సినిమా మొత్తం అయ్యిన తరువాతే చెప్పుకోవాలి. ఏ టెక్నీషియన్ అయినా తాను ఆ సినిమాకు పని చేసా అని. ఎందుకంటే ఈ కాలంలో చాలా సినిమాలకు టెక్నీషియన్లు మధ్యలోనే మారిపోతున్నారు. లేటెస్ట్ గా ఓ పెద్ద సినిమా సినిమాటోగ్రాఫర్ కూడా మారిపోయారు.
పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఒకటి వుంది. మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియమ్ కు రీమేక్ ఇది. ఈ సినిమా పాతిక, ముఫై శాతం వరకు షూట్ జరిగినట్లు బోగట్టా.
కానీ సినిమాకు వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల వ్యక్తిగత కారణాల వల్ల పక్కకు తప్పకున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాలా మరేమైనా వున్నాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్ లో వుందని, అయ్యప్పన్ కోషియమ్ మలయాళ వెర్షన్ కు వచ్చినట్లు ఓ డిఫరెంట్ టేకింగ్ రావడం లేదని హీరో పవన్ ఫీలయినట్లు తెలుస్తోంది.
నిజానికి ప్రసాద్ మూరెళ్ల మంచి సినిమాటోగ్రాఫర్ నే. కానీ భారీ కమర్షియల్ సినిమాల ఫార్మాట్ అతనిది. ఆ స్టయిల్ ఎందుకో దీనికి సూట్ కావడం లేదని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు ఇండియాలోనే టాప్ రేటింగ్ సినిమాటోగ్రఫర్లలో ఒకరైనా రవి కే చంద్రన్ ను తీసుకున్నారు. త్వరలోనే షెడ్యూలు ప్లాన్ చేసి, స్టార్ట్ చేస్తారు.