ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మెచ్చే మంచి నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుంది. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్తింపునకు సంబంధించి నిబంధనలను సడలిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ఆమోదం లభిస్తోంది. అంతేకాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే, ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండేళ్ల క్రితం మోదీ సర్కార్ చారిత్రక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రతిబంధకంగా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు సంవత్సర ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెబుతూనే, మరోవైపు అదనపు కండీషన్స్ అగ్రవర్ణ పేదలకు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి.
కేంద్రం విధించిన నిబంధనల్లో కేవలం రూ.8 లక్షల్లోపు ఆదాయం తప్ప, మరే నిబంధనను పరిగణలోకి తీసుకోవద్దని జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ సమాజం హర్షిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల గురించి ఒకసారి తెలుసుకుందాం.
కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలి, కుటుంబానికి 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నా, 1000 చ.అడుగులు, అంతకు మించిన వైశాల్యం కలిగిన ఫ్లాట్ ఉన్నా, ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో 100 చ.గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలం ఉన్నా, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వార్షికాదాయాన్ని లెక్కించేటప్పుడు పిల్లలతో సహా కుటుంబ సభ్యుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రిజర్వేషన్లను సాధ్యమైనంత తక్కువ ఉపయోగించుకునేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిబంధనలు సడలిస్తే ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడుతుందనే వాదన కొంత కాలంగా వినిపిస్తోంది.
ఈ నిబంధనలతో రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి వెనుక బడిన ప్రాంతాల అగ్రవర్ణ పేదలు తీవ్రంగా నష్టపోతారు. ఉదాహరణకు రాయలసీమలో ఎకరా భూమి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు పలికే అవకాశం ఉంది. ఇదే నెల్లూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తదితర సాగునీటి సౌకర్యం ఉన్న జిల్లాల్లో ఎకరా భూమి రాయలసీమ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఐదు ఎకరాల నిబంధన వల్ల కొన్ని ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారనే ఫిర్యాదులు, విజ్ఞప్తులు జగన్ ప్రభుత్వ దృష్టికి భారీగా వెళ్లాయి.
జగన్ ప్రభుత్వం వాటిపై లోతుగా చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంది. వార్షికాదాయం తప్ప మిగిలిన నిబంధనలను తొలగిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచించి, ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక అంతరాలను పరిగణనలోకి తీసుకుని.. వార్షికాదాయం రూ.8లక్షల్లోపు అనే నిబంధన తప్ప మిగతావన్నీ మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం.. కేంద్రం నిర్దేశించిన అర్హత నిబంధనలే యథాతథంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.