన ఘాటు విమర్శ ఎల్లో మీడియాకు సైతం నచ్చడం విశేషం. పవన్ స్థిరత్వం లేనివాడు కావడంతో, ఆయన గురించి రెండో కోణం కూడా ప్రజలకు తెలియడం మంచిదని ఈనాడు పత్రిక భావించినట్టుంది. అందుకే అంబటి విమర్శకు ఆ పత్రిక ప్రాధాన్యం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.