పూర్వ అనంతపురం, ప్రస్తుత పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ ఆది నుంచి వివాదాస్పదుడే. బ్యాంకులనే మోసం చేసిన ఘనుడు కందికుంట. నకిలీ డీడీ కేసుల వ్యవహారంలో ఆయనకు ఇది వరకే శిక్ష ఖరారు అయ్యింది కూడా!
ఇలా అధికారికంగా దోషిగా తేలినా తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనను భుజానికెత్తుకునే ఉంటుంది! కదిరి ప్రాంతంలో కందికుంట వెంకటప్రసాద్ టీడీపీకి ముఖ్యనేత! ప్రస్తుత పుట్టపర్తి జిల్లాలో ఆయన కీలక నేత! అయితే ఆయనకు జైలు శిక్ష మాత్రం పడింది. అయినా బయటే ఉంటారు. శిక్షలపై పై కోర్టు అప్పీలతో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ఉన్నారు.
గత ఎన్నికల్లో కూడా కందికుంట టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. భారీ ఓట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు. 2009లో మాత్రమే నెగ్గారు. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడంతో ఓట్ల చీలికలో కందికుంట గెలుపు ఈజీ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ గెలవలేదు.
ఇలా వరసగా ఓటమి పాలవుతున్నా.. కదిరి వంటి నియోజకవర్గంలో టీడీపీకి మరో అభ్యర్థి కూడా లభించడం లేదు! అత్తార్ చాంద్ భాషాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేర్చుకున్నారు కానీ, ఆయన వల్ల ప్రయోజనం దక్కలేదు.
ఆ సంగతలా ఉంటే.. కందికుంట మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఎస్టీ వ్యక్తిని కులం పేరుతో దూషించడం, అతడి పై దాడికి పాల్పడం వ్యవహారంలో కందికుంటపై కేసు నమోదైంది. సదరు వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయినా చాలా కేసులను చూసిన కందికుంటకు ఇదేమీ పెద్ద లెక్కకాకపోవచ్చు!