ఎమ్బీయస్‍: జనసమూహాల సైకాలజీ

పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంట్రీ పాయింటు, ఎగ్జిట్ పాయింటు ఫిక్స్ చేసుకుని, రూటింగు అల్గారిథిమ్ డిజైన్ చేసుకుని గుంపులు ఢీకొనకుండా చూడాలి.

వాహనహచోదకులు ఒక పద్ధతిలో వాహనాలను నడపాల్సి వస్తుంది. వాళ్లకు ప్రత్యేకమైన లేన్స్ ఉంటాయి. స్పీడు పరిమితులుంటాయి. రూల్సు అతిక్రమించే కొందరుండవచ్చు. కానీ ఒక నిర్దిష్టమైన రూలు అంటూ ఉంటుంది. పాదచారులకు అలా ఏమీ ఉండదు. జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలని, ఫుట్ ఓవర్ బ్రిజ్ ఉపయోగించాలని, పాదచారుల గ్రీన్ లైట్ వచ్చేవరకు ఆగాలని, యిలాటి చాదస్తాలు ఏమీ పెట్టుకోరు. రోడ్డుకి అటువైపు వెళదా మనుకున్నప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా చెయ్యెత్తి వెళ్లిపోతారు. ఇది ఊహించక కారు వాడో, స్కూటరు వాడో బ్రేక్ వేయలేక తబ్బిబ్బు పడి, ఆల్మోస్ట్ గుద్దేయబోతే జనాలంతా ‘కళ్లు కనబడటం లేదా?’ అంటూ వాహనదారుణ్నే తిడతారు.

ఈ పాదచారులను ట్రాఫిక్ పోలీసు కూడా ఏమీ చేయలేడు. పది నిమిషాలుగా కాచుకుని కూర్చున్న వాహనదారులు గ్రీన్ లైట్ రాగానే రయ్యిన వెళదామనుకుంటే యీ పాదచారులు అడ్డంగా నడిచేస్తూ అడ్డు పడతారు. ఏ పోలీసూ వాళ్లని అదలించలేడు. తన పోస్టు వదిలి వీళ్లని పట్టుకోవడానికి వచ్చే లోపుల ఎటో తుర్రుమంటారు. ఇదేదో మొదటిసారి బస్తీ చూడడానికి వచ్చిన పల్లెటూరి బైతు చేసే పని అనుకోకండి. సైబర్ టవర్స్ జంక్షన్లో ట్రాఫిక్ లైటు దగ్గర కూడా యిదే పరిస్థితి. చదువుకుని, ఇండియా దౌర్భాగ్యానికి ప్రజల క్రమశిక్షణా రాహిత్యమే కారణమంటూ ఫార్వార్డ్‌లు పంపే ఐటీ జనాభా కూడా యిలాగే ప్రవర్తిస్తారు.

మామూలు పరిస్థితుల్లోనే యిలా ఉంటే, యిక ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడో, ప్రమాదం జరిగి అందరూ ఒకేసారి బయట పడాలని ప్రయత్నించినప్పుడో అయితే యిక చెప్పనలవి కాదు. అంతా గత్తరబిత్తర, గందరగోళం. ఏమిటీ క్రౌడ్ మెంటాలిటీ? దీన్ని అర్థం చేసుకుని, మేనేజ్ చేసే పద్ధతులున్నాయా? మన దగ్గరేనా? లోకంలో అన్ని చోట్లా యింతేనా? అని నాకు ఎప్పుడూ అనిపించేది. 2011లో ‘‘ద ఎకనమిస్ట్’’ అనే వారపత్రిక ‘ద విజ్‌డమ్ ఆఫ్ క్రౌడ్స్’ అని ఒక మంచి ఆర్టికల్‌ను ‘‘అధికారుల సైకాలజీ’’ వ్యాసంలో ప్రస్తావించాను. వివిధ దేశాల పాదచారుల అలవాట్లపై అధ్యయనం చేసిన వివరాలతో కూడిన ఆ వ్యాసానికి నా వ్యాఖ్యానాలు జోడించి దీన్ని రాస్తున్నాను.

