ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతోపాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాస్త ఆలస్యంగానైనా జగన్ ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని అగ్రవర్ణాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యావకా శాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉద్యోగాల్లో కూడా ఆ రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును గట్టిగా నిలదీశారు. చంద్రబాబు దృష్టిలో కాపులు బీసీలా? ఓసీలా? అని ఆయన ప్రశ్నించారు. బాబు నిర్ణయంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకున్నట్టు ఆయన గుర్తు చేశారు.
కాపులను చంద్రబాబు మోసం చేశారనేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉదాహరణ అని మంత్రి చెప్పుకొచ్చారు. బీసీ ఎఫ్ కేటగిరీ అని, మళ్లీ ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం పేరుతో రెండు తీర్మానాలను బాబు హయాంలో చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో కాపులను మోసం చేసేలా తీర్మానం చేశారని మండిపడ్డారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలతో కాపులు నష్టపోయారని కన్నబాబు స్పష్టం చేశారు. కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా బాబు వ్యవహరించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన జీవోతో కాపులతోపాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని కన్నబాబు స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఆదుకోవాలనేదే సీఎం జగన్ లక్ష్యమని కన్నబాబు పేర్కొన్నారు.