అంశం ఏదైనా పాలకుడు వైఎస్ జగన్ కావడంతో… వయలెంట్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా టీడీపీ నానాయాగీ చేయడం చూస్తున్నాం. అలాంటి టీడీపీ ఒక విషయంలో మాత్రం సైలెంట్ కావడం రాజకీయ వర్గాలను కాసింత ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పక తప్పదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించడంతో మరోసారి కాపుల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మినహాయించి మిగిలిన వాళ్లంతా మాట్లాడ్డం గమనార్హం.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి కాపులు గంపగుత్తగా టీడీపీకి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను బీసీల్లో చేర్చడం విస్మరించారు. దీంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. తుని రైలు దుర్ఘటన కూడా అందులో భాగమే.
దీంతో కాపుల్లో వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం మంజూనాథ కమిటీ వేసింది. కాపులను వెనుకబడిన కులాల్లో చేర్చే విషయంలో ఈ కమిటీ 9 నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కమిటీ చైర్మన్ మంజునాథ్‌తో సంబంధం లేకుండా అందులోని సభ్యులు నేరుగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో వివాదం ఏర్పడింది. ఆ తర్వాత మంజునాథ్ తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాపుల రిజర్వేషన్లు మాత్రం అటకెక్కాయి.
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోదీ సర్కార్ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. ఇందులో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు వర్తింపజేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక సామాజిక వర్గానికే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మిగిలిన సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా కాపులను బీసీల్లో ఎఫ్ కేటగిరీ కింద చంద్రబాబు ప్రభుత్వం చేర్చి బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తర్వాత రెండింటిలో దేన్ని పరిగణలోకి తీసుకోవాలో చెప్పాలని కేంద్రప్రభుత్వం నాటి చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసింది. చంద్రబాబు దాన్ని పక్కన పడేశారు.
అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని వైసీపీ నేత జగన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా కాపులు ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతంలోనే కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని తేల్చి చెప్పడం అప్పట్లో పెనుదుమారం రేపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు తొలగించారు. అందరికీ సమానంగా వర్తింపజేయాలని జగన్ నిర్ణయించారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని గొంతులు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
కానీ తన ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యమించే దమ్ము, ధైర్యం టీడీపీలో కరువైంది. గత ఎన్నికల్లో అగ్రవర్ణాల పేదలకు చెందిన రిజర్వేషన్లను లాక్కెళ్లి కాపులకు సగభాగం ఇవ్వడం వల్ల జరిగిన నష్టం టీడీపీని భయపెడుతోంది.
కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమిస్తే మరోసారి మిగిలిన అన్ని కులాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజకీయంగా నష్టపోతామనే భయం టీడీపీని వెంటాడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కాపులకు 5 శాతం రిజర్వేషన్‌పై టీడీపీ ఆచితూచి అడుగులేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.