ప్రభాస్ చేస్తున్న 3 సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తే, సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతోంది. ఈ సినిమా సెట్స్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ బాగా కలిసిపోయారట. ఎంతో ఛిల్ అవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ కృతి సనన్ చెప్పుకొచ్చింది.
ప్రభాస్ కు మొహమాటం ఎక్కువని చాలామంది చెబుతుంటారని, కానీ అతడితో పరిచయమైన తర్వాత అవన్నీ తప్పని రుజువయ్యాయంటోంది కృతి సనన్. అంతేకాదు.. ఓ విషయంలో తను, ప్రభాస్ బాగా కలిసిపోయామంటోంది.
“ప్రభాస్ చాలా మొహమాటస్తుడు, పెద్దగా మాట్లాడడు అని చాలామంది నాతో చెప్పారు. కానీ నా విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. మొదటిసారి ప్రభాస్ తో మాట్లాడినప్పుడు కాస్త మొహమాటంగా హాయ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత బాగా కలిసిపోయాం. ప్రభాస్ చాలా మాటకారి. చాలా సరదా మనిషి. మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉంది. ప్రభాస్ ఫుడ్ బాగా ఇష్టపడతాడు. నాకు కూడా ఫుడ్ అంటే ఇష్టం. బహుశా అదే మా ఇద్దర్నీ దగ్గర చేసిందనుకుంటాను.”
ఇలా ప్రభాస్, తను బాగా కలిసిపోయామంటోంది కృతి సనన్. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. సినిమాలో రావణ్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించబోతున్నాడు.