ఆంధ్రప్రదేశ్‌లో తన అన్న వైఎస్ జగన్ అన్న పాలనలో తండ్రి రాజన్న రాజ్యంపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెండేళ్ల పాలనపై ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు.
ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందని షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారని తేల్చి చెప్పారు. జగన్, తాను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. తమ పరిధులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి వైఎస్సార్ హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందన్నారు. ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా? అని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణకు వ్యతిరేకమని తానెప్పుడూ చెప్పలేదన్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని విమర్శించారు. టీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం ఉండదన్నారు. ఏపీ సీఎం జగన్‌పై అలిగి తాను పార్టీ పెట్టాననడం సరికాదన్నారు.
అలిగితే మాట్లాడటం మానేస్తారే తప్ప పార్టీలు పెట్టరని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆమె సమాధానం ఇచ్చారు. వైఎస్‌లాగే తాను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల ప్రకటించారు.