ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా, ఎన్ని పథకాల్లో మార్పులు తీసుకొచ్చినా రేషన్ కార్డుల జోలికి మాత్రం వెళ్లకూడదనే విషయం గతంలో పలుమార్లు రుజువైంది. రేషన్ కార్డుల ఏరివేత మొదలు పెట్టారంటే, ఓటర్లను, ఓట్లను కూడా కోల్పోయినట్టే లెక్క. రేషన్ కార్డు తీసేశారంటే అదో పెద్ద అవమానంగా భావించి, అలా తీసేసిన ప్రభుత్వంపై పగ పెంచుకుంటారు సామాన్యులు. రేషన్ కార్డు, ఓటరు కార్డు మధ్య ఉన్న లింకు అలాంటిది.
కానీ ఇప్పుడు కేసీఆర్ మరోసారి రేషన్ కార్డులతో చెలగాటం ఆడేందుకు రెడీ అవుతున్నారు. తొలిసారి గెలిచినప్పుడు కూడా కేసీఆర్ రేషన్ కార్డుల జోలికి వెళ్లి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ, మరోసారి అలాంటి సాహసమే చేస్తున్నారు.
ఈనెల 26 నుంచి 31వరకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడితో ఆగితే బాగుండేది కానీ, అనర్హుల్ని ఏరివేయాలనే మరో ఆదేశం కూడా ఇచ్చింది. అనర్హులంటే ఎవరు, రేషన్ కార్డు అవసరం లేకపోయినా దాన్ని కలిగి ఉండేది ఎవరు? అసలు రేషన్ కార్డు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి..?
ఇవన్నీ లెక్కలోకి తీసుకుని కేసీఆర్ ఈ పని మొదలు పెట్టబోతున్నారు. అర్హులకు కార్డులు ఇస్తే ఎవరూ కాదనరు కానీ, అనర్హులంటూ కార్డులు తొలగిస్తే మాత్రం ఎవరూ ఒప్పుకోరు. మరి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ..
తెలంగాణలో ఇంకో రెండున్నరేళ్లకు గాని ఎన్నికలు రావు. ఈ దశలో కేసీఆర్ ధైర్యంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. రేషన్ కార్డుల ఏరివేత కూడా ఇందులో భాగమే. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కళ్లముందు కనబడుతోంది. సో.. ఈ ఉప ఎన్నిక వేళ తనను ఇబ్బంది పెట్టే ఎలాంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోకూడదు.
ఉద్యోగాల ప్రకటన, రేషన్ కార్డుల జారీ వంటివి ఉప ఎన్నికల స్కీమ్ లు గా భావిస్తున్నా.. కార్డుల ఏరివేత మొదలైతే మాత్రం కష్టం. కోరి తలనెప్పి తెచ్చుకున్నట్టే, తేనె తుట్టెను కదిపినట్టే. రేషన్ కార్డుల పంపిణీ అనేది కేవలం సంక్షేమ పథకాల పరిధిలోకే రాదు, ఓట్లను ప్రభావితం చేసే కీలకమైన అంశం.
ఏపీలో చంద్రబాబు ఓడిపోవడానికి ఓ బలమైన కారణం ఇదే. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ కార్డుల వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా, అత్యంత పారదర్శకంగా వ్యవహరించి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారాయన. రేషన్ కార్డుల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
ఏదేమైనా రేషన్ కార్డుల పంపిణీ, అనర్హుల ఏరివేత అనేది కత్తిమీద సాములాంటిది. పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది. ఈ విషయం తెలిసి మరీ కేసీఆర్ మరోసారి రేషన్ కార్డుల అంశాన్ని తెరపైకి తేవడం విశేషమే.