నిత్య పెళ్లి కూతురు, నెల్లూరు జిల్లా మహిళ సుహాసిని మోసానికి బలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. సుహాసిని అరెస్ట్‌తో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కొందరు బాధితులు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బాధితులు డబ్బు పోతే పోయిందని, అనవసరంగా పోలీస్స్టేషన్లకు వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకనే ఆలోచనతో మౌనం పాటిస్తున్నారని సమాచారం.
ప్రేమ పేరుతోనూ, తాను అనాథనని పలువురు యువకులను బోల్తా కొట్టించిన నెల్లూరు జిల్లాకు చెందిన సుహాసిని మోసాలు అన్నీఇన్నీ కావు. ఇటీవల ఆమెను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసి, మోసాలు రాబడుతున్నారు. ఈ విషయం తెలిసి నెల్లూరుకు చెందిన సుహాసిని బాధితుడు వీరయ్య అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ సందర్భంగా తాను ఏ విధంగా మోసపోయాడో చెబుతూ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. చిన్నప్పటి నుంచి సుహాసిని తనకు తెలుసన్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోనేటిరాజు పాళ్యానికి చెందిన మేనమామ వెంకటేశ్వర రాజుతో ఆమెకు మొదటి వివాహం అయ్యిందన్నాడు. భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, ఆయన ఫొటోలు చూపి వైద్యం కోసం తనను అప్పు అడిగిందన్నాడు. పది రోజుల్లో తీర్చేస్తానని రూ.2.17 లక్షల అప్పు తీసుకున్నట్టు వీరయ్య తెలిపాడు. అయితే చెప్పిన సమయానికి అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.
పోలీసుల సమక్షంలో ఇస్తానని నమ్మించి మూడేళ్లు ఎక్కడికో వెళ్లిపోయిందని వాపోయాడు. తెలంగాణలోని భద్రాది కొత్తగూడెంకు చెందిన వినయ్, అలాగే తిరుపతి యువకుడిని సుహాసిని మోసం చేసిందన్నాడు. ఇలా సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20 – 30 మంది వరకు ఉన్నట్టు వీరయ్య చెప్పుకొచ్చాడు. అయితే వాళ్లంతా పరువు పోతుందనే ఆలోచనతో బయటకు రావడం లేదని ఆయన అన్నాడు.
సుహాసిని చెప్పిన మాటలకు మోసపోయిన చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ఆమెకు 10 తులాల బంగారం కూడా పెట్టారు. కొన్ని రోజుల తర్వాత తనను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ. 6 లక్షలు తీసుకుంది.
ఆ తర్వాత డబ్బు విషయమై సుహాసిని, సునీల్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతకు ముందు వినయ్ అనే యువకుడిని కూడా ఇదే రకంగా వంచించింది. ఇలా ఆమె మోసాలు బయటపడుతుండడం తిరుపతిలో చర్చనీయాంశమైంది.