పిచ్చోడి చేతిలో రాయిగా మారింద‌న్న ఎన్వీ ర‌మ‌ణ‌

సెక్షన్ 124-A (దేశద్రోహం నేరం కింద కేసు) పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీశారు. రాజద్రోహం కేసులు పెట్టడానికి కార‌ణ‌మైన‌ ఈ 124-A…

సెక్షన్ 124-A (దేశద్రోహం నేరం కింద కేసు) పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీశారు. రాజద్రోహం కేసులు పెట్టడానికి కార‌ణ‌మైన‌ ఈ 124-A ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

స్వాతంత్ర్య సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

పాత కాలపు పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నిల‌దీయం గ‌మ‌నార్హం. కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ సెక్ష‌న్ వ‌ల్ల‌ వ్యవస్థలకు, వ్యక్తులకు తీరని నష్టం జరుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా 124-A సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. అన్నింటినీ కలిపి విచారించడానికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తున్న వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, ప్ర‌జాసంఘాల నేత‌ల‌పై పాల‌కులు రాజ‌ద్రోహం చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేస్తుండ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేయ‌డం అన్యాయ‌మ‌ని ఉద్య‌మిస్తున్నా ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. 

ఈ నేప‌థ్యంలో ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాలంటూ పెద్ద సంఖ్య‌లో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ప‌లువురు ఆశ్ర‌యించిన నేప‌థ్యంలో చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.