ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఏకంగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం వేలు పెట్టి మాన్సాస్ ని శాశ్వతంగా డ్యామేజ్ చేస్తోందని రాజు గారు అంటున్నారు.
అది నిజమే అనుకుంటే అది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం వేలూ కాలూ కూడా పెట్టిందని వైసీపీ నేతలు అంటున్నారు. మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా వచ్చిన వివాదాలు, భూ రికార్డుల మాయం అన్నీ కూడా గత సర్కార్ పుణ్యమేనని కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ఏడు వందల ఎకరాల భూమి అక్రమాలు జరిగాయన్నదీ ఆ టైమ్ లోనే అని చెబుతున్నారు. ఇక మాన్సాస్ భూములు రెండు వందల ఎకరాల దాకా కబ్జాలకు గురి అయింది కూడా అప్పట్లోనే అని చెబుతున్నారు.
మరో వైపు మాన్సాస్ ట్రస్ట్ కి ఆడిట్ ఏళ్ళకు ఏళ్ళుగా జరగలేదన్న సంగతిని అశోక్ అంగీకరిస్తూనే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. మరి ఆడిట్ చేయించుకోవాల్సింది ట్రస్ట్ వారే అని జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఒక వైపు చెబుతున్నారు. ఏది ఏమైనా మాన్సాస్ వ్యవహారం మాత్రం ఇంకా రచ్చ చేస్తూనే ఉంది.