మీరు పారిస్‌లో పేవ్‌మెంట్ మీద నడుస్తూంటే, ఎవరైనా ఎదురుగా వస్తే మీరు కుడి వైపుకి తప్పుకుంటారు. అదే ఆసియన్ దేశాల్లో అయితే ఎడమ వైపుకి తప్పుకుంటారు. ఇదేదో ‘కీప్ లెఫ్ట్’ దేశాలకు, ‘కీప్ రైట్’ దేశాలకు మధ్య తేడా అనుకోకండి. లండన్‌ ‘కీప్ లెఫ్ట్’ దేశమే కదా, అక్కడా పాదచారులు కుడివైపుకే తప్పుకుంటారు. ఎందుకిలా? అని బెర్లిన్‌లోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ వారు అధ్యయనం చేశారు. ఈ ప్రవర్తన ప్రాబబిలిటీస్‌పై ఆధారపడి ఏర్పడింది అని తేల్చారు. అంటే మీరు పేవ్‌మెంట్‌పై నడిచినప్పుడు అవతలి వ్యక్తి కుడివైపుకి తప్పుకుంటాడా, ఎడమవైపుకి తప్పుకుంటాడా అనే సంభావ్యతను అంచనా వేసి, దానికి వ్యతిరేక దిశ వైపు మీరు జరుగుతారు. అలా చేయడం వలన ఒకరినొకరు గుద్దుకోకుండా వెళ్లగలిగితే, తర్వాతి సారి కూడా అదే రకంగా చేస్తారు. క్రమేపీ అదే అలవాటుగా మారిపోతుంది. ఆ సమాజంలో అలా ఎక్కువమంది చేస్తూ ఉంటే అది ఆ దేశపు సంప్రదాయంగా మారుతుంది.

ఎదురుబొదురుగా తారసిల్లినపుడు యిలా ప్రవర్తిస్తారు సరే, ఒకేసారి ఏదైనా రైలెక్కడమో, లేదా ట్రాఫిక్ జామ్‌ లోంచి బయటపడే మార్గాలు వెతకడమో చేసినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వాళ్లకు చాలా స్వేచ్ఛ ఉంటుంది, ఏ విధంగానైనా, ఎటువైపుకైనా వెళ్లగలరు. కానీ వాళ్లకు తక్కినవాళ్లు అడ్డు తగులుతూ వాళ్ల గతిని, వేగాన్ని, కదిలే దిశను మార్చేస్తూంటారు. అది ఏ తీరుగా ఉంటుంది అనే దానిపై జ్యూరిక్ లోని మరో యూనివర్శిటీతో సహా మరి కొన్ని సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇదంతా ఏదో సరదా కోసం కాదు, కుతూహలంతో కాదు. ఈ జనసమూహాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోగలిగితే పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో నిర్వాహకులకు తెలుస్తుంది.

ఉదాహరణకి ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీకి అనేక దేశాల ప్రజలు సందర్శకులుగా వస్తారు. ఒక్కో దేశం వారు తమతమ అలవాట్లకు అనుగుణంగా కదులుతూంటే, వాటి మధ్య సమన్వయం లేకపోతే గుద్దుకోవడాలు, తోసుకోవడాలు, క్రింద పడిపోవడాలూ జరగవచ్చు. వాటిని నివారించాలంటే జనాల సైకాలజీ అర్థం చేసుకోవడం అవసరం. 1995లో హెల్బింగ్, పీటర్ మోల్నాట్ అనే ఫిజిసిస్టులు ‘‘సోషల్ ఫోర్స్’’ అనే థియరీతో ముందుకు వచ్చారు. పాదచారుల కదలికలకు, ద్రవాలలో, వాయు పదార్థాల్లో అణువుల కదలికతో అన్వయం చేసి కొన్ని పరిశీలనలు చేశారు. గమ్యస్థానానికి త్వరగా చేరాలనే ఆతృత వారి చలనాన్ని వేగపరిస్తే, దారిలో యితరులు అడ్డు తగలడం వంటివి మందగింప చేస్తాయి.

