తెలంగాణలో పార్టీ పెట్టినప్పట్నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల, ఈసారి తన పంచ్ లకు మరింత పదును పెట్టారు. రీసెంట్ గా షర్మిలపై, ఆమె పెట్టిన పార్టీపై తొలిసారి స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. షర్మిల రోజుకో వ్రతం చేస్తున్నారని, అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఘాటుగా స్పందించారు షర్మిల. అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలియదన్నారు.
“కేటీఆర్ అంటే..? కేటీఆర్ ఎవరు..? ఓహో.. కేసీఆర్ కొడుకా..! కేసీఆర్ మహిళల్ని గౌరవించరు. అలాంటప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ మహిళల్ని గౌరవిస్తారని ఎలా అనుకుంటాం. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి, వ్రతాలు చేసుకోవాలని అర్థమా. టీఆర్ఎస్ అధికారిక కార్యక్రమంలో మహిళా సర్పంచ్ ఉంటే కనీసం ఆమెకు కుర్చీ వేయలేదు. నిజమే.. కేటీఆర్ అన్నట్టు నేను వ్రతం చేస్తున్నాను. వారానికి ఒక రోజు అన్నం మెతుకు ముట్టుకోకుండా వ్రతం చేస్తున్నాను. మరి పెద్ద మగోడు కేటీఆర్ ఏం చేస్తున్నారు.”
ఇలా కేటీఆర్ పై సెటైర్లు వేశారు షర్మిల. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న జగన్ సర్కారుపై కూడా తనదైన శైలిలో స్పందించారు. అన్న (వైఎస్ జగన్)పై అలకతో తెలంగాణలో పార్టీ పెట్టలేదన్న షర్మిల.. అలిగితే పుట్టింటికి వెళ్లడం మానేస్తారని, మాట్లాడ్డం మానేస్తారని, ఇలా పార్టీలు పెట్టరని అన్నారు.
“రాజన్న రాజ్యం కావాలా, రాక్షస పాలన కావాలా అనే నినాదం అక్కడ (ఆంధ్రప్రదేశ్) వినిపించింది. గతంలో అక్కడో రాక్షస రాజ్యం ఉండేది. మాకీ టెక్కులు, హైటెక్కులు వద్దంటూ ప్రజలు అక్కడో పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నుకొని రెండేళ్లే అయింది. రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్టే కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లు అది చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు.”
ఇలా జగన్ పాలనపై స్పందించారు షర్మిల. పగలు-ప్రతీకారం కోసం హుజూరాబాద్ ఎన్నికలొచ్చాయని, అలాంటి ఎన్నికలకు ఎలాంటి అర్థం ఉండదన్నారు షర్మిల. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని అలాంటి ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయదని స్పష్టంచేశారు.