ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు నిజంగా ఆత్మ ఉండే మాట్లాడుతున్నారా? ఎవరైనా చావు ఇంటికి వెళ్లినప్పుడు వారిని పరామర్శించడం, ఆ తర్వాత వారి గురించి కొన్ని మాటలు చెప్పడం సంప్రదాయంగా ఉంటుంది. కాని తన పార్టీ నేతలు ఇద్దరు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, బందరు, పెడన వెళ్లిన చంద్రబాబు మాత్రం అక్కడ కూడా టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి రాజకీయ ఉపన్యాసాలు చేయడం పద్దతిగా ఉన్నట్లు అనిపించదు.
అంటే ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా, అది మంచైనా, మరొకటైనా ఆయన ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారనుకోవాలి. పైగా ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తనకు మద్దతు ఇచ్చే ఒక మీడియాలో ఒక చెత్త డైలాగు వచ్చింది. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో ఎవరో అదికారులతో మాట్లాడుతూ ఆత్మలతో సంభాషించినట్లు చెప్పారట.
ఆ వ్యాసం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రే స్వయంగా ఖండించడమే కాకుండా, ఇలా చెత్త రాస్తున్నవారిని ఏమి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాని అదే గాలి వార్తను ఇప్పుడు చంద్రబాబు పట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ,ఆత్మలతో కాదు..మనుషులతో మాట్లాడేవారు కావాలని అన్నారు.
జగన్ ఇంత తీవ్రంగా ఖండించిన తర్వాత కూడా సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు విలువలతో నిమిత్తం లేకుండా అలాంటి చెత్త పలుకులను తన నోట ఉచ్చరించవచ్చా? అలా చేశారంటే ఆయన ఏ స్థాయికి దిగజారుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. మనుషులకు, అందులోను గొప్పస్థాయికి వెళ్లినవారికి నిజంగా హృదయం ఉండాలి. ఆత్మ ఉండాలి. అది ప్రజల కోసం స్పందించాలి. అంతేకాని ఏదిపడితే అది మాట్లాడి ఎదుటివారిని అవమానించడానికే కాదు. అలా చేస్తే వారికి ఆత్మ లేదని అంతా అనుకుంటారు.
అంతెందుకు.. తన సొంత మామ ఎన్.టి.రామారావు 1995లో చంద్రబాబును ఉద్దేశించి ఏమన్నారు. తన అల్లుడికి ఆత్మ అనేది లేదని, ఆత్మను అమ్ముకున్నారని, తండ్రి వంటి తనకే వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఎన్నడైనా చంద్రబాబు సమాదానం చెప్పారా? పైగా సినిమా వాళ్ల రాజకీయాలు పోయాయని ఎన్.టి.ఆర్.ను ఉద్దేశించి అన్నారా? లేదా? ఆ తర్వాత ఎన్.టి.రామారావు తనను అల్లుడితో కలిసి కుటుంబ సభ్యులే పదవిచ్యుతుడిని చేశారన్న ఆవేదనతో కన్నుమూశారు.
ఇది వాస్తవమా? కాదా? తదుపరి చంద్రబాబు వెంటనే ఎన్.టి.ఆర్.తమ పార్టీ నేత అంటూ ప్లేటు పిరాయించారా? లేదా? అంటే ఇప్పుడు ఆత్మ ఉన్నట్లా? లేనట్లా? ఆయన ఎప్పుడైనా ఆత్మ గురించి ఆలోచించారా? మనుషులకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. అది మనసుకు సంబంధించిన విషయం. భావోద్వేగానికి గురైనప్పుడు ఆత్మ స్పందిస్తుంది.కాని చంద్రబాబు అలాంటివాటి గురించి పెద్దగా బాధపడరని అనుకోవాలి. అందువల్లే గాలి వార్తలను కూడా భుజాన వేసుకుని మోస్తున్నారని భావించాలి.
చంద్రబాబు అదికారమే పరమావధిగా వ్యవహరిస్తుంటారన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి? ఆయన మారతారేమో? తన అనుభవానికి తగినట్లు మాట్లాడతారేమోలే అనుకునేవారికి ఆయన ఎప్పటికప్పుడు ఆశాభంగం కలిగిస్తున్నారు. ఇతర విషయాలు కొన్నిటిని ఆయన ప్రస్తావిస్తూ, చెత్తపై పన్నువేసే చెత్త ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఇదే ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఏది ఉచితం కాదని జనానికి చెప్పిన మాట మర్చిపోయినట్లు ఉన్నారు.
ఒకసారి ఆయన పేరుతో వచ్చిన మనసులో మాట పుస్తకం ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. అందులో ఏముంది? తాను ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నది అర్దం అవుతుంది. పోలవరం ముంపు బాదితులకు పునరావాసం ఇవ్వకుండా గిరిజనులను ముంచుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. మరి ఆయన ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఆ గిరిజనులకు పునరావాసం కల్పించలేకపోయారో చెప్పాలి కదా? తనకు మద్దతు ఇచ్చే మరో మీడియాలో దీనిపై పలుమార్లు ప్రచారం చేస్తోంది. అయితే వారికి తెలియకుండానే ఒక విషయం ఒప్పుకుంటున్నారనుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతోందని వారు అంగీకరిస్తున్నారన్నమాట. కొంతకాలం క్రితం వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగడం లేదని ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో ముంపు లో ముంచుతున్నారని అంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తున్నారు. పోలవరం కాంట్రాక్టును తన ప్రభుత్వమే చేపడుతుందని చెప్పినప్పుడు పునరావాసం ఖర్చు కూడా కేంద్రమే భరించాలన్న సంగతిని అప్పుడు చంద్రబాబు ఎందుకు కేంద్రానికి స్పష్టం చేయలేదో కూడా తెలపాలి.
ఇప్పుడు నిర్వాసితులకు కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో నాలుగు లక్షలు రాష్ట్రం ఇవ్వడానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాలు ఎలాగూ ఆయన కాని, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా కాని చెప్పవు. కాని విమర్శలు చేసేటప్పుడు అర్దవంతంగా చేస్తే వాటికి విలువ వస్తుంది. అలాకాకుండా ఆత్మ అన్నది లేకుండా మాట్లాడితే మనం ఏమి చేయగలం.
కొమ్మినేని శ్రీనివాసరావు