గుంపు హఠాత్తుగా పెరిగిపోయినప్పుడు అది కొన్ని వరుసలుగా చీలిపోయి, వేగంగా ముందుకు సాగడం కూడా గమనించవచ్చు. అవతలివైపు నుంచి కూడా వేరే గుంపు యిలాగే వస్తూన్నపుడు, అదీ లైన్లు గానే చీలిపోయి వస్తుంది. దాని వలన పాదచారి ఎదురుగా వచ్చే వ్యక్తితో ఢీకొనవలసిన అవసరం పడదు. తన ముందున్న వ్యక్తిని అనుసరించి వెనక్కాలే వెళ్లిపోతే చాలు, ఏ అవరోధమూ తగలదు. అయితే కొందరు వేగంగా నడిచే వాళ్లు, తన ముందు వ్యక్తి నెమ్మదిగా నడుస్తున్నాడనే అసహనంతో అతన్ని ఓవర్‌టేక్ చేసి, పక్క లైనులో వెళ్లబోతే, ఎదురుగా వచ్చే లైను మధ్యకు చీలి, కకావికలై, చివరకు అందరి స్పీడూ తగ్గిపోతుంది.

అందరూ ఒకే టైముకి ఒకే చోట గుమిగూడడం వలన కూడా సమస్యలు వస్తాయి. స్కూలు ప్రారంభమయ్యే టైముకి తల్లిదండ్రులందరూ పిల్లల్ని దింపడానికి స్కూలు గేటు దగ్గరకు వస్తారు. దింపాక వెంటనే వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇంచుమించు అందరూ ఆఖరి ఐదు నిమిషాల్లోనే వస్తారు. దింపేసి వెళ్లిపోదామని చూసేవారు, దింపడానికి వచ్చేవారికి అడ్డు తగులుతారు. టైము దాటిపోతోందన్న ఆదుర్దాతో దింపడానికి వచ్చినవారు మరింత బలంగా వారితో ఘర్షిస్తారు. ఒకటే గేటు కాకుండా ఇన్ గేట్, ఔట్ గేట్ రెండు పెడితే, యిలా అడ్డు తగిలే యిబ్బంది ఉండదు. కొద్దిసేపు ఇన్ గేట్ వద్ద రద్దీ ఉంటుంది. మరి కాస్సేపు ఔట్ గేట్ వద్ద రద్దీ ఉంటుంది తప్ప ఒకే గేటు దగ్గర తోసుకోవడాలు ఉండవు.

లోకల్ రైలు స్టేషన్లలో కూడా దిగేవాళ్లను సాంతం దిగనిచ్చి, ఎక్కేవారు ఎక్కితే యిబ్బంది ఉండదు. కానీ దిగేవారు దిగుతూండగానే, కొందరు ఆదుర్దాతో ఎక్కడానికి ప్రయత్నించి, ఎవరూ ఎటూ వెళ్లలేకుండా చేస్తారు. ఎడమ వైపు నుంచే ఎక్కాలి, ఎడమ వైపు నుంచే దిగాలి అనే పద్ధతిని కచ్చితంగా అందరూ అవలంబిస్తే యీ ఘర్షణ, ట్రాఫిక్ జామ్‌ తప్పుతాయి. ఈ గుమిగూడడం అనేది ట్రాఫిక్ లైట్ల వద్ద వాహనాల విషయంలో కూడా జరుగుతుంది. అందరూ ఆఫీసుకి వెళ్లే టైములో వాహనాలన్నీ ఆఫీసులున్న వైపే వెళతాయి కాబట్టి రెండు, మూడు సార్లు గ్రీన్ లైట్ వచ్చినా ముందుకు వెళ్లే ఛాన్సు రాదు. అటునుంచి వచ్చే వాహనాలు అతి తక్కువ కావడంతో ఆపోజిట్ సైడు రోడ్డు ఖాళీగా కనబడుతుంది.

కానీ ట్రాఫిక్ లైట్లు మారే సమయాన్ని ముందుగానే ఫిక్స్ చేయడంతో యివతలి వైపు వెయిటింగ్, అవతల ఖాళీ రోడ్లు. సాయంత్రమయ్యే సరికి సీను రివర్సు. అందరూ ఆఫీసుల నుంచి వచ్చేస్తూ ఉంటారు. అటువైపు వెళ్లేవాళ్లు ఉండరు. అవతల వెయిటింగు, యివతల ఖాళీ. మాన్యువల్‌గా ఒక పోలీసు చేత మానిటార్ చేయిస్తూ ఉంటే అతను రద్దీకి అనుగుణంగా వెయిటింగు పీరియడ్ మార్చేస్తూ ఉంటాడు. కానీ యిప్పుడంతా మెకానికల్ కాబట్టి, అది కుదరటం లేదు. టెక్నాలజీ పెరిగిన యీ రోజుల్లో సెన్సర్స్ పెట్టి, జంక్షన్‌లో ఉన్న వాహనాలను అంచనా కట్టి, డైనమిక్‌గా లైట్లు మారే టైమింగ్‌ను మార్చేస్తూ ఉంటే యీ యిబ్బందిని అధిగమించ వచ్చు.

