కృష్ణా జలాల వివాదంలో ప్రస్తుతానికి జగనే గెలిచారు. తెలంగాణ నీటి వృథాను అడ్డుకోండి, లేదా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోండి అంటూ.. జగన్ చేసిన డిమాండ్ నిజం కాబోతోంది.
తెలంగాణ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిథిలోకి తీసుకొచ్చేలా కేంద్ర జలశక్తి శాఖ గెటిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు విద్యుదుత్పత్తి ఆపేయాలంటూ కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో జగన్ తాను అనుకున్నది సాధించినట్టయింది. మరీ ముఖ్యంగా నాగార్జునసాగర్ పై తెలంగాణ పెత్తనానికి చెక్ పెట్టినట్టయింది.
అయితే ఈ గెలుపు తాత్కాలికమే అంటున్నారు విశ్లేషకులు. రెండు పిల్లులు, రొట్టెముక్క కథను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. రొట్టె ముక్క కోసం 2 పిల్లులు కొట్టుకుంటుంటే, మధ్యలో న్యాయం చెప్పడానికి వచ్చిన కోతి ఆ రొట్టెను పంచినట్టే పంచి మొత్తం తినేస్తుంది. ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టుల వ్యవహారం కూడా భవిష్యత్తులో అలానే తయారవుతుందని అంటున్నారు నిపుణులు. నేరుగా తీసుకెళ్లి జుట్టును కేంద్రం చేతిలో పెట్టారని అభిప్రాయపడుతున్నారు.
రాబోయే రోజుల్లో కేంద్రంతో సఖ్యతగా ఉండే రాష్ట్రానికి బోర్డు నిర్ణయాలు అనుకూలంగా, సఖ్యతగా లేని రాష్ట్రానికి బోర్డు నిర్ణయాలు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నీటి సరఫరా మాత్రమే కాదు.. విద్యుత్ ఉత్పత్తిపై కూడా పరోక్షంగా కేంద్రానికే పెత్తనాన్ని దఖలు పరుస్తోంది గెజిట్ నోటిఫికేషన్.
ప్రస్తుతం తనకు ఇష్టమొచ్చినట్టు తెలంగాణ, విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుంటోంది. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని మానిటర్ చేసుకుంటోంది. భవిష్యత్తులో ఇక తెలంగాణకే కాదు, ఏపీకి కూడా ఆ అవకాశం ఉండదు.
విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కూడా బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. అంటే పరోక్షంగా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో కేంద్రం నిర్ణయంలో జాప్యం తలెత్తితే రాష్ట్రాలే ఇబ్బంది పడతాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. దీనికితోడు కొత్త ప్రాజెక్టుల వ్యవహారం కూడా భవిష్యత్తులో మరింత ఇబ్బందికరంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పెత్తనం కేంద్రానికి ఖర్చు రాష్ట్రాలది..
రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లపై పెత్తనాన్ని బోర్డులకు దాఖలు చేస్తూ, పరోక్షంగా పెత్తనం తన చేతుల్లోకి తీసుకుంటున్న కేంద్రం, ఖర్చుని మాత్రం రాష్ట్రాలపైనే నెట్టేసింది. నిర్వహణ ఖర్చులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలు చెరో 200కోట్ల రూపాయలు సీడ్ మనీ కింద బోర్డ్ లకు డిపాజిట్ చేయాలట. ఆ తర్వాత అడిగిందే తడవుగా నిర్వహణ ఖర్చుల్ని 15రోజుల్లోగా జమ చేయాలట.
ఉమ్మడి ప్రాజెక్ట్ లు, ఉమ్మడి కాల్వల వద్ద ఉన్న కేంద్ర బలగాల ఖర్చు కూడా రాష్ట్రాలదే. మొత్తమ్మీద కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీకి తాత్కాలిక ఊరటనిస్తున్నా.. భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.