సీనియర్ జర్నలిస్ట్ ఎబిఎన్ ఆర్కే వారం వారం తన ప్రవచనాలు అందిస్తుంటారు. వాటిల్లో ఒక్కోసారి ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. ఎటొచ్చీ 'అర్థం చేసుకోరూ' అని అనుకోవాల్సిందే. ఈ వారం ఆయన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కు సంబంధించి ప్రవచించిన కొన్ని విలువైన విషయాలు.
ఎన్టీఆర్..కుటుంబసభ్యులను అధికారానికి ఆమడ దూరంలో ఉంచేవారు.
రాజకీయాలలో వచ్చిన మౌలిక మార్పుల ప్రభావంతో తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని అవలక్షణాలు ప్రవేశించాయి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. అభ్యుదయవాదంతో పాలనా సంస్కరణలను అమలుచేసి నాడు సంక్షేమానికి ఎన్టీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వగా, అభివృద్ధికి, టెక్నాలజీకి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన పేదలకు కొంత దూరమయ్యారు.
రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో వచ్చిన మార్పులను గమనించలేకపోయారు. ఫలితంగా 2019లో ఓడిపోయారు.
….జగన్మోహన్రెడ్డి రాజకీయ ఎత్తుగడలను పసిగట్టలేకపోయిన చంద్రబాబునాయుడు తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లడిల్లిపోయారు. నలభై ఏళ్ల అనుభవం నిండా యాభై ఏళ్ల వయసు కూడా లేని జగన్ ముందు ఎందుకూ కొరగాకుండా పోయింది. చంద్రబాబుకు కూడా ఒక దశలో దిక్కు తెలియలేదు.
మహానాడు గ్రాండ్ సక్సెస్ కావడానికి చంద్రబాబు కానీ, నాయకులు కానీ కారణం కాదు. ఆ క్రెడిట్ జగన్మోహన్రెడ్డికి ఇవ్వాలి. ఆయన పాలన వల్లే జనాల్లో కసి పెరిగింది.
మహానాడు గ్రాండ్ సక్సెస్ అయి ఉండవచ్చును గానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లున్నాయి.
కారణాలు ఏమైనా బలహీనవర్గాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి.
చంద్రబాబులో ఉన్న ప్రధాన బలహీనత మొహమాటం. ఈ మొహమాటం కారణంగా అనర్హులను కూడా ఆయన దూరం పెట్టలేకపోయారు. మెతక వైఖరిని, మొహమాటాన్ని ఆయన దూరం పెట్టాలి. తాను పిరికివాడిని కానని తన నిర్ణయాల ద్వారా రుజువు చేసుకోవాలి
ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న వారికి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు, తీసుకువచ్చిన సంస్కరణల గురించి తెలియదు.
అనువైన సమయం చూసుకొని లోకేష్ పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువ కావాలి.
సమాజంలో సున్నితత్వం నశించింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికీ కోటరీ వ్యవస్థ నడుస్తోందన్న వార్తలు వస్తున్నాయి
ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది నాయకులను గౌరవించడం లేదన్న విమర్శలు ఉన్నాయి
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పటివరకు కనిపించిన చంద్రబాబు స్థానంలో సరికొత్త చంద్రబాబు ఆవిష్కృతం కావాలి.
ఇవీ ఈవారం ఆర్కే ప్రవచనాలు. ఇవి నిజమా ? కాదా? కౌంటర్లు వేసుకోవచ్చా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అభిమానుల ఇష్టం.