రాయలసీమలో ఓట్ల లెక్కలో బీసీలకే నిర్ణయాత్మక పాత్ర. కురుబలు, బోయలు రాయలసీమ జిల్లాలో జనాభా పరంగా గణనీయంగా ఉంటారు. వీరితో పాటు గొల్ల, ఈడిగ కులాల జనాభా కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది. రాజకీయంగా ఈ కులాలకు ప్రాధాన్యత కూడా క్రమంగా పెరిగింది. వీరికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చారనే పేరుతో ఎన్టీఆర్ కు ఈ కులాల్లో ఆదరణ పతాక స్థాయిలో ఉంటుంది. అయితే కాలక్రమంగా కాంగ్రెస్ రాజకీయాలూ మారాయి.
మొదట్లో తెలుగుదేశం పార్టీకి రుణపడ్డట్టుగా ఓట్లు వేసిన బీసీ కులాల వాళ్లు ఆ తర్వాత కాంగ్రెస్ నూ ఆదరించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో బీసీలకు కూడా రాజకీయంగా మంచి ప్రాధాన్యతను ఇస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో మరింతగా ప్రాధాన్యతను పెంచారు. ఫలితం కనిపించింది. సీమలో రిజర్వడ్ సీట్లు పోనూ.. అనంతపురం, హిందూపురం, కర్నూలు ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించారు జగన్.
అనంతపురం బోయ, హిందూపురం కురుబ, కర్నూలు సాలె కులస్తులకు జగన్ కేటాయించారు. అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల్లో బోయ కులస్తులు దాదాపు సమాన స్థాయిలో ఉంటారు. అలాగే కురుబలు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సమాన స్థాయిలో ఉంటారు. చెరొక సీటును ఈ కులస్తులకు కేటాయించారు జగన్. దీనికి తోడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థిత్వాల విషయంలోనూ ప్రాధాన్యతను ఇచ్చారు. అప్పటికే ఉన్న జగన్ గాలికి తోడు ఈ సామాజికవర్గ సమీకరణాలు తోడు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
ఇక జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల విషయంలో కూడా గరిష్ట లబ్ధి బీసీలకే అందుతోంది. దీంతో వచ్చే సారి కూడా పూర్తి సానుకూల పరిస్థితి ఉండవచ్చు. అయితే గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పెద్దగా మొగ్గు చూపని బీసీ వర్గాల్లో ఒకటి చేనేత సామాజికవర్గం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ సామాజివకర్గ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటుంది. కర్నూలు జిల్లాలో ఈ సామాజికవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నిలిచింది కానీ, పూర్వ అనంతపురం జిల్లాలో మాత్రం అంతంతమాత్రమే.
ప్రత్యేకించి హిందూపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో చేనేతలు ఎక్కువ. హిందూపురం పరిసరాల్లో, ధర్మవరంలో వీరి జనాభా ఉంటుంది. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే వీరే నిర్ణయాత్మక శక్తి. వీరిలో మెజారిటీ తెలుగుదేశం వైపే ఉంటారు. పల్లెలు మాత్రం జగన్ కు జై కొట్టడంతో గత ఎన్నికల్లో ధర్మవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయభేరీ మోగించింది.
ఇక నాలుగో పర్యాయం జగన్ పథకం సాయం పొందారు చేనేతలు. చేతి వృత్తిపై ఆధారపడిన వారికి కులంతో సంబంధం లేకుండా ఏడాదికి 24 వేల రూపాయలను అందిస్తోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండానే ఈ పథకం లబ్ధి కలిగిస్తున్నా.. చేనేత పనిలో ఉన్నది మాత్రం మెజారీటీ నేసే వాళ్లే. ఈ పథకం లబ్ధిదారుల్లో 90 శాతం మంది ఆ సామాజికవర్గం వారే ఉంటారు.
ఇతర కులాల్లోనూ ఈ వృత్తి చేపట్టే వాళ్లు ఉంటారు. వారికీ జగన్ ప్రభుత్వ పథకం లబ్ధి అందుతోంది. తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోయినా.. టీడీపీకి రుణపడ్డట్టుగా ఓటేసే చేనేత సామాజికవర్గీయులు.. నాలుగో పర్యాయం లబ్ధి పొందారు. మరి ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఎంతో కొంత ఉండకపోదేమో!