చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొత్తలో జన్మభూమి, ఇంకుడు గుంతలు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించాడు. అదంతా కొత్త విజన్ అని, సామూహిక శ్రమతో సమాజం మారిపోతుందని ఈనాడు, జ్యోతి ప్రత్యేకంగా రాసాయి. ఒక మంచి పని చిన్నదైనా, పెద్దదైనా ప్రశంసించడం తప్పు కాదు. విమర్శ పత్రికల హక్కు అయినప్పుడు, ప్రశంస కూడా బాధ్యత. తర్వాత జన్మభూమి , ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనం ఏ మేరకు ఒరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు చేస్తే ఒక విప్లవం, ప్రయోగంగా కనిపించే ఈనాడు, జ్యోతిలకి ఇతరులు నిజంగా మంచి పని చేసినా కనబడవు.
ఈ ప్రధాన పత్రికలు ఏకపక్షంగా వుండడంతో సాక్షి వచ్చింది. వీళ్లు ఎలాగూ చెప్పరు కాబట్టి వైఎస్ గురించి సాక్షి చెప్పాల్సి వచ్చింది. తర్వాత అది వీళ్ల బాటలోనే జగన్ ప్రశంస, బాబు విమర్శగా మారింది. అయితే అది జగన్ సొంత పేపర్ కాబట్టి దానికి వేరే దారి లేదు.
కానీ ఈనాడు, జ్యోతి తాము చంద్రబాబు బాకాలు అని ఒప్పుకోవు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాయి. ప్రతిరోజు జగన్ తప్పులు లోపాల్ని ఉన్నా లేకున్నా పేజీలకొద్ది వేస్తాయి. దీనికి కౌంటర్‌గా ఏది నిజం? అని సాక్షి ఎడిట్ పేజీ అంతా పరుస్తుంది. కాసేపు ఇవన్నీ పక్కన పెడితే జగన్ ప్లాస్టిక్ ప్లెక్సీలని నిషేధించారు. ఇది చాలా మంచి విషయం. సొసైటీకి పనికొచ్చేది. సమర్థంగా అమలు చేస్తే ప్లాస్టిక్ పీడ వదుల్చుకోవచ్చు. దీనికంటే పెద్ద వార్త ఏమంటే వైజాగ్ తీరం వెంబడి 75 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను 22,517 మంది ఏరివేశారు. ఈ రెండు చంద్రబాబు హయాంలో జరిగితే బ్యానర్ వార్తగా ఫస్ట్ పేజీలో, ప్రత్యేక కథనాలతో లోపలి పేజీలు వచ్చేవి. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ఫస్ట్ పేజీ ఇండికేషన్‌తో లోపలి పేజీల్లో బాటం వార్తగా వచ్చింది.
ఈనాడులో కొంచెం మెరుగు. ఫస్ట్ పేజీలో డబుల్ కాలమ్, రెండో పేజీలో కంటిన్యూ వార్త వుంది. సాక్షిలో ఇదే బ్యానర్. 22 వేల మంది బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసిన వార్త విజయవాడ ఎడిషన్‌లో కనబడలేదు. బహుశా వైజాగ్ ఎడిషన్‌లో వేసి వుంటారు.
ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత ఒక ఉద్యమంగా మారితే అది జనానికి ఉపయోగం. అది చాలా మంచి పనిగా ఈనాడు, జ్యోతి ఎలాగూ గుర్తించవు. జగన్ తప్పులు చేస్తేనే వాటికి ప్రయోజనం. మంచి పనులు చేస్తే ప్రజలకి ప్రయోజనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పత్రికలకి ప్రజల కంటే పార్టీలే ముఖ్యం.
కనీసం సాక్షి అయినా ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాన్ని సరిగ్గా జనంలోకి తీసుకెళితే జగన్‌కి ఉపయోగం, జనానికి ఉపయోగం. జగన్ ఒక పిలుపు ఇచ్చి రంగంలోకి దిగమంటే వైసీపీ కార్యకర్తలు వీధి రాజకీయాలు మానేసి, వీధుల్ని శుభ్రం చేసి పడేస్తారు. రాజకీయాల్ని ఎలాగూ శుభ్రం చేయలేం. కనీసం వాతావరణాన్నైనా శుభ్రం చేద్దాం. ఇది మన చేతిలోని పనే.