ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. నాలుగైదు రోజులుగా భారత రాజకీయాల్లో మారుమోగిపోతున్న పేరు. అంతమాత్రాన ఆయన పేరున్న రాజకీయ నాయకుడు కాదు, కేవలం వ్యూహకర్త. ప్రచారం ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే ప్రజలకు దగ్గరవుతారు, మీడియాని, సోషల్ మీడియాని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలి అనేదానిపై సూచనలు చేస్తారు, దానికి తగ్గట్టు పారితోషికం కూడా తీసుకుంటారు.
తాజాగా ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపారని, 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తారని, బీజేపీ పరాజయం కోసం కృషిచేస్తున్నారని, వైరిపక్షాలన్నిటినీ ఏకం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ తో పీకే కలసిపోవడంతో, రాహుల్ గాంధీ దశ తిరిగిందని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఏది నిజం.. ఎంత నిజం..?
పీకే అసామాన్య వ్యక్తే, కాదనలేం. కానీ మరీ దైవాంశ సంభూతుడేం కాదు. పీకే ఎవరి పక్షాన నిలబడితే వారు గెలవడం అనేది వట్టిమాట. గెలిచే వారి పక్షమే పీకే నిలుస్తున్నారనేది అసలు మాట. అవును.. ఏపీలో పీకే సపోర్ట్ లేకపోయినా జగన్ సీఎం అయి ఉండేవారు. తమిళనాడులో స్టాలిన్ హవా నడుస్తున్న టైమ్ లో పీకే ఆయనతో చేతులు కలిపారు, కాస్త బూస్టప్ ఇచ్చారు.
ఇక పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి కలిసొచ్చిన అన్ని అంశాల్లో పీకే పబ్లిసిటీ కూడా ఒకటి కానీ, ఆయనే సర్వం కాదు. నిజంగానే ఆయనలో అంత దమ్ముంటే.. రాజకీయ నాయకుడిగానే సక్సెస్ అయి ఉండేవారు. జేడీయూ నుంచి ఆయన బయటకు వచ్చేవారే కాదు.
మోదీతో స్నేహం చెడిన తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ తో చేతులు కలిపిన పీకే.. ఓ దశలో మోదీకి ప్రత్యర్థిగా ప్రధాని అభ్యర్థిగా నితీష్ పేరు జోరుగా ప్రచారంలోకి వచ్చేలా చేశారు. కానీ అది ఎంతమాత్రం వర్కవుట్ కాలేదు. ఆ ప్రచారం నితీష్ కి మేలు చేయకపోగా, కీడు చేసింది. ప్రస్తుతం బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యేల చేతిలో నితీష్ కీలుబొమ్మ. నితీష్ తో వ్యవహారం తేడా కొట్టడంతో జేడీయూ నుంచి బయటకొచ్చేశారు ప్రశాంత్ కిషోర్.
రాహుల్ ప్రధాని అయితే పీకేలో సత్తా ఉన్నట్టే..
ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది, అందులోనూ రాహుల్ నాయకత్వంపై ఎవరీకి ఎక్కడా నమ్మకాలు లేవు. ఈ దశలో కేంద్రంలో అధికారానికి కావాల్సిన సీట్లలో సగం కాంగ్రెస్ గెలుచుకోవడం, మిగతా సగం ప్రతిపక్షాల నుంచి అరువు తెచ్చుకోవడం అనే ఫార్ములాతో పీకే ప్రతిపాదన తీసుకొచ్చారని, ఇది కాంగ్రెస్ కి, దాని మిత్రపక్షాలకు బాగా నచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ దశలో నిజంగానే పీకే గాలి సోకి రాహుల్ ప్రధాని అయితే కచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కింగ్ మేకర్ అనొచ్చు.
గతంలో మోదీ ప్రధాని పదవి చేపట్టడంలో పీకేదే ప్రధాన పాత్ర అని రూఢీ చేసుకోవచ్చు. పీకే చేరినా రాహుల్ దశ తిరగకపోతే మాత్రం ఆయన అంత పెద్ద తోపు కాదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ గెలిచేవారి పక్కన వచ్చి నిలబడ్డ పీకే, ఈసారి గెలవాల్సిన వారి పక్కనకు వెళ్తున్నారు. చూద్దాం.. ఈసారి ఏం జరుగుతుందో..