వినాయక చవితి ఉత్సవాల్లో బీజేపీతో పోటీ పడాలట

తెలంగాణలో ప్రధానంగా హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలుసు. వీధికి పది గణేష్ మండపాలు వెలుస్తాయి. రాత్రంతా మండపాలు కోలాహలంగానే ఉంటాయి. ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. …

తెలంగాణలో ప్రధానంగా హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలుసు. వీధికి పది గణేష్ మండపాలు వెలుస్తాయి. రాత్రంతా మండపాలు కోలాహలంగానే ఉంటాయి. ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. 

వినాయక చవితి ఉత్సవాలు అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది బీజేపీ దాని అనుబంధ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ మొదలైనవి. ప్రతీ ఏడాది వినాయక చవితి ఉత్సవాల్లో వీరి హడావుడి, ఆర్భాటమే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే హిందుత్వను తాము గుత్తకు తీసుకున్నామని చెప్పుకుంటారు కదా. 

అయితే ఈసారి గణేష్ చవితి ఉత్సవాల్లో బీజేపీ, దాని దాని అనుబంధ భక్తి సంస్థల హవాకు అడ్డుకట్ట వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుందట. గణేష్ మండపాలు ఏర్పాటు చేయడంలో, ఉత్సవాల నిర్వహణలో, ఇందుకు డబ్బు సమకూర్చడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు (మౌఖికంగా) ఇచ్చిందట. అలాగే ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిరోజూ గణేష్ మండపాలను పర్యవేక్షించి రావాలట. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలట.

ప్రతి రోజూ సామూహిక పూజలు నిర్వహించాలట. మొత్తం పదకొండు రోజులు అంటే నిమజ్జనం వరకూ వినాయక మండపాల వద్ద గులాబీ పార్టీ నేతల హడావుడి, ఆర్బాటం ఎక్కువగా ఉండాలని పార్టీ పెద్ద నాయకులు ఆదేశించారట. ఇందుకోసం యూత్ అసోసియేషన్లను, కాలనీ సంఘాలను సమర్ధంగా ఉపయోగించుకోవాలని చెప్పారట. ఇక ప్రధానమైన విషయం …మండపాల వద్ద ప్రతి రోజూ అన్నదానం చేయాలట.  

లౌకిక పార్టీ అయిన టీఆర్ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ వాతావరణమే. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య వార్ జరుగుతోంది కదా. మరి ఇదంతా గొడవలకు దారి తీసే పరిస్థితి వస్తుందా?