వివిధ రంగాల ప్రముఖులతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల మునుగోడు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చారు. సభ అనంతరం ఆయన టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో ఆయనతో అమిత్‌షా భేటీ సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చారు. ఈయన పర్యటన షెడ్యూల్లో ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాల్రాజ్తో భేటీ వుంది. ఇటీవలే మిథాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. భారతీయులు క్రికెట్ ప్రేమికులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ మిథాలీ అభిమానులు కేవలం మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ఉన్నారు.
భారతీయ మహిళా క్రికెట్‌కు మిథాలీ సేవలు అమూల్యం. మిథాలీ రాజ్ స్ఫూర్తితో ఎంతో మంది అమ్మాయిలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో మిథాలీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు భేటీ కావాలని నిర్ణయించుకోవడం వెనుక క్రికెట్ అభిమానుల ఆదరణ చూరగొనడమే అనే అభిప్రాయాలున్నాయి. వరంగల్ సభ తర్వాత సినీ హీరో నితిన్‌తో కూడా జేపీ నడ్డా భేటీ కానున్నారు.
వివిధ రంగాల ప్రముఖులను కలిసి చర్చించడం ద్వారా, వారికి సంబంధించిన దృష్టిని తమ వైపు మళ్లించుకోవడమే అని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదిలి పెట్టడం లేదు. బీజేపీ ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. రాజకీయంగా ఎంత వరకు దోహదం చేస్తాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.