ఓటీటీలో నారప్ప.. అసలు రీజన్ చెప్పిన సురేష్ బాబు

నారప్ప సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చారనే వార్త బయటకొచ్చిన వెంటనే చాలా దుమారం చెలరేగింది. ఎగ్జిబిటర్లు చాలామంది నిరసన వ్యక్తంచేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక జరిగిన కథను బయటపెట్టారు…

నారప్ప సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చారనే వార్త బయటకొచ్చిన వెంటనే చాలా దుమారం చెలరేగింది. ఎగ్జిబిటర్లు చాలామంది నిరసన వ్యక్తంచేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక జరిగిన కథను బయటపెట్టారు నిర్మాత సురేష్ బాబు. నారప్పను ఓటీటీకి ఇచ్చేయాలనేది నిర్ణయం తనది కాదంటున్నారాయన.

“నారప్ప సినిమాను నేను, కళైపులి థాను కలిసి నిర్మించాం. రీసెంట్ గా ఆయన కర్నన్ అనే సినిమా రిలీజ్ చేశారు. సెకెండ్ వేవ్ కారణంగా మూడో వారానికే ఆ సినిమా ఎత్తేశారు. ఆ భయం ఆయనకు బాగా పట్టుకుంది. నారప్ప రిలీజ్ చేసిన తర్వాత థర్డ్ వేవ్ వస్తే ఏంటి పరిస్థితి అని చాలాసార్లు అడిగారు. ఓవైపు పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న టైమ్ లోనే నారప్పకు మంచి ఓటీటీ ఆఫర్ వచ్చిందని ఆయన నాకు చెప్పారు. ఆయన నా వ్యాపార భాగస్వామి. వెంటనే నో చెప్పలేకపోయాను. చాన్నాళ్లు వెయిట్ చేసి ఓకే చెప్పాల్సి వచ్చింది.”

నారప్పను ఓటీటీకి ఇవ్వడం వల్ల అభిమానులు ఫీల్ అవుతున్నారని, సెలబ్రేషన్స్ కూడా మిస్సయ్యామని అన్నారు సురేష్ బాబు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు ఇండస్ట్రీ కూడా మారాల్సిందేనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఇక ఏపీ ప్రభుత్వం తగ్గించిన టికెట్ రేట్లపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టికెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శించలేమన్నారు.

“ఏపీ ప్రభుత్వంతో దూరం పెరిగిందని నేను చెప్పలేను. భౌతికంగా మాత్రం పెరిగింది. ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది, ప్రభుత్వం అక్కడ ఉంది. అపాయింట్ మెంట్ తీసుకొని అంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మా ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సినిమాకు ప్రాధాన్యం ఇవ్వాలా వద్దా అనేది ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న టిక్కెట్ రేట్లతో మాత్రం సినిమాలు ప్రదర్శంచలేం.”

మరోవైపు విశాఖలో ఉన్న రామానాయుడు స్టుడియోస్ వివాదంపై కూడా స్పందించారు సురేష్ బాబు. విశాఖ స్టుడియోను జగన్ సర్కార్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉందంటూ ఓ న్యూస్ ఛానెల్ ఇచ్చిన వరుస కథనాల్ని సురేష్ బాబు ఖండించారు.

“వైజాగ్ లో ఉన్న రామానాయుడు స్టుడియోస్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు. అది మా సొంత స్థలం. కాకపోతే దాని మీద కొన్ని ఆర్థిక లావాదేవాలు జరుగుతున్నాయి. అంతేతప్ప స్టుడియో చేజారదు. స్టుడియో అక్కడే కొనసాగుతుంది. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.”

పనిలో పనిగా తన బిజినెస్ ప్లాన్స్ కూడా బయటపెట్టారు సురేష్ బాబు. త్వరలోనే గుంటూరు-విజయవాడ మధ్య ఓ మినీ స్టుడియో ఏర్పాటుచేస్తామన్నారు. విశాఖలోనే ఇంకో మినీ స్టుడియో ఏర్పాటుచేయడంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న స్టుడియోలు ఏర్పాటు చేసి.. స్థానికంగా ఉన్న టాలెంట్ ను గుర్తించి, ఓటీటీ కోసం, మ్యూజిక్ లేబుల్ కోసం కంటెంట్ ను క్రియేట్ చేస్తామని తెలిపారు.