ఇన్నాళ్లకు తీరిన రామోజీ కోరిక

ఎంత బలవంతుడైనా ఒక్కోసారి అనుకున్నది వెంటనే జరిగిపోదు. కోరిన కోరిక అమాంతం తీరిపోదు. దేశంలోనే బలమైన వ్యక్తుల్లో ఒకరు అని పేరు తెచ్చుకున్న ఈనాడు రామోజీరావుకు కూడా తీరిన కోరికలు ఎన్ని వున్నాయో తెలియదు…

ఎంత బలవంతుడైనా ఒక్కోసారి అనుకున్నది వెంటనే జరిగిపోదు. కోరిన కోరిక అమాంతం తీరిపోదు. దేశంలోనే బలమైన వ్యక్తుల్లో ఒకరు అని పేరు తెచ్చుకున్న ఈనాడు రామోజీరావుకు కూడా తీరిన కోరికలు ఎన్ని వున్నాయో తెలియదు కానీ ఓ కోరిక సంగతి మాత్రం తెలుసు. అది తీరడానికి దశాబ్దాల కాలం పట్టింది.

విశాఖలో రామోజీరావు డాల్ఫిన్ అనే హాటల్ ను ఎప్పుడో నలభై అయిదేళ్ల కిందట ఏళ్ల కిందట కట్టారు. అప్పట్లో దానికి పక్కనే ఊటీ అనే మాంచి హోటల్ కూడా వుండేది. డాల్ఫిన్ వచ్చిన కొన్నేళ్ల తరువాత ఏం జరిగిందో కానీ ఊటీ హోటల్ ను టోటల్ గా రామోజీకి విక్రయించేసింది ఆ యాజమాన్యం. కానీ ఇక్కడే చిన్న తకరారు వుంది. ఊటీ హోటల్ కి, డాల్పిన్ కు మధ్య కనెక్షన్ కావాలంటే జస్ట్ పది పదిహేను అడుగుల రహదారి అడ్డం వుంది. ఆ రహదారి ఎవరిదో కాదు. జ్యోతి అనే థియేటర్ లోకి వెళ్లే ప్రయివేటు దారి అది. నిజానికి జ్యోతి హోటల్ కు రెండో వైపు కూడా రోడ్ వుంది. దారి వుంది. ఇటు పక్క దారి కనుక రామోజీకి ఇచ్చేస్తే డాల్ఫిన్..ఊటీ రెండూ కలిసిపోతాయి.

కానీ ఒకే సామాజిక వర్గం అయినా జ్యోతి యాజమాన్యం అలా అమ్మేందుకు ససేమిరా అంటూ వచ్చింది. ఆ తరువాత కొంత కాలానికి ఆ థియేటర్ ను రామోజీకి అమ్మకుండా మొత్తంగా దగ్గుబాటి రామానాయుడుకు విక్రయించేసింది. రామోజీ అంటే జ్యోతి యజమానికి పడదని అందుకే ఆయనకు అమ్మకుండా రామానాయుడుకు అమ్మారని అప్పట్లో చెప్పుకునేవారు. గమ్మత్తేమిటంటే రామానాయుడు, తరువాత సురేష్ బాబు చేతిలోకి వచ్చినా డాల్ఫిన్-ఊటీల మధ్య రోడ్ గ్యాప్ మాత్రం అలాగే వుంది తప్ప రామోజీకి రాలేదు.

ఇప్పుడు రీసెంట్ గా జ్యోతి థియేటర్ ను సురేష్ బాబు కూడా అమ్మేసారు. హార్ట్ ఆఫ్ ది సిటీ లో వున్న ఈ థియేటర్ కమర్షియల్ విలువ చాలా ఎక్కువ. థియేటర్లు సరిగ్గా ఆదాయం ఇవ్వడం లేదు. బహుశా అందుకే అమ్మేసి వుండొచ్చు. కానీ ఇప్పుడు కూడా మరి రామోజీ అడగలేదో, వీరు ఆఫర్ చేయలేదో కానీ విజయనగరానికి చెందిన కొందరు కలిసి జ్యోతి థియేటర్ ను 35 కోట్లకు కొనేసారు. 

కానీ గమ్మత్తేమిటంటే ఇప్పుడు రామోజీ కోరిక తీరింది. డాల్ఫిన్-ఊటీల మధ్య వున్న ప్రయివేటు రోడ్డు ప్లేస్ ను రామోజీకి ఈ కొత్త ఓనర్లు అమ్మేసారు. అయిదు కోట్లకు విక్రయం జరిగినట్లు తెలుస్తోంది. అంటే రోడ్డు ప్లేస్ అమ్మేయగా జ్యోతి థియేటర్ 30 కోట్లకు వాళ్లకు దఖలు పడిందన్నమాట.

ప్రస్తుతం అక్కడ అపార్ట్ మెంట్లు కట్డడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖలోని క్లాస్ థియేటర్ గా పేరు పడిన జ్యోతి థియేటర్ కథ ఇక ముగిసిపోయినట్లే.