ఇక గుంపులో ఉన్న పాదచారుల విషయానికి వస్తే, నడక వేగం, యితరులను తాకడానికి విముఖత కూడా లెక్కలోకి తీసుకోవాలి. 2009లో జర్మన్ల, ఇండియన్ల నడక వేగంలో తేడా గురించి ఒక ప్రయోగం జరిగింది. తాళ్లు, బారికేడ్స్ కట్టి క్రమపద్ధతిలో వెళ్లమన్నారు. రద్దీ తక్కువున్నపుడు మ్యూనిక్‌లో కానీ, ముంబయిలో కానీ జనాలు ఒకే వేగంతో నడిచారు. అయితే రష్ పెరిగిన కొద్దీ ఇండియన్లు జర్మన్ల కంటె ఎక్కువ వేగంగా నడిచారు. జర్మన్లు సాటి మనిషి తగలకుండా నడవడానికి చూడడం చేత వారి నడక మందగించింది. పక్కవాడు తగిలినా, భుజాలు రాసుకున్నా మన ఇండియన్లు పట్టించుకోలేదట.

జనాలు మాలిక్యూల్స్‌లా సంచరిస్తారు అనే ఆలోచన ఒంటరిగా వెళ్లేవారికే వర్తిస్తుంది కానీ గుంపులకు కాదని తేలింది. టూరిస్టు ప్రదేశాల్లో, ఉత్సవాల్లో, సంతల్లో 70శాతం మంది ప్రజలు సమూహాలుగా సంచరిస్తారు. ముగ్గురు, నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతూంటారు. వారిలో మధ్య ఉన్న వ్యక్తులు కాస్త వెనకబడడంతో ఆ గ్రూపు ఇంగ్లీషు ‘యు’ లాగానో, ‘వి’ లాగానో ఏర్పడుతుంది. ఒక ముగ్గురున్న గ్రూపు తొందరగా వెళదామని నిశ్చయించిందనుకోండి, వాళ్లు తిరగేసిన ‘వి’ ఆకారంగా ఏర్పడి, మధ్యలో వ్యక్తి ముందుకు దూసుకు పోతూ ఉంటాడు. తక్కిన యిద్దరూ అతనికి అంగరక్షకులుగా ఉండి, తమ మధ్యలో ఎవరూ దూరకుండా చూస్తారు. మధ్యలో వ్యక్తి కాస్త పొడుగ్గా ఉంటే, అతను ఎదర ఎక్కడ ఖాళీ ఉందో చూడగలిగి, తన టీమును అటువైపు నడిపించగలడు.

ఈ థియరీకి చాలా ప్రయోజనాలున్నాయి. మామూలు సమయాల్లో, ఏ ఎగ్జిబిషన్‌లోనే తీరిగ్గా విహరించేటప్పుడు కొందరు వేగంగా, మరి కొందరు నెమ్మదిగా, బృందసభ్యులు విడిపోతూ, కలుస్తూ ముందుకు సాగడంలో యిబ్బంది లేదు. కానీ తొక్కిసలాట, అగ్నిప్రమాదం వంటిది ఏదైనా జరిగి జనాలను అక్కణ్నుంచి సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయించాలంటే వాలంటీర్లు కొందరు పైన చెప్పిన రివర్స్ ‘వి‘ టీముగా ఏర్పడి ప్రజలను బయటకు నడిపించడం ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే యీ గ్రూపు ముందుకు సాగడం చూసి, తక్కిన గుంపులు కూడా వారిని అనుసరించి, అనుకరించి అందరూ ఖాళీగా ఉన్న గేటు కేసి వెళతారు.

