స‌స్పెన్ష‌న్లు.. ఆజాద్.. బీజేపీ వ్యూహాల్లో మార్పు!

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ హార్డ్ కోర్ కాషాయ‌ధారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. నుపుర్ శ‌ర్మ వ్య‌వ‌హారం స‌మ‌యంలో ఆమెతో పాటు మ‌రొక‌రిపై, ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే…

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ హార్డ్ కోర్ కాషాయ‌ధారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. నుపుర్ శ‌ర్మ వ్య‌వ‌హారం స‌మ‌యంలో ఆమెతో పాటు మ‌రొక‌రిపై, ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒకింత క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంది! 

గ‌మ‌నిస్తే.. 2014లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకున్నాకా.. కొంద‌రు కాషాయ అతివాదులు గ‌ట్టిగానే మాట్లాడారు. మైనారిటీల ప‌ద్ధ‌తులు, ఆచారాల విష‌యంలో కూడా వారు హేళ‌న చేశారు. అవి దేశ అభివృద్ధికి విఘాతాలు అంటూ వారు వ్యాఖ్యానించారు! ఒక క‌ర్ణాట‌క‌లో అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఇటీవ‌లి వ‌ర‌కూ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయ్యే త‌ర‌హా నిర్ణ‌యాల‌ను తీసుకుంది. నాణేనికి అదంతా ఒక వైపు.

ఒక‌వేళ నుపుర్ శ‌ర్మ‌, రాజా సింగ్ ల విష‌యంలో బీజేపీ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోయినా ఎవ్వ‌రూ అడిగేదేమీ లేదు! ఇదంతా మామూలే అనే పరిస్థితి ఉందిప్పుడు.  వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎవ్వ‌రు ఎంత ఆందోళ‌న వ్య‌క్తం చేసినా.. లెక్క చేయ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం బీజేపీకి ఏ మాత్రం క‌ష్టం కాదు! అయినా.. వారిపై స‌స్పెన్ష‌న్ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంది క‌మ‌లం పార్టీ! 

ఇంకోవైపు కొన్నాళ్ల కింద‌ట అప్ప‌టి కాంగ్రెస్ నేత గులాంన‌బీ ఆజాద్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ముగించుకుంటున్న వేళ ప్ర‌ధాని మోడీ గ‌ట్టిగా ప్ర‌శంసించారు! అప్ప‌టి వ‌ర‌కూ ఆజాద్ పై మోడీకి అంత సానుకూల అభిప్రాయాలు ఉన్నాయ‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు! అంతే కాదు… ఆజాద్ మ‌రీ అంత దార్శానిక నేతా అంటే నోళ్లెళ్ల బెట్టుకుని చూడాల్సిందే!

క‌శ్మీరీ ముస్లిం నేత‌లంతా వేర్పాటు వాదులే అన్న‌ట్టుగా కాషాయ‌ధారులు ప్రచారం చేస్తూ వ‌చ్చారు. అయితే బీజేపీనే ముఫ్తీల పార్టీతో చేతులు క‌లిపి ఒక ద‌శ‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఇలా బీజేపీ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా అవ‌తలి వారి ఇమేజ్ మారిపోతూ ఉంటుంది. రేపోమాపో ఆజాద్ కీర్తిస్తూ, దాదాపు ఇప్ప‌టికే వాట్సాప్ యూనివ‌ర్సిటీ ప‌ని కూడా మొద‌లుపెట్టి ఉంటుంది కూడా!

ఆజాద్ అరివీర భ‌యంక‌రుడు అని, దేశంకోసం ధ‌ర్మం కోస‌మ‌ని వాట్సాప్ లో పుంఖానుపుంఖాల వ్యాసాలు వ‌స్తాయి. క‌శ్మీర్ లో ఆర్టిక‌ల్ 370ను అయితే ఎత్తేశారు కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల్లేవు! ఎన్నాళ్లు అలా మ‌గ్గ‌బెడ‌తారు? ఎన్నిక‌ల‌ను ఎప్ప‌టికి నిర్వ‌హించ‌గ‌లుగుతారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్లేవు! 

ఇలాంటి నేప‌థ్యంలో ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డం, సోనియా- రాహుల్ ల వైఖ‌రికి ఇది ఎదురుదెబ్బ‌లా ఉండ‌టం, ఆజాద్ మ‌ళ్లీ క‌శ్మీర్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతార‌ని.. కొత్త పార్టీ పెడ‌తార‌ని వార్త‌లు వ‌స్తూ ఉండ‌టంతో.. క‌శ్మీర్ లో ఎన్నిక‌లను ఎలాగైనా నిర్వ‌హించాల‌నే వ్యూహంతో ఆజాద్ ను ఇలా క‌మ‌లం పార్టీ వారు భుజానికి ఎత్తుకుంటూ, ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారేమో!