బాలకృష్ణ నోరే కమ్మవారికి శాపం

రాజకీయంలో గానీ, సినిమారంగంలో గానీ, మరే ఇతర రంగంలో గానీ కమ్మవారు సాధించిన విజయాలు అనేకం. అన్ని కులాలవారు ఆ కులాన్ని గొప్పగా చూసేవారు. వారి క్రమశిక్షణ, వ్యాపార దృక్పథం, రిస్క్ తీసుకునే నైజం…

రాజకీయంలో గానీ, సినిమారంగంలో గానీ, మరే ఇతర రంగంలో గానీ కమ్మవారు సాధించిన విజయాలు అనేకం. అన్ని కులాలవారు ఆ కులాన్ని గొప్పగా చూసేవారు. వారి క్రమశిక్షణ, వ్యాపార దృక్పథం, రిస్క్ తీసుకునే నైజం వంటి ఎన్నో గొప్ప లక్షణాలు వారిని ఏ రంగంలోనైనా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి, నిలబెడుతున్నాయి. కానీ కొందరి కారణంగా ఇప్పుడా పరిస్థితి లేదు. కమ్మవారి కీర్తిని మసకబార్చే దుశ్శక్తులు కమ్మవారిలోనే తయారయ్యాయి. 

రాజకీయంలో కమ్మవారి పార్టీ కుదేలయ్యింది. ఎప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినవారు కమ్మపార్టీగా ప్రచారం చేయడమే. పార్టీ నాయకత్వం, కొమ్ముగాసే మీడియా చానల్స్, వత్తాసు పలికే వార్తాపత్రికలు ఇలా సమస్తం కమ్మమయం కావడంతో ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం బలపడిపోయింది. నలుగుర్నీ కలుపుకుని వెళ్లాలి అనే ప్రాధమిక రాజకీయ సూత్రం మరిచి మరీ బాహాటంగా ఈ వ్యవహారం నడుస్తుండడంతో ఆ పార్టీ అత్యధిక శాతం ప్రజల మనసుల్లోంచి దూరమయ్యింది. 

అందుకే “కమ్మే జనా సుఖినో భవంతు” అనే పార్టీకి కాకుండా “సర్వే జనా సుఖినో భవంతు” అనే పార్టీకి ఓటేసారు. 

మీరడగొచ్చు. మరి ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి రెడ్డికులాభిమానం బాహాటంగా లేదా అని. ఉంది. కానీ అది మిగతా కులాల వారికి చిరాకు తెప్పించనంతవరకు పర్వాలేదు. కేవలం స్వంత కులానికి చెందినవాళ్లకే ఎక్కువగా పదవులివ్వడం వల్ల ప్రజల్లో ఆ కులంపై వ్యతిరేకత రాదు. కానీ ఏ కులానికి చెందిన వారైనా “మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” లాంటి మాటలు పబ్లిగ్గా మాట్లాడినప్పుడే జనం ఆ కులాన్ని మానసికంగా కార్నర్ చేయడం మొదలుపెడతారు, హేయభావం పెంచుకుంటారు. 

ఏదో ఇంటర్వ్యూలో బాలకృష్ణ అన్న ఆ మాటలే ఇప్పటికీ ఆ కులం పేరు విన్నప్పుడల్లా ప్రజల చెవుల్లో రింగుమంటుంటాయి. 

ఇప్పుడు తాజాగా మళ్లీ బాలకృష్ణ “మా” ఎన్నికల పర్వంలో మంచు విష్ణుకే తన మద్దతని బాహాటంగా ప్రకటించారు. ఇంకెవరైనా అనుంటే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ తాను గతంలో అన్న మాటనుబట్టి తన కులం తాలూకు బ్లడ్-బ్రీడ్ కనుకనే విష్ణుకి మద్దతిస్తున్నాడా బాలయ్య? తమ కులానికి చెందని బ్లడ్-బ్రీడ్ కనుకనే చిరంజీవి వర్గాన్ని దుయ్యబట్టాడా బాలయ్య? అనే ప్రశ్నలు ఉదయించడం సహజం. 

నిజానికి మంచు విష్ణు చాలా తెలివిగా, బ్యాలెన్సుతో తన కేంపైన్ చేస్తున్నాడు. అందరికీ నచ్చే విధంగా బాధ్యతతో మాట్లాడుతున్నాడు. తాజాగా తాను విడుదల చేసిన వీడియోలో కూడా ఎక్కడా కులపరమైన ఆలోచనలు రేకెత్తేలా మాట్లాడలేదు. సీనియర్స్ పేర్లు చెప్పినప్పుడు కూడా సామాజిక న్యాయం పాటించాడు. కానీ ఇప్పుడు బాలయ్య చిరంజీవి వర్గాన్ని విమర్శించి మంచు విష్ణుకి మద్దతు పలకగానే కులం మకిలి అంటినట్టయ్యింది. 

అటు రాజకీయాల్లో అయినా, ఇటు సినిమా రంగంలో అయినా బాలకృష్ణ నోరే కమ్మవారికి శాపంగా మారుతోందనిపిస్తోంది. నవగ్రహాల్ని నమ్మే బాలకృష్ణ తన మాటకు కారణమవుతున్న గ్రహానికి శాంతులు చేయిస్తే మంచిది. 

బాలకృష్ణ విషయం పక్కనబెడితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పనికట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాస్తున్నవారిలో అత్యధికులు అపోజిషన్ పార్టీకి చెందిన కులంవారే కావడం ఆ పార్టీకి మరొక పెద్ద మైనస్. వాళ్లు పెట్టే ఏ పోస్టునైనా కులం కోణంలోంచే చూస్తున్నారు తక్కిన ప్రజల్లో ఎక్కువమంది. కానీసం పోస్టులో ఉన్న పాయింటు కూడా ఆలోచించకుండా “వీళ్లు మారర్రా…కుల తీవ్రవాదుల్లా తయారయ్యారు” అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వానికి నిజంగా దమ్ముంటే అర్జెంటుగా రెండు పనులు చేయగలగాలి. ఒకటి బాలకృష్ణ నోటికి తాళం వెయడం, రెండోది సోషల్ మీడియాలోని కమ్మవారు ప్రభుత్వవ్యతిరేక లేదా టీడీపీ అనుకూల కామెంట్స్ రాయకుండా ఆపడం. ఈ రెండూ వచ్చే ఎన్నికల వరకు జరగాలి. 

అప్పటికి ఒకవేళ ప్రభుత్వవ్యతిరేకత వస్తే కచ్చితంగా జనం మళ్లీ టీడీపీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా ఏ బీజీపీకో ఓట్లు గుద్దుతారు తప్ప కమ్మవారి పార్టీగా పెద్ద ముద్ర వేసేసుకున్న టీడీపీకి మాత్రం ససేమిరా వేయరు. 

కానీ నాయకత్వానికి ఇది సాధ్యమయ్యే పనేనా? చంద్రబాబు గారి పబ్లిక్ మీటింగుల్లో స్వంత కార్యకర్తలే జూనియర్ ఎన్.టి.ఆర్ జెండాలు పట్టుకుని “నెక్స్ట్ సీయం” అని నినాదాలు చేస్తే నిలువరించలేని పెద్దకిరం.. అదుపు తెలియని బాలయ్య నోటికి, ఒడుపు తెలియని సోషల్ మీడియా పోస్టులకి బ్రేకులు వేయగలదా! అసాధ్యం.

ఎ.ఆర్. అశోక్ కుమార్