కానీ మామూలుగా అలా జరగటం లేదు. తొక్కిసలాట జరిగిన చోటు నుంచి జనాల్ని దూరంగా తరమడానికి పోలీసులో, వాలంటీర్లో అరచేతులతో, లాఠీలతో, చేతికి ఏది అందితే దానితో జనాల్ని నెట్టేస్తూ ఉంటారు. వారికి ఎటు పోవాలో తెలియక గాభరా పడి, కకావికలై పరుగులు పెడతారు. ఒకరి కొకరు అడ్డం వచ్చి, వేగం మందగిస్తుంది. ఖర్మ కాలి, కంగారులో ఏ చిన్నపిల్లలో, వృద్ధులో, మహిళలో క్రింద పడ్డారంటే వెనక్కాల వచ్చేవాళ్లందరూ వాళ్లపై పడిపోయి, మరింత గలభా జరుగుతుంది. పారిపోవడం మరింత క్లిష్టమౌతుంది. లండన్‌లోని కింగ్స్ క్రాస్ అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో 1987లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు 100 మందికి గాయాలయ్యాయి, 31 మంది పోయారు. ఆ ప్రమాదం తర్వాతనే విపత్తు సమయాలలో ప్రజలు ఎటు పరిగెడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే అంశంపై తీవ్రంగా అధ్యయనం చేశారు.

అందరూ ఒక్కుమ్మడిగా, ఒకే సమయంలో ఎగ్జిట్ గేటు దగ్గరకు పరుగులు పెట్టడం, ఒకేసారి బయటపడడానికి చూడడం ప్రమాదకారణం అవుతోంది. ఈ మోడల్‌ను ‘ఆర్చింగ్’ అనే పేరుతో పిలుస్తారు. తిరగేసిన గరాటా ఆకారం అనుకోవచ్చు మనం. దీన్ని నివారించడానికి ఆ గేటు ఎదుట ఒక స్తంభాన్నో, ఒక బారికేడ్‌నో పెట్టాలి. లేకపోతే కొందరు వాలంటీర్లు గోడలా నిలబడాలి. అప్పుడు వచ్చిపడే జనం విధిలేక లేన్‌లేన్‌లుగా విడిపోతారు. అప్పుడు పురోగమనం సులభమౌతుంది. ఒకే చోట కిక్కిరిసిపోతే ఎవరూ ముందుకు సాగలేరు. కానీ గేటు ఎదురుగా స్తంభాన్ని పెట్టడమనేది పిచ్చి ఐడియా అనిపిస్తుంది వినడానికి. అసలే జనం పారిపోతూ ఉంటే, గేటు దగ్గర చోటు చాలకుండా ఉంటే, మధ్యలో స్తంభం పాతడమేమిటి, బుద్ధి లేకపోతే.. అంటారు.

అందువల మౌసెయిద్ అనే ఒక నిపుణుడు మరో ఉపాయాన్ని సూచించాడు. రాత్రి వేళ ప్రమాదం జరిగితే లైటింగు సహాయంతో జనాలను సరైన దారి వైపు నడిపించవచ్చని అన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ గేటు వైపు జనం ఎక్కువగా ఉండడం చూసి, కొందరు సాహసవంతులు గోడ దూకి పారిపోదామని చూస్తారు. అవతలివైపు గొయ్యి ఉందో, చెఱువు ఉందో కూడా వారికి తెలియకుండా ఆ పని చేస్తారు. అది మరింత ప్రమాదకరమౌతుంది. అందువలన అటువైపు దారిని చీకటి చేసి, గేట్ల వైపు దారి వైపు లైట్లు వేసి పెడితే జనమంతా వెలుగున్న వైపుకే వెళతారంటాడు అతను.

రష్ ఎక్కువైన కొద్దీ ప్రజలకు వివేకం నశిస్తుంది. నెమ్మదిగా అయినా క్యూ కదులుతూంటే జనం ఓపిక పడతారు. కానీ ఎగ్జిట్ వద్ద ఏదైనా అవరోధం కలిగి, క్యూ ఆగితే అసహనానికి లోనవుతారు. వెనకవాళ్లు ముందువాళ్లను తోయడం మొదలుపెడతారు. నిజానికి అలాటి సమయాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మనం అవలంబించే ‘స్టాప్ అండ్ గో’ పద్ధతి మంచిది. కొంతమంది ముందుకు వెళితే తర్వాత వరుస వాళ్లు వేగంగా ముందుకు కదలవచ్చు. కానీ వెనకాల ఉన్నవాళ్లకు యీ యింగితం ఉండదు. రోడ్ల మీద వెయిటింగ్ వాహనాల డ్రైవర్లు హారన్ మోగించి అసహనాన్ని తెలిపినట్లు, వీళ్లు కేకలు వేస్తారు. వరుసల మధ్య గ్యాప్ తగ్గిపోయేట్లా బాగా దగ్గరగా వచ్చేస్తారు. ఒక్కసారిగా జర్క్ యిచ్చినట్లు ముందుకు తోస్తారు. దాంతో కొందరు క్రింద పడతారు, నలిగిపోతారు, ఉక్కిరిబిక్కిరవుతారు, ఊపిరందక స్పృహ తప్పుతారు. దెబ్బకి గుంపు అదుపు తప్పుతుంది.

