తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్లను ఖరారు చేస్తున్నట్టుగా పార్టీ నేతల సమావేశాల్లో చెబుతున్నారు. ఫలానా నియోజకవర్గంలో ఫలానా వారికే టికెట్ అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఈ మధ్యకాలంలో. రాయలసీమ జిల్లాల్లో ఇలా చంద్రబాబు చేత టీడీపీ అభ్యర్థుల ప్రకటన పొందిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం అభ్యర్థిని, చిత్తూరు జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోకవర్గం అభ్యర్థిని ప్రకటించేశారు. అలాగే తిరుపతి అసెంబ్లీ సీటు నుంచి కూడా అభ్యర్థి ఖరారేనట!
ఇలా కొన్ని అసెంబ్లీ సీట్లకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పై సమయమే ఉంది. అయినా ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఎందుకు అభ్యర్థుల అంశం గురించి స్పందిస్తున్నారు? సాధారణంగా చంద్రబాబు ఆఖరి వరకూ ఏదీ తేల్చే వారు కాదు కదా! అని సహజంగానే ఆ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎన్నికలకు సమయం దగ్గరపడే వరకూ, ఆఖరి వరకూ ఏమీ తేల్చకుండా, చివరి నిమిషంలో ఎవరిని పడితే వారిని అభ్యర్థులుగా ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి! ఆఖరికి అంతవరకూ టీడీపీ చేత తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న వారికి కూడా చంద్రబాబు నాయుడు పచ్చకండువా వేసి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భాలున్నాయి! అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది.
మరి ఇంతకీ దీని వెనుక లెక్కేమిటంటే.. ఆర్థిక వనరులను చూపించిన వారికి, చూపించగలిగి వారికి ఇట్టే చంద్రబాబు వద్ద ఆమోదముద్ర పడుతోందనేది! వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులున్నాయని చంద్రబాబు వద్ద రుజువు చేసుకున్న వారికి అభ్యర్థిత్వంపై స్పష్టత వస్తోందని వినికిడి. ఎన్నికలను చంద్రబాబు నాయుడు ఎప్పుడూ డబ్బుల దృష్టితోనే చూస్తారనేది కొత్త విషయం కాదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రమేయం పెరిగిన తర్వాతే.. తెలుగు రాజకీయాలు ధనమయం అనేది కూడా పాత విశ్లేషణే. దేన్నైనా డబ్బుతో కొనవచ్చని, ఓటు అందుకు మినహాయింపు కాదని ఏపీ రాజకీయాల్లో ఒక థియరీని అమలు పరిచిన ఘనత చంద్రబాబుదే!
తెలుగు రాజకీయాలు ఇంత ధనమయం కావడంలో కీలక పాత్ర చంద్రబాబుదే అనే అభిప్రాయాలు విస్తృతంగా ఉన్నాయి. చంద్రబాబుకు ముందు రాజకీయ నేతలంతా నీతిమంతులు అనలేం కానీ, ఎన్నికల ఖర్చు అనే మాటే చంద్రబాబు హవా మొదలయ్యాకా హైలెట్ అవుతున్న అంశం. ఎన్నికలను ఎదుర్కొనడానికి డబ్బులుండాలనేది చంద్రబాబు ప్రవేశ పెట్టిన థియరీనే. చంద్రబాబును ఎదుర్కొనడానికి ఇతర పార్టీలకు కూడా అది తప్పలేదు! చివరకు ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 50 కోట్లు అనే పరిస్థితి తలెత్తుతోంది!
ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ సమీకరణాన్ని మిస్ అవుతున్నట్టుగా లేరు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజాదరణ, ఇప్పటి వరకూ జనాలకు చేరువవ్వడం వంటి అంశాలను పూర్తిగా పక్కన పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆర్థిక వనరులే పరమావధిగా ఉన్నట్టున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే మొదలైంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకూ టీడీపీ తరఫున ఖరారైన అభ్యర్థులంతా కోట్లకు అధిపతులే. ఎన్నికల ఖర్చుకు రెడీ అంటున్న వాళ్లే!
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కూడా డబ్బు తప్ప మరే సమీకరణం అవసరం లేదని చంద్రబాబు ఫిక్సయినట్టుగా ఉన్నారు. మరి ఇదెలాంటి ఫలితాలను ఇస్తుందో! డబ్బుతోనే ఎన్నికలు గెలిచే పరిస్థితి ఉంటే… ఇప్పటి వరకూ టీడీపీ ఏపీలో అధికారమే కోల్పోకూడదు.2019 ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు సంక్షేమ పథకాల డబ్బులు ప్రజల ఖాతాల్లోకి పడేలా చూసుకున్నారు. అయినా టీడీపీ 23 సీట్లకు పరిమితం అయ్యింది. ఎన్నికల్లో గెలుపుకు డబ్బులు ప్రామాణికం కాదని ప్రజలు అలా చాటి చెప్పినా చంద్రబాబుకు అర్థం కావడం లేదేమో!