జార్ఖండ్ లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు నేపథ్యంలో.. ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన ఛత్తీస్ గఢ్ వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ రిసార్టుల్లో ఎమ్మెల్యేలను పెట్టుకుని తదుపరి రాజకీయ కార్యచరణను రచిస్తున్నట్టుగా ఉన్నారు శిబు సోరెన్ తనయుడు.
కొన్ని నెలల కిందట జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ లో సోరెన్ పార్టీ జీఎంఎం, కాంగ్రెస్ ల కూటమి అధికారాన్ని సంపాదించుకుంది. మొత్తం 81 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో జేఎంఎం కు 30 సీట్లు, కాంగ్రెస్ కు 18, ఆర్జేడీకి ఒక సీటు బీజేపీకి 26 సీట్లు దక్కాయి.
యూపీఏ రూపంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తన కుటుంబ సంస్థకే మైనింగ్ కాంట్రాక్టును ఇచ్చుకున్నారనే ఆరోపణలు హేమంత్ పై వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర గవర్నర్ కు నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవి పోయినా సోరెన్ రాజీనామా అవసరం ఉండదు.
ఆరు నెలల్లో ఆయన మళ్లీ చట్ట సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నంత వరకూ ఆయన పదవిలో కొనసాగవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ వేసిన వేటుపై ఆయన కోర్టుకు వెళతారో, మళ్లీ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందో ఉండదో.. ఇవన్నీ తక్షణం తేలే అంశాలు కాదు.
అయితే సీఎంపై ఎమ్మెల్యేగా వేటు పడిన నేపథ్యంలో బీజేపీ ఇక ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందనే విశ్లేషణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఆయన రాష్ట్రం దాటినట్టుగా ఉన్నారు. స్పష్టమైన మెజారిటీ అయితే ఉంది. అయితే బీజేపీ చేతిలో 26 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వం పడిపోవడం అంత తేలిక కాదు. మరొకరిని సీఎం సీట్లో కూర్చోబెట్టి సోరెన్ చక్రం తిప్పవచ్చు.
అలాంటి ఏర్పాట్లలో ఉన్నారో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రిసార్ట్ రాజకీయం నడుస్తోంది. ఈ మధ్యకాలంలో బీజేపీ దెబ్బకు వివిధ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జార్ఖండ్ వంతు వచ్చింది. ఢిల్లీలోని ఆప్ సర్కారు కూడా బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో ఉందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలను ఎర వేస్తోందంటూ ఆరోపిస్తోంది.