పవన్‌ కల్యాణ్‌ చపలచిత్త రాజకీయాలు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన చపల చిత్తం లేదా, అవకాశవాద రాజకీయం రెండిటిని బహిర్గతం చేసుకున్నారు. ఇంతకాలం ఇలాంటి రాజకీయాలకు పెట్టింది పేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారన్నది జనాభిప్రాయం.…

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన చపల చిత్తం లేదా, అవకాశవాద రాజకీయం రెండిటిని బహిర్గతం చేసుకున్నారు. ఇంతకాలం ఇలాంటి రాజకీయాలకు పెట్టింది పేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారన్నది జనాభిప్రాయం. ఇప్పుడు ఆయనను దాటిపోయి, ఆ పేటెంట్‌ను తాను పొందాలన్న తాపత్రయంలో పవన్‌ ఉన్నారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ ఆయన లక్ష్యమని ఆయన చెప్పారు. నిజానికి గత ఎన్నికలలో జనసేనకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చి, మిగిలిన అన్ని చోట్ల  ప్రజలు  ఓడిరచారు. చివరికి పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల పోటీచేసి పరాజయ పరాభవాన్ని ఎదుర్కున్నారు. అంటే దాని అర్ధం ఏపీని జనసేన బారిన పడకుండా ప్రజలు విముక్తి చేశారని అనుకోవాలా? అయినా టీడీపీ అండతోనో, టీడీపీ మద్దతు మీడియాతోనో పవన్‌ కల్యాణ్‌ చెలరేగిపోవాలని తంటాలు పడుతున్నారు. 

ఆ క్రమంలో ఆయన అనేక కప్పగంతులు వేస్తున్నారు. కప్ప ఉభయచరం అన్న సంగతి తెలిసిందే.  పవన్‌ కల్యాణ్‌ కూడా తానూ తీసిపోలేదని నిరూపించుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలు, చెబుతున్న మాటలు పరిశీలిస్తే ఈయన అంత పవర్‌ ఫుల  అయిపోయారా? అన్న డౌటు వస్తుంది. కాని తను అంత శక్తిమంతుడు కాలేదని మళ్లీ ఆయనే చెబుతారు. 

తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ ఏమి మాట్లాడారు. తాము తెలుగుదేశంను మోయడానికి లేమని అన్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి రావాలని అన్నారు. ఓహో టీడీపీకి ఆయన దూరం అవుతున్నారేమోలే అనుకున్నవారూ ఉన్నారు. మరి అంతలోనే ఏమైందో, మరుసటి రోజు విజయవాడలో మాట మారిపోయింది. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యమని, ఆ నినాదంతో పనిచేస్తామని అంటూ మళ్లీ మూడు ఆప్షన్‌లను ప్రస్తావించారు. అందులో మొదటి ఆప్షన్‌గా టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉందని చెప్పారనిపిస్తుంది. బీజేపీ నేతల ప్రమేయం లేకుండానే ఆ పార్టీ కూడా టీడీపీ, జనసేనలతో కలిసే అవకాశం ఉందని మరో ఆప్షన్‌లో చెబుతారు. ఈ రెండు కాకపోతే బీజేపీ, జనసేనలు ఎటూ కూటమిగా ఉన్నాయన్నది ఆయన చివరి ఆప్షన్‌. దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది. 

ఎలాగైనా టీడీపీతో జతకట్టి కొన్ని సీట్లు అయినా గెలవాలన్న తహతహ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మరి ఇందుకోసం గతంలో ఆయన ఏమన్నారు. తాను ఎవరి పల్లకి మోయడానికి లేనని, ఈసారి తమ పొత్తు కోరుకునేవారు త్యాగాలకు సిద్ధపడాలని చెప్పారు. అధికారం వస్తే  సీఎం సీటు తమకే ఇస్తామని హామీ ఇవ్వాలన్న కండిషన్‌ను టీడీపీకి పరోక్షంగా పెట్టారు. కాని ఇప్పుడు ఆ షరతును తుంగలో తొక్కినట్లుగా ఉన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ తాను సీఎం పదవికి సరిపోనన్న అభిప్రాయానికి వచ్చారా? లేక అది ఎలాగూ దక్కదులే అన్న భావనలో ఉన్నారా? ఒకవేళ నిజంగానే ఆయన సీఎం పదవిపై పట్టుదల ఉంటే తన కండిషన్‌కు కట్టుబడి రాజకీయం చేయాలి కదా? ఏదో ఒక ప్రకటన చేయడం.. ఆ తర్వాత జారిపోవడం ఆయనకు మామూలు అయిపోయింది. 

వైసీపీపైన అనేక ఆరోపణలు అనండి.. అభాండాలనండి.. వేయడానికి ఏ మాత్రం జంకడం లేదు. ఆయన కోపం అంతా, ద్వేషం అంతా ముఖ్యమంత్రి జగన్‌ మీదే. జగన్‌ను సీఎం సీటులో చూసి ఓర్చుకోలేకపోతున్నారు. తనకు కూడా అధికారం చేయాలన్న కోర్కె ఉంటే అది తప్పు కాదు. కాని ఎంతసేపూ ఎవరో ఒకరిపై ఆధారపడకుండా, జనంలో నిత్యం తిరిగి, తన ఎజెండా ఏమిటో చెప్పి ప్రజల ఆదరణ పొందాలి తప్ప, ఉట్టి శాపాలుపెడితే అధికారం వస్తుందా? లేదూ టీడీపీ అధినేత చంద్రబాబునో, లేక ఆయన కుమారుడు లోకేష్‌నో ముఖ్యమంత్రి చేయాలని ఉంటే అదే తన లక్ష్యమని నేరుగా చెబితే పెయిర్‌గా ఉంటుంది. 

ఇంతవరకు వైసీపీ నేతలు చేసే ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబును గతంలో ఎన్నో రకాలుగా విమర్శించారు. వాటన్నిటిని మర్చిపోతే పోవచ్చు. దానికి కేసీఆర్‌ గతంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పి, ఆ తర్వాత ఒంటరిగా పోటీచేయలేదా అని అడుగుతునారు. మోడీ, చంద్రబాబులు కలవలేదా అని అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నా అర్థవంతంగా మాట్లాడుతున్నారా? సోనియాగాంధీ తెలివితక్కువతనంగా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోలేదు. ఇందులో కేసీఆర్‌ తప్పు లేదన్న సంగతి పవన్‌కు తెలియకపోవచ్చు. 

ఇక మోడీ, చంద్రబాబు ఎదురుపడినప్పుడు నిలబడి కొద్ది నిమిషాలు  మాట్లాడితే అదేదో పెద్ద భేటీలా పవన్‌ ఫీల్‌ అవుతున్నారు తప్ప, చంద్రబాబుకు అది అవమానం అన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు కులం గురించి ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడారో రాయాలంటే విసుగు వస్తుంది. ఏపీలో కనీసం కులభావన అన్నా ఉండాలి.. కాపులు కూడా తనకు ఓటేయరా అని ప్రశ్నించారు. ఇప్పుడే ఏపీలో కులరాజకీయం పెరిగిపోయిందని అంటారు. 

జనసేన కులాలకు అతీతం అని సుద్దులు చెబుతారు.. మరో విషయం. తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన సోదరుడైన మెగాస్టార్‌ చిరంజీవిని అవమానించడానికి కూడా పవన్‌ కల్యాణ్‌ వెనుకాడకపోవడం దురదృష్టకరం. తనను జగన్‌ చాలా గౌరవించారని చిరంజీవి చెబుతుంటే, జగన్‌ అవమానించారని పదేపదే ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారు. ఆ మాటకు వస్తే సోషల్‌ మీడియాలో చంద్రబాబు ఎదుట, కేసీఆర్‌ ఎదుట పవన్‌ కల్యాణ్‌ చేతులు కట్టుకుని నిలుచుని ఉన్న పోటోలు సర్కులేట్‌ అవుతున్నాయి. 

వ్యక్తిగతంగానే కాకుండా, విధానపరంగా కూడా పవన్‌ కల్యాణ్‌ చేసినన్ని విన్యాసాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో మరెవరూ చేసి ఉండరు. అమరావతి రాజధాని అంశంపై ఒకసారి ఇది కొందరికోసం, ముఖ్యంగా తెలుగుదేశం వారికోసం ఏర్పడిన రాజధాని అంటారు. విశాఖ వెళ్లి ఇదే రాజధాని నగరం అయితే బాగుండు అంటారు. కర్నూలు వెళ్లి తన మనసుకు ఇదే రాజధాని అని చెబుతారు. చివరిగా మళ్లీ చంద్రబాబుతో స్నేహం కుదిరాక అమరావతే రాజధాని అని చెబుతారు. 

ఇలా స్థిరత్వం లేని వ్యక్తిని చపలచిత్తుడని పిలవడంలో తప్పు ఉంటుందా? ఇలా పలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే పవన్‌ కల్యాణ్‌ అవకాశవాద రాజకీయాలు నగ్నంగా కనిపిస్తుం టాయి. 2014కి ముందు తాను చెగువేరా అభిమానిని అని చెప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో, నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్ప ఏమి తెలుసు అని అంటారు. మళ్లీ ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. చంద్రబాబు, లోకేష్‌ లంత అవినీతి పరులు ఎవరు ఉన్నారని పవన్‌ కళ్యాణే ఒక పెద్దసభ పెట్టి విమర్శిస్తారు. ఎన్నికల సమయానికి పరోక్షంగా ఆయన సాయం పొందుతారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి నమస్కారం పెట్టి వచ్చారు. 

వామపక్షాలు, బీఎస్పీతో కలిసి 2019లో కలిసి పోటీచేశారు. ఘోర పరాజయం తర్వాత వీరెవ్వరితో చెప్పాపెట్టకుండా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని మరీ ఆ పార్టీతో జట్టు కట్టినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆ పార్టీతో అంతంతమాత్రంగానే సంబంధాలు నడుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో కలవడానికి పాట్లు పడుతున్నారు. దీనినంతా ఏమని అంటారో ఆయనే చెప్పాలి. రాజకీయాలలో కొన్నిసార్లు అవకాశవాద రాజకీయాలు కూడా కలిసిరావచ్చు. చంద్రబాబు ఇంతకాలం అలాంటివాటి ద్వారా నిలబడగలిగారు. కాని ఆ అవకాశం అందరికి ఉండదని పవన్‌ కల్యాణ్‌ అనుభవం చెబుతోంది. 

ఏది ఏమైనా పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకే పరిమితం అవుతారా? లేక విధానపరమైన, సిద్దాంతరపరమైన రాజకీయాలు చేయగలుగుతారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అసలు విధానాలు, సిద్ధాంతాలు అంటే ఏమిటో తెలియాలి కదా అన్న ప్రశ్న వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవన్‌ కల్యాణ్‌ ఇలా పిల్ల రాజకీయాలనే చేసే పరిస్థితిలో ఉండడం ఆయన స్వయంకృతాపరాధమే.లేదా ఆయన హిపోక్రసీ రాజకీయం అయినా అయి ఉండాలి.

కొమ్మినేని శ్రీనివాస్