ఈ విషయంలో ప్రతి జాతికి తమతమ లక్షణాలుంటాయి. వాటిని గమనించి, నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి. పుణ్యక్షేత్రాలు, టూరిస్టు స్పాట్స్, స్టేడియంలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, నదీ స్నానఘట్టాలు – యిలా జనసమ్మర్దం ఏర్పడే ప్రదేశాల్లో కొన్ని కొన్ని చోట్ల బాటిల్‌నెక్స్ ఉంటాయి. అక్కడ జనాల ఫ్లో మందగిస్తుంది. అలాటి చోట సిసిటివి కెమెరాలు పెట్టి ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించి, రద్దీ నివారించడానికి మార్గాలు ముందుగా ఆలోచించి పెట్టుకోవాలి. ప్రజల మనస్తత్వాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సంధ్య థియేటరు సంగతే తీసుకోండి. అక్కడ ఉన్న స్థలం వైశాల్యాన్ని, వచ్చిన జనంతో భాగించి, తగినంత చోటు ఉంది అని లెక్క వేయడం తప్పు. అల్లు అర్జున్ వంటి స్టార్ వచ్చినపుడు తక్కిన స్థలాన్నంతా ఖాళీగా వదిలి, ఉన్న జనమంతా అతను ఉన్న కాస్త స్థలంలోకే తోసుకు వచ్చేస్తారు.

పుష్కరస్నానం చేయడానికి 300 ఘట్టాలు ఏర్పాటు చేశాం, వచ్చిన యాత్రికుల సంఖ్య బట్టి అవి ధారాళంగా సరిపోతాయి. ప్రతి వాడు పది నిమిషాల్లో స్నానం ముగించుకుని వెళ్లిపోతాడు అని ఊహిస్తే తప్పు. గోదావరి అంతా ఒక్కటే అయినా నది మొత్తాన్ని పుష్కరుడు ఆవరించి ఉన్నా, ఒక పర్టిక్యులర్ ఘట్టంలో స్నానం చేస్తేనే పుణ్యం, అందుకే ముఖ్యమంత్రి గారు తన విఐపి ఘాట్ సైతం వదిలిపెట్టి, యిక్కడ స్నానం చేయడానికి వచ్చారు అనే నమ్మకం భక్తుల్లో కలిగినప్పుడు అందరూ అక్కడికే ఎగబడతారు. తక్కిన ఘట్టాలు బావురుమంటూ ఉన్నా అటు వెళ్లరు. మొన్న తిరుపతిలో కూడా పది సెంటర్లు పెట్టాం, 900 కౌంటర్లు పెట్టాం, ఎక్కడా రద్దీ ఉండదు అనే అంచనా తప్పింది కదా. రైల్వే స్టేషన్‌కు, బస్‌స్టాండుకి దగ్గరగా ఉన్న సెంటరుకి జనం కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డారు. ఈ సైకాలజీని ప్లానర్లు ముందుగా స్టడీ చేయాలి. 2004 కృష్ణా పుష్కరాలలో పుష్కర సమయానికి కంటె ముందే 5 గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మరణించారు. దీని అర్థమేమిటి? ఇలాటి తొందరపడి కూసే కోయిలలు కూడా ఉంటారని నిర్వాహకులు ఊహించాలన్నమాట!

పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఎంట్రీ పాయింటు, ఎగ్జిట్ పాయింటు ఫిక్స్ చేసుకుని, రూటింగు అల్గారిథిమ్ డిజైన్ చేసుకుని గుంపులు ఢీకొనకుండా చూడాలి. ఎంట్రీ పాయింట్ల కంటె ఎగ్జిట్ పాయింట్లు ఎక్కువ వుండడం మేలు. ఎందుకంటే ఎగ్జిబిషన్ వంటి వాటిల్లో వేర్వేరు సమయాల్లో లోపలికి వస్తారు కానీ అధిక సంఖ్యాకులు క్లోజింగు టైము వరకు ఉండి ఒకేసారి బయటకు వెళదామని చూస్తారు. ఎగ్జిట్ పాయింట్లు నాలుగు దిక్కులా పెడితే ఆ రద్దీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. జనాభా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి, ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు వేస్తూ ఉండాలి. అవసరమైతే వెన్యూలో స్ట్రక్చరల్ ఛేంజెస్ కూడా చేయాలి. దానికై ప్రతి ఈవెంట్ తర్వాత సిసిటివి ఫుటేజ్ గమనించి, సమూహం కదలిక ఏ తీరుగా ఉందో లెక్కలు వేయాలి.

