దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి చాలా కాలమైంది. ఆమె పార్టీ పెట్టడానికి కారణాలు ఏవైనా ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరంలేదు. తాను తెలంగాణలో పార్టీ పెడుతున్నానని షర్మిల ప్రకటించిన కొత్తలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమెపై విరుచుకుపడ్డాయి. తెలంగాణను దోచుకోవడానికి మళ్ళీ ఆంధ్రావాళ్ళు వస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు విమర్శలు గుప్పించారు. షర్మిల చేత పార్టీ పెట్టించింది బీజేపీయేనని కాంగ్రెస్, కాదు కాంగ్రెస్ పెట్టించిందని బీజేపీ, టీఆర్ఎస్ నే ఆమెను రంగంలోకి దింపిందని …ఇలా పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కానీ క్రమంగా ఈ విమర్శలు మరుగున పడిపోయి షర్మిలను పట్టించుకోవడం మానేశాయి.
ఆమె పెట్టిన పార్టీని రాజకీయ పార్టీగానే గుర్తించలేదు. మీడియా కూడా లైట్ తీసుకుంది. షర్మిల మాత్రం తెలంగాణలో అడుగుపెట్టగానే దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. తాను తెలంగాణా కోడలినని, ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని సమాధానం చెప్పింది. నిరుద్యోగుల సమస్య తలకెత్తుకొని పోరాటం ప్రారంభించింది. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే దాన్ని చేయనివ్వకుండా ప్రభుత్వం భగ్నం చేసింది. ఆ తరువాత ఆమె పాదయాత్ర మొదలుపెట్టింది. కేసీఆర్ పై ప్రతిరోజూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ మధ్య బీజేపీ మీదా విరుచుకుపడుతోంది. దాదాపు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసింది. దాదాపు అన్ని ప్రాంతాలు తిరిగింది. ఏడాది నుంచి సీఎం కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ షర్మిల ముందుకు సాగింది.
ఇక ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సమయం వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనే షర్మిల పార్టీ పోటీ చేస్తుందనే ఊహాగానాలు సాగాయి. కానీ ఆమె సాహసించలేదు. షర్మిల చాలాసార్లు తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రిని తానేనన్నది. తనకు అధికారం ఇస్తే తెలంగాణ ముఖచిత్రాన్ని మారుస్తానన్నది. ఆమె మాటలు విని అందరూ నవ్వుకున్నారు. సత్తా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్నారు. ఆమె పార్టీ నాయకులు కూడా ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఎంత బలముందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ షర్మిల పోటీ చేయడానికి సాహసించలేదు. ఆమె ఒక పార్టీ అధినేత్రిగా అధికార పార్టీ మీద, ఇతర పార్టీల మీదా ఘాటు విమర్శలు చేయడం బాగానే ఉంది.
కానీ ఆమె పార్టీకి బలం లేదు. సంస్థాగత నిర్మాణం లేదు. వైఎస్సార్ అభిమానులను ఆధారం చేసుకునే షర్మిల పార్టీ పెట్టింది. కానీ వైఎస్సార్ అభిమానుల్లో ఈ తరం వారు ఎవరూ లేరు. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం జిలాల్లో వైఎస్సార్ కు ఉన్న ఆదరణ, అనుబంధం వేరు. వైఎస్సార్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం షర్మిల పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు కూడా ఆ రెండు జిల్లాలకు చెందిన వాళ్లే. వైఎస్సార్ కు ఉన్న అభిమానులు.. వైఎస్ షర్మిలపై అభిమానం చూపిస్తారా? అనేదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా.. తన తండ్రి ఆదరణను తన వైపునకు మార్చుకోవడం కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి? అని లెక్కలు తీస్తున్నారట.
ఒకవేళ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుంటే మహిళనుగానీ, బీసీని గానీ నిలబెడతారట. తెలంగాణలోని మిగతా పార్టీలేవి షర్మిలను అంతగా సీరియస్ గా తీసుకోకున్నా.. మునుగోడు ఉపఎన్నికలో చరిత్ర సృష్టించాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాని వల్ల టీఆర్ఎస్ అభ్యర్థికి లాభం చేకూరుతుందని అంటున్నారు. ఏది ఏమైనా.. వైఎస్ షర్మిలకు మునుగోడు ఉపఎన్నిక పెద్ద పరీక్షే. పోటీ చేస్తే గెలవడం అటుంచి డిపాజిట్ అయినా దక్కుతుందా?