వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెట్టిన తర్వాత మొట్టమొదట ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికలో పోటీపై ఆమె ట్విటర్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో పోటీ చేయాలంటే… ఆమె కొన్ని కండీషన్స్ పెట్టడం గమనార్హం. అవేంటో తెలుసుకుందాం.
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో అక్కడ బరిలో తలపడేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ పోటీ చేస్తుందా? లేదా? అనే అనుమానాలకు ట్విటర్ వేదికగా ఆమె తెరదించారు.
‘హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా? హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?, దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం. హుజూరాబాద్ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమే’ అని ఆమె ట్వీట్ చేశారు.
దీంతో పార్టీ పెట్టిన తర్వాత రానున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.