హజ్ యాత్ర సందర్భంగా జమారత్ బ్రిజ్ విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పి యీ వ్యాసాన్ని ముగిస్తాను. హజ్‌లో యాత్రికులు మూడు స్తంభాలపై ఏడు రాళ్లు వేసే సంప్రదాయం ఉంది. అబ్రహామ్‌ను సైతాను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన చోట ఆ మూడు స్తంభాలు వెలిశాయని నమ్మకం. సైతాను చేష్టకు నిరసనగా కాబోలు భక్తులు రాళ్లు విసురుతారు. హజ్ యాత్రికులు మీనా చేరి సూర్యాస్తమయానికి ముజ్దాలీఫాకి వెళ్లి అక్కడ రాళ్లు సేకరించి, రాత్రంతా ప్రార్థన చేసి, ఉదయం కాగానే మీనాకు తిరిగి వచ్చి యీ స్తంభాలపై రాళ్లు విసురుతారు. తర్వాతే మక్కాకు వెళతారు. రాళ్లు వేయడానికి లక్షలాది మంది ఒకే చోట గుమిగూడతారు కాబట్టి, అందరూ క్రింద నుంచే ఆ స్తంభాలపై రాళ్లు వేయడం యిబ్బంది అవుతోందని 1963లో ఒక బ్రిజ్ కట్టి కొందరు పైనుంచి కూడా వేసే సౌకర్యం కల్పించింది సౌదీ అరేబియా.

అయినా తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతూ ఉండడంతో, అప్పణ్నుంచి ఆ బ్రిజ్‌ను విస్తరిస్తూ పోయింది. అనేకసార్లు డిజైన్ మార్చింది. 2004లో 251 మంది చనిపోయిన తర్వాత ఆ స్తంభాల ఆకృతిలో మార్పులు తెచ్చింది. వాటిని గుండ్రంగా కాకుండా గోడల్లా తయారు చేసి, ఏ మూల నుంచి విసిరినా తగిలేలా తీర్చిదిద్దింది. 2006లో మరో దుర్ఘటన జరిగి 345 మంది చనిపోయారు. 2015లో దాదాపు 1500 మంది పోయారు, వెయ్యి మంది గాయపడ్డారు. దాంతో 1.1 బిలియన్ డాలర్ల ఖర్చుతో కొత్త బ్రిజ్ కట్టారు. మల్టీ లెవెల్ ఎంట్రీ పాయింట్లు 11, ఎగ్జిట్ పాయింట్లు 12 ఉండేట్లు చేశారు. బ్రిజ్ పొడుగు 950 మీటర్లు, వెడల్పు 80 మీటర్లు ఉండేట్లు చేసి 3 లక్షల మందిని హేండిల్ చేసే సామర్థ్యాన్ని సమకూర్చారు.

ఇంత చేసినా యికపై ప్రమాదాలు జరగవవన్న హామీ ఎవరూ యివ్వలేరు. ఎందుకంటే అక్కడకు చేరేవారు విశ్వాసం రీత్యా ఒకే మతానికి చెందినవారు కానీ, జన్మరీత్యా వివిధ దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందినవారు. అందువలన వారి కదలికలలో వైవిధ్యం ఉంటుంది. పైగా ‘ఇటువంటి పవిత్ర స్థలంలో ప్రాణం పోయినా దేవుణ్ని డైరక్టుగా చేరతాం’ అనే భావతీవ్రత ఉంటుంది. అందువలన నిరంతర నిఘా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేసే సత్తా, మందీమార్బలం ఉండాలి.

