చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ మృతి

తెలుగు నాట చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. అందులో సీరియ‌స్ క్యారెక్ట‌ర్, సీనియ‌ర్ న‌టి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. సీరియ‌ల్ ద్వారా తెలుగు స‌మాజంలో పాపులారిటీ…

తెలుగు నాట చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. అందులో సీరియ‌స్ క్యారెక్ట‌ర్, సీనియ‌ర్ న‌టి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. సీరియ‌ల్ ద్వారా తెలుగు స‌మాజంలో పాపులారిటీ సంపాదించుకున్న లెజెండ‌రీ న‌టి సురేఖ సిఖ్రి మ‌ర‌ణ‌వార్త అభిమానుల‌ను కుంగ‌దీసింది.

'కిస్సా కుర్సి కా' చిత్రంతో ఆమె ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారు. న‌ట‌న‌లో జీవిస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. మొద‌టి చిత్రంతోనే అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ఆ త‌ర్వాత తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. దీన్ని బ‌ట్టి ఆమె న‌ట‌న‌లో ఎంత ప్ర‌తిభావంతురాలో అర్థం చేసుకోవ‌చ్చు.

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. పిల్ల‌ల‌ను కంట్రోల్ చేసే భామ‌గా ఆమె న‌ట‌న అమోఘం. తెలుగింట్లో ఒక భామ‌గా ఆ సీరియ‌ల్ ద్వారా ప్రేక్ష‌కులు ఆమెను సొంతం చేసుకున్నారంటే అతిశ‌యోక్తి కాదు.  2018లో షూటింగ్‌ సమయంలో బాత్రూంలో ఆమె జారిప‌డిన సంగ‌తి తెలిసిందే. 

అప్ప‌ట్లో సురేఖ సిఖ్రికు బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చింది. క్ర‌మంగా కోలుకుంటోంద‌ని భావిస్తున్న త‌రుణంలో షాక్‌కు గురి చేసే వార్త వినాల్సి వ‌చ్చింది. రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ఆమె ఇక కోలుకోలేకపోయారు. ఇవాళ శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లి అభిమానుల‌కు విషాదాన్ని మిగిల్చారు.