మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై ఇప్పటి వరకూ జరిగిన రచ్చకు తోడయ్యారు నటుడు బాలకృష్ణ. ఇది వరకటి మా కమిటీలపై వ్యంగ్యంగా స్పందించారు బాలకృష్ణ.
ఇప్పటి వరకూ మా భవనం కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎకరం భూమిని సంపాదించలేకపోయారంటూ దెప్పి పొడిచారు. అలాగే మా నిధుల కోసమంటూ విమానాల్లో బిజినెస్ క్లాసుల ప్రయాణాలు చేశారని, వాటి ఫలితం ఏమిటంటూ బాలకృష్ణ ప్రశ్నించడం గమనార్హం. ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.
అలాగే మా కు సంబంధించిన సమస్యలను బహిరంగంగా ప్రస్తావించడాన్ని బాలకృష్ణ తప్పు పట్టారు. కానీ ఆయన అదే పని చేశారు! ఇప్పటికే విబేధాలు రచ్చకు ఎక్కడాన్ని తప్పు పట్టిన బాలకృష్ణ.. తను కూడా తన అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్త పరిచారు.
ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంశాన్ని మాత్రం బాలకృష్ణ ఖండించలేదు. లోకల్, నాన్ లోకల్ అభ్యంతరాలు తనకు లేవన్నారు. అయితే మంచు విష్ణు ప్రతిపాదనకు బాలకృష్ణ మద్దతు పలికారు. మా కోసం శాశ్వత భవనాన్ని తాను నిర్మిస్తానంటూ ఇటీవల మంచు విష్ణు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అందులో తను కూడా భాగస్వామినవుతానంటూ బాలకృష్ణ ప్రకటించుకున్నారు.
మొత్తానికి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి భవనం వద్దకు చేరుతోంది. కొత్త కమిటీ ఏర్పడ్డాకా ఎలాగైనా భవనాన్ని నిర్మిస్తారని, ఆ భవనం విషయంలోని రాజకీయమే ఇప్పుడు మా అధ్యక్ష ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మారుస్తోందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కూడా అదే అంశంపై స్పందించారు.
ఇన్నాళ్లూ భవనం ఎందుకు కట్టలేకపోయారంటూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారాయన! కొత్త భవనం నిర్మాణంలో తను కూడా వ్యక్తిగతంగా భాగస్వామినవుతానంటూ బాలకృష్ణ ప్రకటించేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల విషయంలో సూటిగా మాత్రం స్పందించలేదు. రొటీన్ గా.. తన బ్లడ్డూ, బ్రీడు వేరన్నట్టుగా మాత్రం ఉంది ఆయన స్పందన!