ఆగస్టు 25వ తేదీ, 2017 సంవత్సరం. విజయ్ దేవరకొండ అనే ఒక యువ నటుడి జాతకం మారిపోయిన తేదీ అది. అర్జున్ రెడ్డి అనే సినిమా విడుదల అయ్యింది.. విడులకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా! పెద్ద పబ్లిసిటీ లేదు, పాన్ ఇండియా అంటూ హడావుడి లేదు, ఆ దర్శకుడెవరో తెలియదు. పెద్ద నిర్మాణ సంస్థ ఏదీ ఆ సినిమాను పుషప్ చేయలేదు! ఏమీ లేదు… అదంతకు అది విడుదల అయ్యింది! సాయంత్రానికి మెల్లగా సంచలనం మొదలైంది.
సర్వత్రా పాజిటివ్ రివ్యూలు! ఏ మాత్రం అంచనాలు, ఆశల్లేకుండా థియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలు! ఒక తెలుగు సినిమానేనా ఇది, తెలుగులో ఇలాంటి సినిమాలు కూడా రాలగవా! ప్రతీ సీన్ కూడా ఒక్కో సర్ ప్రైజ్ లా సాగిపోతూ, ఎమోషనల్ టచ్ తో.. అంత వరకూ తెలుగు తెరపై చూడని విన్యాసం అర్జున్ రెడ్డి పాత్ర చిత్రణ! దేవదాసుతో పోలికో, మరోటో ప్రేక్షకుడికి పట్టలేదు. వారెవ్వా..! అనే ఫీలింగ్! మూడు గంటల పై సాగే ఆ సినిమా థియేటర్లో పూర్తి విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది!
బయటకు వచ్చాకా.. ఒక్కటే చర్చలు. సోషల్ మీడియాలో అయితే ఆ సినిమాపై తన్నుకు సచ్చారు! అర్జున్ రెడ్డి పాత్ర అలా ఎందుకు బిహేవ్ చేసింది, ఇలా ఎందుకు బిహేవ్ చేసింది అంటూ చర్చోపచర్చలు! సమర్థించే వారు, తప్పు పట్టేవారు! సోషల్ మీడియా మేధో వర్గం అంతా ఆ సినిమాపై స్పందించేసింది! అర్జున్ రెడ్డి కన్నా.. ప్రీతీదే గొప్ప వ్యక్తిత్వం అంటూ కితాబిచ్చింది! ఎలాగైతేనేం.. ఒక సినిమా ఎంత సంచలనం సృష్టించగలదో అంతా చేశాడు అర్జున్ రెడ్డి. రోజుల వ్యవధిలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, ప్రీతీ షెట్టిగా చేసిన హీరోయిన్ పేరు మార్మోగిపోయింది. ఇంతకీ ఎవరు వీళ్లు, ఎక్కడి నుంచి వచ్చారనే నేపథ్యం గురించి బోలెడంత సెర్చ్ జరిగింది. వారి పాత ఇంటర్వ్యూలు ఉన్నాయా.. అని నెటిజన్లు వెదుక్కొన్నారు!
కేవలం తెలుగు వారిని మాత్రమే కాదు.. దక్షిణాది భాషల వారినీ అర్జున్ రెడ్డి ఆకర్షించాడు. కన్నడీగులు, మలయాళీలు స్ట్రైట్ తెలుగు వెర్షన్ నే ఎంజాయ్ చేశారు. తమిళుడు రీమేక్ చేసుకున్నారు. హిందీలో రీమేక్ అయ్యింది అదంతా వేరే కథ!
ఆగస్టు ఇరవై ఐదో తేదీ, ఆ తర్వాత ఐదేళ్లకు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలైంది. ఈ సారి అపరితమైన ప్రచారం! దర్శకుడు సీనియర్, వేదాంతం చెప్పేస్తున్నాడు. హీరోయిన్ పాన్ ఇండియా స్టార్. హిందీలో విపరీతమైన ప్రమోషన్!
ఒక్క మాటలో చెప్పాలంటే.. అర్జున్ రెడ్డి విడుదలై రివ్యూలు బయటకు వచ్చే వరకూ అదొక సినిమా వస్తోందని పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు! అందకు పూర్తి విరుద్ధంగా .. హైపర్ పబ్లిసిటీతో లైగర్ వచ్చింది! ఈ సినిమాల ముందుస్తు ప్రచారం, అంచనాల విషయంలో ఎంత తేడా ఉందో, సినిమా చూసిన వారి నుంచి వస్తున్న స్పందనల్లోనూ అంత తేడా ఉంది! అర్జున్ రెడ్డి వచ్చి ఏడాది, రెండేళ్లు అయ్యాయి, మూడేళ్లు పూర్తయ్యాయనేది ఇన్నాళ్లూ ఆగస్టు 25 తేదీన వినిపిస్తూ వచ్చిన మాట. మరి ఇక నుంచి విజయ్ కు సంబంధించి ఇదే తేదీన లైగర్ వంటి సినిమా కూడా వచ్చిందని మరో రీతిన గుర్తుండిపోతుందేమో!