ఏది ఏమైనా జనసమూహాలను మేనేజ్ చేయడమనేది రోజురోజుకి మారే శాస్త్రం. ఎప్పటికప్పుడు దాన్ని అధ్యయనం చేస్తూ, దానిలో పోలీసులకు, వాలంటీర్లకు తర్ఫీదు యివ్వవలసిన అవసరం ఉంది. దాంతో పాటు ప్రజలను హెచ్చరించవలసిన అవసరం కూడా ఉంది. గత ఏడాది హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన యీ రోడ్డుపై యింతమంది పోయారు, రాంగ్‌ సైడ్ వెళ్లడం వలన యింతమంది పోయారు వంటి హోర్డింగులు వీధుల్లో పెట్టినట్లే, ‘క్రితం ఏడాది ఫంక్షన్‌లో తొక్కిసలాటలో యింతమంది పోయారు, యింతమంది గాయపడ్డారు’ వంటి హోర్డింగులు కూడా ఉత్సవాల సమయంలో పెట్టాలి. (ఫోటో క్రింద భాగంలో జమారత్ స్తంభాల ఆకృతి చేసిన మార్పులు గమనించవచ్చు)

– ఎమ్బీయస్ ప్రసాద్

9 Replies to “ఎమ్బీయస్‍: జనసమూహాల సైకాలజీ”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Prasad garu

    I’m a big fan of yours and read everything you share. I have never responded before, but I’m a huge admirer of your wisdom across various areas. Regarding this article, you are absolutely right. Many developed countries adopt strategies to manage crowds and start training the public from schools. Since I live in the U.S., let me explain how the U.S. system manages large crowds.

    They believe in the “right is right” rule. Whether it’s driving, walking, or yielding, they follow the “move right” rule, including when overtaking. This rule is enforced strictly. Imagine public commuting here: everyone owns at least two cars, and most school kids are dropped off by car, so that’s at least one car per kid. How do they manage the flow? They have one entry and one exit point. Parents must drop their kids off at the driveway and then move on, following the volunteers who help keep the flow moving. People tend to drop their kids off at the last minute, which is a natural behavior, but that causes many cars to arrive at the same time. This is only manageable with organized entry/exit routes.

    I believe we in India should also strictly enforce crosswalks. In the U.S., police can issue a fine if they catch you crossing the road outside of a crosswalk. I believe we should adopt this practice and inform the public that crossing the road outside of designated crosswalks should be penalized. This could be a basic part of the education system—teaching people the importance of using crosswalks and following road safety rules. I know we have all been trained in school, but the training needs to come with strict enforcement of the rules.

    Finally, it’s tragic how lives are lost at pilgrimage sites due to poor crowd management at ticket counters. What I don’t understand is how, when a large crowd gathers at the gates, they just open them without first adjusting the crowd to follow proper lane discipline. It’s a simple observation: when the gates open, the crowd rushes in, and this often leads to chaos. Why can’t they understand this basic logic, or do they expect the crowd to somehow manage entry on their own?

    In conclusion, we absolutely need to adopt this training starting in schools and enforce the rules strictly.

    Sashi Maddali

  4. సౌదీ అరేబియా గురించి ఉదాహరించినందుకు ధన్యవాదాలు .. ప్రభుత్వాలు ఎంత చేసిన, AI వాడినా .. mob మెంటాలిటీ అంచనా వెయ్యడం అతి కష్టం ..

  5. మాబ్ మెంటాలిటీ సైంటిఫిక్ అండ్ రేషనల్ ఆర్గుమెంట్ కి దొరకదు. మనం చేసే తప్పు ఎవ్వరు గుర్తు పట్టలేరు, తెలిసే అవకాశం లేదు అన్నప్పుడు మనుషులు తప్పు చేస్తారు. మాబ్ లో వున్నప్పుడు ఇలా చెయ్యడం ఈజీ, తప్పకుండ చేస్తారు. దీనిని నివారించాలంటే , జన సాంద్రత పెరగకుండా చూడటం, అది నిన్నటి రోజు లాంటి పుణ్య ఘడియల్లో కుదరదు. రెండోది, ముసలి, ముతక, పిల్ల, స్త్రీలను ఆ మాబ్ దారిన పడకుండా వేరే ప్రవేశ ద్వారాలు కల్పించాలి, అయితే కుటుంబ సమేతం గ వచ్చేవాళ్ళకి అది కూడా కుదరక పోవచ్చు. అందుకని వీటిని నివారించడం కష్ట సాధ్యం తో కూడుకున్నవి.

Comments are closed.